టెక్నాలజీ రోజు రోజుకు పెరుగుతున్న వేళ మనం ఉపయోగించే ఎలక్ట్రానిక్ వస్తువులు సరికొత్తగా అందుబాటులోకి వస్తున్నాయి. ప్రస్తుతం వైర్ లెస్ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు స్మార్ట్ ఫోన్లలో పరిచయం చేసిన ‘బ్లూటూత్’ టెక్నాలజీ రంగంలో ఓ విప్లవంగా చెప్పుకోవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే వైర్ లెస్ టెక్నాలజీ అనగానే ముందుగా మనకు గుర్తుకొచ్చేది ‘బ్లూటూత్’ టెక్నాలజీనే.
రెండు డివైజ్ లను కలిపేందుకు ఈ ‘బ్లూటూత్’ను ఉపయోగిస్తాం. ప్రస్తుతం వచ్చిన వైర్ లెస్ హెడ్ ఫోన్స్ అన్నీ ‘బ్లూటూత్’ ద్వారానే కనెక్ట్ అవుతున్నాయి. మనం రోజూ ఉపయోగించే ఈ సాఫ్ట్ వేర్ కు అసలు ‘బ్లూటూత్’ అనే పేరు ఎందుకు వచ్చింది? అని ఎప్పుడైనా ఆలోచించారా? దాని వెనుక ఓ పెద్ద కథ ఉందంటే ఆశ్చర్యం కలగక మానదు. ‘బ్లూటూత్’ అంటూ మనం నిత్యం పలికే ఈ పేరు ఓ పురాతన చక్రవర్తిది. ఆయన ఒకప్పుడు చేసిన పనే ఈ సాఫ్ట్ వేర్ చేస్తుందని దీనికి ఆ పేరు పెట్టారు. ఇంతకీ చక్రవర్తి ఎవరు? ఆయన చేసిన పనేంటి? దీనికి ఆయన పేరు ఎందుకు పెట్టారు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
బ్లూటూత్ పేరు ప్రతిపాదించిన జిమ్ కర్దాచ్
సుమారు మూడు దశాబ్దాల క్రితం ప్రపంచ వ్యాప్తంగా పలు మొబైల్, సాఫ్ట్ వేర్ సంస్థలు వైర్ లెస్ టెక్నాలజీ మీద విపరీతమైన పరిశోధనలు మొదలు పెట్టాయి. 1989లో స్వీడెన్‌కు చెందిన ఎరిక్సన్ మొబైల్ కంపెనీ షార్ట్ లింక్ అనే రేడియో టెక్నాలజీని రూపొందించింది. దీనిని రూపొందించడంతో ఎలక్ట్రికల్ ఇంజినీర్ జాప్ హార్ట్‌సెన్ అత్యంత కీలక పాత్ర పోషించారు. అదే సమయంలో ఇంటెల్, నోకియా, ఐబీఎం లాంటి పలు సంస్థలు సైతం వైర్‌లెస్ టెక్నాలజీపై పరిశోధనలు జరిపాయి. ఒక్కో కంపెనీ వేర్వేరుగా ప్రయోగాలు జరపడం కంటే.. అన్ని సంస్థలు కలిపి ఒకే వేదిక మీద పరిశోధనలు చేయాలని నిర్ణయించాయి. అప్పటికే రూపొందించిన షార్ట్ లింక్ రేడియో టెక్నాలజీని మరింత డెవలప్ చేయాలని తీర్మానించాయి. ఆయా సంస్థల నుంచి కొందరు ప్రతినిధులతో సమావేశం నిర్వహించాయి. ప్రయోగ దశలో ఉన్న వైర్ లెస్ టెక్నాలజీకి ఏదైనా పేరు పెట్టాలని భావించారు. ఆ టీమ్‌లో ఒకరైన జిమ్ కర్దాచ్ ‘బ్లూటూత్’ అనే పేరును సూచించారు.
ఇంతకీ ‘బ్లూటూత్’ అంటే ఏంటి?
క్రీస్తు శకం 958-986 మధ్య కాలంలో డెన్మార్క్, నార్వేను హరాల్డ్ బ్లాట్లాండ్ గొర్మ్‌సెన్ అనే చక్రవర్తి రూల్ చేశాడు. హరాల్డ్ కు ఒక పన్ను నీలి రంగులో ఉండేదని చరిత్రకారులు పుస్తకాల్లో వివరించారు. అందుకే ఆయనకు ‘బ్లూటూత్’ అనే నిక్ నేమ్ కూడా ఉండేది. ఆయన డెన్మార్క్, నార్వే దేశాలను ఎంతో డెవలప్ చేసి మంచి పేరు సంపాదించారు.
ఆయన పేరు ఎందుకు పెట్టారంటే?
పలు ప్రాంతాల్లో ఉన్న ఒక తెగను ఒక్కచోటకి చేర్చిన హరాల్డ్.. డెన్మార్క్.. నార్వే దేశాలను పాలించిన తీరుపై ‘ది లాంగ్ షిప్స్’ అనే నవల వచ్చింది. దాన్ని చదివిన జిమ్ కర్దాచ్.. 1997లో వైర్‌లెస్ టెక్నాలజీకి వర్కింగ్ టైటిల్‌గా ‘బ్లూటూత్’ పేరు ప్రతిపాదించారు. హరాల్డ్ రెండు దేశాలను కలిపి పాలించినట్లుగానే.. ఈ వైర్ లెస్ టెక్నాలజీ రెండు డివైజ్‌లను కలుపుతుందని వెల్లడించారు. ఆయన చెప్పిన విషయం అన్ని సంస్థల ప్రతినిధులకు నచ్చడంతో ఏకగ్రీవంగా అంగీకారం తెలిపారు. 1998లో ‘బ్లూటూత్’ స్పెషల్ ఇంట్రస్ట్ గ్రూప్ (ఎస్‌ఐజీ) ను ఏర్పాటు చేశారు. ఎరిక్సన్, ఐబీఎం, ఇంటెల్, నోకియా, తోషిబా తొలుత ఈ సంస్థలో సభ్యులుగా ఉన్నారు. ఆ తర్వాత పలు కంపెనీలు ఇందులో మెంబర్ షిప్ తీసుకున్నారు. ప్రస్తుతం అన్ని ఫోన్లలో ‘బ్లూటూత్’ తప్పనిసరి అయ్యింది.
Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?