Multiplex in Kashmir: జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా శ్రీనగర్‌లో మల్టీప్లెక్స్‌ను మంగళవారం ప్రారంభించారు. దీంతో 3 దశాబ్దాల తర్వాత.. వెండి తెరపై సినిమా చూడాలన్న ఈ ప్రాంత ప్రజల కల నెరవేరింది. కశ్మీర్‌లో ఇదే తొలి మల్టిప్లెక్స్ సినిమా హాలు కావడం విశేషం. INOX రూపొందించిన ఈ మల్టీప్లెక్స్‌లో 520 మంది కూర్చునే సామర్థ్యంతో మూడు థియేటర్‌లు ఉన్నాయి.
అన్ని వసతులు
శ్రీనగర్‌లోని సోన్‌మార్గ్‌లో ఈ మల్టీప్లెక్స్ సినిమా హాల్‌ను నిర్మించారు. స్థానిక వంటకాలను ప్రోత్సహించేందుకు ఇందులో ఫుడ్ కోర్టును కూడా ఏర్పాటు చేశారు. మల్టీపెక్స్‌ను ప్రారంభించిన సందర్భంగా గవర్నర్ మనోజ్ సిన్హా.. దిగవంగత నటుడు షమ్మీ కపూర్‌కు నివాళులర్పించారు.
అమీర్ ఖాన్ నటించిన 'లాల్‌సింగ్ చద్దా' చిత్రం ప్రత్యేక ప్రదర్శనతో మల్టీపెక్స్ ప్రారంభమైంది. సెప్టెంబర్ 30 నుంచి హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ నటించిన 'విక్రమ్ వేద' చిత్రం ప్రదర్శనతో రెగ్యులర్ షోలు ప్రారంభంకానున్నాయి.
థియేటర్లు బంద్
1990లో ఉగ్రవాద సంస్థల బెదిరింపులు, దాడుల కారణంగా కశ్మీర్‌లోని అన్ని సినిమా థియేటర్లను మూసివేశారు. ఆ సమయంలోనే కశ్మీర్ లోయలో 19 సినిమా హాళ్లు ఒక్కొక్కటిగా మూతపడ్డాయి. 1999లో ఫరూక్ అబ్దుల్లా ప్రభుత్వం.. రీగల్, నీలం, బ్రాడ్‌వే థియేటర్లను తెరవడానికి ప్రయత్నించింది.
అయితే ఆ రీగల్ థియేటర్‌పై గ్రెనేడ్ దాడి జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 12 మంది గాయపడ్డారు. దీంతో రీగల్ థియేటర్‌ను మూసివేశారు. భద్రత మధ్య పలు థియేటర్లను నడిపేందుకు ప్రయత్నించినా.. ప్రేక్షకుల సంఖ్య తగ్గడంతో అవి కూడా మాతపడ్డాయి.
Also Read: Congress President Polls: కేసీ వేణుగోపాల్‌కు సోనియా నుంచి అత్యవసర పిలుపు- రీజన్ ఇదే!
Also Read: Union Minister Narayan Rane: కేంద్రమంత్రి రాణెకు షాక్- అక్రమ నిర్మాణంపై భారీ ఫైన్!