Andhra Pradesh Assembly Elections Results 2024 : ఏపీ ఎన్నికల కౌంటింగ్‌లో తొలి ఫలితం ఇదే! ఆ 4 నియోజకవర్గాల రిజల్డ్స్‌ కోసం రాత్రి వరకు ఎదురు చూడాల్సిందే

AP Assembly Elections Results Updates: ఏపీలో ప్రజలంతా పరీక్ష రాసిన విద్యార్థుల్లా టెన్షన్ పడుతున్నారు. ఎక్కడ చూసిన ఇదే చర్చ. అందుకే ఎన్నికల సంఘం కూడా త్వరగా ఫలితాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

Continues below advertisement

AP Elections Counting 2024 Updates : తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్తు దేశం ఏపీ ఫలితాలపై ఆసక్తిగా ఎదురుచూస్తోంది. గతంలో ఎన్నడూ లేనంత ఉత్కంఠను రేకెత్తిస్తున్న ఓట్ల లెక్కింపు జూన్ 4న మొదలుకానుంది. ఇప్పటికే ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఓట్లలెక్కింపు ఎలా సాగుతుంది. ఏయే ఫలితాలు ఎప్పుడొస్తాయన్నది ఒకసారి చూద్దాం.

Continues below advertisement

తొలిఫలితం కొవ్వూరు...
కట్టుదిట్టమైన భద్రత నడుమ సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ జూన్ 4న ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. అయితే తొలి ఫలితం కొవ్వూరు(Kovvur), నరసాపురం(Narasapuram)లో వెలువడనుంది. ఎందుకంటే ఈ రెండు నియోజకవర్గాల్లో కేవలం 13 రౌండ్లు మాత్రమే ఉన్నాయి. కాబట్టి అన్నిటికన్నా ముందు ఈ రెండు నియోజకవర్గాల ఫలితాలు వెలువడనున్నాయి. ఒక్కో రౌండు పూర్తవడానికి గరిష్ఠంగా  20 నిమిషాల నుంచి 30 నిమిషాల లోపు మాత్రమే పట్టే అవకాశం ఉంది. కాబట్టి..ఈ రెండు ఫలితాలు త్వరగా వచ్చే అవకాశం ఉంది. రంపచోడవరం(Rampachodavaram), చంద్రగిరి(Chandragiri) నియోజకవర్గాల్లో మొత్తం 29 రౌండ్లలో ఓట్లు లెక్కించాల్సి ఉన్నందున...అన్నింటికన్నా చివర ఈ రెండు ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. అలాగే భీమిలి(Bheemili), పాణ్యం(Panyam) నియోజకవర్గాల ఫలితా కోసం కూడా రాత్రి వరకు వేచి చూడాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా 25 రౌండ్లు చొప్పున ఓట్లు లెక్కించాల్సి ఉంటుంది. 

లెక్కింపు ప్రక్రియ సాగేది ఇలా
ఓట్ల లెక్కింపు విధులకు హాజరయ్యే ఉద్యోగులు ఉదయం 4 గంటలకల్లా  పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత 5 గంటలకు వారికి ఏయే టేబుళ్లు కేటాయించారన్న  సమాచారం అందిస్తారు. ఆ తర్వాత ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుండగా.... తొలుత ఆర్మీ సర్వీస్ ఉద్యోగుల ఓట్లు ఆ తర్వాత పోస్టల్ బ్యాలెట్‌(Postal Ballot) ఓట్లు లెక్కించనున్నారు. ఈ ప్రక్రియ పూర్తికావడానికి అరగంట సమయం పట్టనుంది. ఆ తర్వాత ఉదయం 8.30 గంటలకు ఈవీఎంల ను తెరిచి ఓట్లు లెక్కించనున్నారు.  ఓట్ల లెక్కింపు కోసం ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 14 టేబుళ్లను సిద్ధం చేశారు.  పోలింగ్ బూత్‌ సీరియల్ నెంబర్లు ఆధారంగా వరుస క్రమంలో ఈవీఎం(EVM)లు తెరిచి ఓట్లు లెక్కించనున్నారు. అంటే 14 టేబుళ్లపై  తొలుత 1 నుంచి 14 పోలింగ్‌ బూత్‌లకు సంబంధించిన ఈవీఎంలు తెచ్చి పెట్టనున్నారు. అభ్యర్థులు ఏజెంట్ల సమక్షంలో వాటిని తెరిచి లెక్కించనున్నారు. దీంతో తొలి రౌండ్ పూర్తవుతుందన్నమాట... ఆ తర్వాత రెండో రౌండ్‌లో 15 నుంచి 29 పోలింగ్ బూత్‌ల ఈవీఎంలు తెచ్చి పెట్టనున్నారు.

ఈ విధంగా ఒక్కో రౌండ్‌ పూర్తి చేసుకుంటూ వెళ్లనున్నారు. ఏదైనా ఈవీఎంలో సమస్య తలెత్తినప్పుడు ఆ పోలింగ్ బూత్ ఈవీఎం పక్కనపెట్టి ఆ తర్వాత వరుస సంఖ్యలో ఉన్న బూత్‌ నుంచి లెక్కించుకుంటూ వెళ్తారు. పక్కన పెట్టేసిన ఈవీఎంను చివరిలో మరోసారి చెక్‌ చేయనున్నారు. అప్పటికీ వీలుకాకుంటే ఆ పోలింగ్ బూత్‌లోని వీవీప్యాట్‌(V.V.Pat) స్లిప్‌లు లెక్కించి వాటినే ఓట్లుగా పరిగణించనున్నారు. అలాగే ఈవీఎంల లెక్కింపు పూర్తయినా తుది ఫలితాలు ప్రకటించరు. పోలింగ్ బూత్‌ల సీరియల్ నెంబర్లన్నీ చిట్‌లపై రాసి ఓ బాక్స్‌లో వేయనున్నారు. లాటరీ ద్వారా ఐదు పోలింగ్ కేంద్రాలను ఎన్నుకుని వాటి వీవీప్యాట్‌ స్లిప్‌లు లెక్కించనున్నారు. ఈవీఎంల్లో వచ్చిన ఓట్లకు, వీవీప్యాట్ ఓట్లకు సరిపోలితే సరి లేకుంటే మూడుసార్లు లెక్కించనున్నారు. ఈ మూడుసార్లు కూడా  రెండు ఫలితాలు సరిపోకపోతే....వీవీపీ ప్యాట్ స్లిప్‌లనే  అసలైన ఓట్లుగా భావించి వాటినే పరిగణలోకి తీసుకోనున్నారు.

111 నియోజకవర్గాల్లో మధ్యాహ్నం లోపే ఫలితాలు
రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాల్లో అత్యధికంగా 111 నియోజకవర్గాల్లో 20కంటే తక్కువ రౌండ్లలోనే లెక్కింపు పూర్తికానుంది. ఈ నియోజకవర్గాల ఫలితాలను మధ్యాహ్నం 2 గంటల్లోగా పూర్తిచేయనున్నారు. మరో 60 నియోజకవర్గాల్లో 21 నుంచి 25 రౌండ్ల వరకు ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ ఫలితాలు సాయంత్రానికి అందుబాటులోకి రానున్నాయి. మరో 4 నియోజకవర్గాలు మాత్రమే రాత్రి వరకు లెక్కింపు సాగనుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ  రాత్రి 9 గంటల కల్లా మొత్తం ప్రక్రియ ముగించేలా ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. అయితే ఉదయం 11 గంటల కల్లా ఫలితాల ట్రెండ్ వెలువడే అవకాశం ఉంది.

Continues below advertisement
Sponsored Links by Taboola