Karnataka Hijab Row: 'హిజాబ్' వివాదం వెనుక కథ వేరుంది- మార్ఫింగ్ ఫొటోలు, తప్పుడు ప్రచారాలు!

ABP Desam Updated at: 10 Feb 2022 08:29 PM (IST)
Edited By: Murali Krishna

హిజాబ్ వివాదం వెనుక పెద్ద కథే ఉన్నట్లు తెలుస్తోంది. హిజాబ్‌ ధరించిన యువతులపై మార్ఫింగ్ చేసి దుష్ప్రచారం చేస్తున్నట్లు కొన్ని పోస్ట్‌లు కనిపిస్తున్నాయి.

హిజాబ్

NEXT PREV

'హిజాబ్'.. కర్ణాటకలో మొదలైన ఈ వివాదం ప్రస్తుతం దేశవ్యాప్త చర్చకు దారితీసింది. హిజాబ్ ధరించి కళాశాలలకు వెళ్లేందుకు తమకు అనుమతి ఇవ్వాలని ఇప్పటికే పలువురు ముస్లిం యువతులు వేసిన పిటిషన్‌పై కర్ణాటక హైకోర్టు విచారణ జరుపుతోంది. అయితే తెరముందు జరుగుతోన్న పరిణామాలు మనకు కనపిస్తున్నా.. తెర వెనుక మాత్రం 'హిజాబ్'పై పెద్ద కుట్రే నడుస్తోంది. అదేంటో చూద్దాం.


ఏం జరుగుతోంది?


కొన్ని రోజుల ముందు వరకు ప్రశాంతంగా ఉన్న కర్ణాటకలో అకస్మాత్తుగా హిజాబ్ వివాదం ఎందుకు మొదలైంది అనేది ప్రస్తుతం మన మదిలో మెదులుతోన్న ప్రశ్న. ఈ వివాదం రాజుకున్న తీరు కూడా పలు అనుమానాలకు తావిస్తోంది.


హిజాబ్ ధరించిన తమను కళాశాలలకు అనుమతించాలని ముస్లిం యువతులు నిరసన చేప్పట్టిన కొన్ని గంటలకే కాషాయ కండువాలు ధరించి నిరసన చేపట్టారు మరో వర్గం విద్యార్థులు. లౌకిక దేశంలో పేరున్న భారత్‌లో ఇలా రోడ్డెక్కి రెండు వర్గాలు బహిరంగ దాడులకు దిగడం పెద్ద సమస్యే. మరి ముఖ్యంగా అభంశుభం తెలియని పసి మనసుల్లో ఇలాంటి విషపు బీజాలు నాటుకోవడం ఆందోళన కలిగిస్తోంది. అందుకే దీని వెనుక పెద్ద కుట్రే ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా హిజాబ్‌పై జరుగుతోన్న ప్రచారం కూడా ఇదే సంకేతాలిస్తోంది.


సోషల్ మీడియాలో


కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో నజ్మా నజీర్ అనే కర్ణాటక యువతి ఫొటో వైరల్ అవుతోంది. హిజాబ్ వివాదం చెలరేగుతోన్న సమయంలో ఈ ఫొటోను పలు సోషల్ మీడియా ఖాతాలు పోస్ట్ చేశాయి. ఈ పోస్టుల్లో ఓ ఫొటోలో యువతి హిజాబ్ లేకుండా ఐ స్క్రీం పార్లర్‌కు, పిజ్జా పార్లర్‌కు వెళ్లిందని.. కానీ స్కూల్‌కు మాత్రం హిజాబ్ ధరించి వెళ్తుందని కామెంట్ రాసి ఉంది. 






కావాలనే విద్వేషాలను రెచ్చగొట్టడానికి ఇలా చేస్తున్నారని ఈ పోస్ట్‌ను షేర్ చేస్తున్నారు. భారత వాయుసేన వెటరన్, ఐఐఎమ్ లఖ్‌నవూ అలమ్నీ అనూప్ వర్మ కూడా ఈ ఫోటోను షేర్ చేశారు. ఆయన చేసిన ఈ ట్వీట్‌ను 7 వేల మంది రీట్వీట్ చేశారు. అయితే ఇందులో నిజమెంతో చూద్దాం.


విద్యార్థిని కాదు


ఈ పోస్ట్‌లో చెబుతోన్న యువతి విద్యార్థి కాదు.. ఆమె జనతా దళ్ సెక్యులర్ (జేడీఎస్) పార్టీకి చెందిన నేత నజ్మా నజీర్ (24). ఇందులో ఉన్న ఆమె ఫోటోలు కూడా 8 ఏళ్ల క్రితం వివిధ సందర్భాల్లో తీసుకున్నవి. అయితే ఆమె హిజాబ్ ధరించిన ఫొటో మాత్రం ప్రస్తుతం తన ఫేస్‌బుక్ ప్రొఫైల్‌గా ఉంది. ఈ విషయాన్ని స్వయంగా నజ్మానే తెలిపారు.



సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ పోస్ట్‌లో ఉన్నది నేనే. ఈ పోస్ట్‌లో నేను ఓ స్కూల్ విద్యార్థిని అని ఉంది. ఇది తప్పు. 2018లోనే నా చదువు పూర్తయింది. ప్రస్తుతం నేను జేడీఎస్ కర్ణాటకకు రాష్ట్ర కమిటీ పరిశీలకురాలిగా ఉన్నా. ఎవరో కావాలని నాపై ఈ దుష్ప్రచారం చేస్తున్నారు.                                                      -          నజ్మా నజీర్, జేడీఎస్ నేత


మార్ఫింగ్ కూడా


అంతేకాదు నజీర్ మార్ఫింగ్ ఫొటో కూడా ఒకటి వైరల్ అవుతోంది. ఈ ఫొటోను ఎవరో ఫొటోషాప్ చేసి పోస్ట్ చేసినట్లు ఆమె తెలిపారు. దీనిపై ఫేస్‌బుక్‌కు కూడా ఫిర్యాదు చేసినట్లు.. తర్వాత దానిని తొలిగించినట్లు వెల్లడించారు. 






మరో ప్రచారం


కర్ణాటకలోని మండ్యా జిల్లాలో చెలరేగిన హింసకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో ఇటీవల వైరలైంది. ఈ వీడియోలో ఓ విద్యార్థిని 'అల్లా హు అక్బర్' అని గట్టిగా నినదించడం కనిపించింది. కాషాయ కండువాలు ధరించిన మరో వర్గం విద్యార్థులు 'జై శ్రీరామ్' అని నినదిస్తుండగా, ప్రతిగా ఆమె వారి ఎదుట ధైర్యంగా 'అల్లా హు అక్బర్' అని నినాదాలు చేసింది. ఓ జాతీయ న్యూస్ చానల్‌తో ఆమె మాట్లాడుతూ తన పేరు ముస్కాన్ అని తెలిపింది.






అయితే ఈ వీడియో వైరల్ అయిన తర్వాత ముస్కాన్ పేరు మీద కూడా కొన్ని పోస్ట్‌లు దర్శనమిచ్చాయి. కావాలనే ముస్కాన్.. హిజాబ్ ధరించి కళాశాలకు వెళ్లిందని ఆరోపణలు వచ్చాయి. ఈ పోస్ట్‌లో ఒక ఫొటోలో యువతి టీ షర్ట్, జీన్స్ వేసుకుని ఉంది. మరో ఫొటోలో కళాశాల వద్ద హిజాబ్ ధరించి ఉంది. ఇది చూపించి.. ముస్కన్ బయట హిజాబ్ ధరించదు. కానీ కళాశాలకు వెళ్లినప్పుడు మాత్రం హిజాబ్ ధరిస్తుందని ఆరోపిస్తూ పోస్ట్‌లు చేశారు. ఇందులో నిజమెంతో చూద్దాం.


ఆ ఫొటోలో ఉంది తను కాదు..  


ముస్కన్ అని ఆరోపిస్తోన్న ఈ ఫొటోలో ఉన్నది కూడా జేడీఎస్ నేత నజ్మా నజీర్. ఈ ఫోటోలో జీన్స్ వేసుకుని ఉన్న తన ఫొటో 2018లో తీయించుకున్నదని ఆమె స్వయంగా చెప్పారు. 






ప్రొ-భాజపా వర్గానికి చెందిన పలువురు ఈ ఫొటోను షేర్ చేసి ప్రచారం చేస్తున్నట్లు ఆమె ఆరోపించారు. దీంతో హిజాబ్ వివాదం వెనుక పెద్ద ప్రచారమే నడుస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ హిజాబ్ వివాదం ఎప్పుడు ముగుస్తుందో చూడాలి.


Also Read: Owaisi On Hijab Row: 'నేను టోపీతో పార్లమెంటుకు వెళ్లినప్పుడు- వాళ్లు హిజాబ్‌తో కళాశాలకు ఎందుకు వెళ్లకూడదు?'


Also Read: Karnataka Hijab Row: 'హిజాబ్' కేసు అత్యవసర బదిలీకి సుప్రీం నో- జోక్యం చేసుకోబోమని వ్యాఖ్య

Published at: 10 Feb 2022 08:29 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.