శాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ ప్రీ-ఆర్డర్లు మనదేశంలో ప్రారంభం అయ్యాయి. ముందుగా ప్రీ-ఆర్డర్ చేసి కొనుగోలు చేసిన వారికి గెలాక్సీ స్మార్ట్ ట్యాగ్‌ను ఉచితంగా అందిస్తున్నారు. ఈ శాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్‌లో గెలాక్సీ ఎస్22, గెలాక్సీ ఎస్22 ప్లస్, గెలాక్సీ ఎస్22 అల్ట్రా స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో వీటిని లాంచ్ చేశారు. వీటిలో 120 హెర్ట్జ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేలు అందించారు. శాంసంగ్ గెలాక్సీ ఎస్22 అల్ట్రా స్మార్ట్ ఫోన్‌లోనే ఎస్-పెన్ కూడా ఉండనుంది.


శాంసంగ్ గెలాక్సీ ఎస్22 ఇండియా ప్రీ-రిజర్వేషన్ వివరాలు
ఈ గెలాక్సీ ఎస్22 సిరీస్ ప్రీ-రిజర్వేషన్లు శాంసంగ్ ఇండియా సైట్‌లో లైవ్ అయ్యాయి. వీటిని ప్రీ-రిజర్వ్ చేసుకోవడానికి రూ.1,999 చెల్లించాల్సి ఉంటుంది. ఇది రీఫండ్ చేసుకునే అవకాశం ఉంది. ఒక్కసారి ప్రీ-బుక్ చేసుకున్నాక కస్టమర్లకు ప్రీ-రిజర్వ్ వీఐపీ పాస్ లభిస్తుంది. గెలాక్సీ ఎస్22 సిరీస్ మోడల్స్ మనదేశంలో ఎప్పుడు అందుబాటులోకి వస్తే అప్పుడు ఈ పాస్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.


ప్రీ-రిజర్వ్ విండో ఫిబ్రవరి 21వ తేదీ వరకు ఓపెన్‌గా ఉండనుంది. ప్రీ-రిజర్వ్ చేసుకున్న వారికి రూ.2,699 విలువైన గెలాక్సీ స్మార్ట్ ట్యాగ్ లభించనుంది. గెలాక్సీ ఎస్22 సిరీస్‌ను ప్రీ-రిజర్వ్ చేసుకున్న వారు తమ వీఐపీ పాస్‌ను మార్చి 10వ తేదీ వరకు ఉపయోగించుకోవచ్చు.


కూపన్ ఉపయోగించుకోకపోతే గడువు ముగిసిన అనంతరం ఆటోమేటిక్‌గా క్యాన్సిల్ అయిపోయి.. సోర్స్ అకౌంట్ రీఫండ్  అయిపోతుంది. ఈ విషయాన్ని శాంసంగ్ ప్రీ-రిజర్వేషన్ వెబ్ పేజీ ఎఫ్ఏక్యూ సెక్షన్‌లో తెలిపింది. దీంతోపాటు మీరు ఎప్పుడు ఈ పాస్‌ను క్యాన్సిల్ చేసుకున్నా.. ప్రీ-రిజర్వ్ చేసుకోవడానికి చెల్లించిన మొత్తం పూర్తిగా రీఫండ్ అవుతుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ ధర గురించిన వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అయితే కొన్ని మార్కెట్లలో వీటి సేల్ ఫిబ్రవరి 25వ తేదీ నుంచి జరగనుంది.


శాంసంగ్ గెలాక్సీ ఎస్22 స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్‌యూఐ 4.1 ఆపరేటింగ్ సిస్టంపై శాంసంగ్ గెలాక్సీ ఎస్22 పనిచేయనుంది. ఇందులో 6.1 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డైనమిక్ అమోఎల్ఈడీ 2X డిస్‌ప్లేను అందించారు. గొరిల్లా గ్లాస్ విక్టస్+ ప్రొటెక్షన్‌ను ఇందులో అందించారు. ఆర్మర్ అల్యూమినియం చాసిస్ కూడా ఇందులో ఉంది. ఇందులో అడాప్టివ్ 120 హెర్ట్జ్ ఫీచర్‌ను అందించారు. 8 జీబీ ర్యామ్ ఇందులో ఉంది.


ఇక కెమెరా విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. ఈ మూడిట్లో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 10 మెగాపిక్సెల్ టెలిఫొటో సెన్సార్ కూడా ఇందులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 10 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.


5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఇందులో ఉన్నాయి. యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, బారోమీటర్, జియోమ్యాగ్నటిక్, గైరో స్కోప్, హాల్, ప్రాక్సిమిటీ సెన్సార్లు కూడా ఇందులో శాంసంగ్ అందించింది. దీని బ్యాటరీ సామర్థ్యం 3700 ఎంఏహెచ్‌గా ఉంది. దీని మందం 0.76 సెంటీమీటర్లు కాగా, బరువు 168 గ్రాములుగా ఉంది.


శాంసంగ్ గెలాక్సీ ఎస్22+ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్‌యూఐ 4.1 ఆపరేటింగ్ సిస్టంపైనే ఈ ఫోన్ కూడా పనిచేయనుంది. ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డైనమిక్ అమోఎల్ఈడీ 2X డిస్‌ప్లేను అందించారు. ఇందులో అడాప్టివ్ 120 హెర్ట్జ్ ఫీచర్‌ను అందించారు. 8 జీబీ ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్‌ను ఇందులో శాంసంగ్ అందించింది.


ఇందులో కూడా వెనకవైపు మూడు కెమెరాలనే అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 10 మెగాపిక్సెల్ టెలిఫొటో సెన్సార్ కూడా ఇందులో శాంసంగ్ అందించింది. గెలాక్సీ ఎస్22 తరహాలోనే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 10 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.


5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6ఈ, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో కూడా ఉన్నాయి. యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, బారోమీటర్, జియోమ్యాగ్నటిక్, గైరో స్కోప్, హాల్, ప్రాక్సిమిటీ సెన్సార్లు కూడా శాంసంగ్ ఈ స్మార్ట్ ఫోన్‌లో అందించింది. దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్‌గా ఉంది. 45W ఫాస్ట్ చార్జింగ్‌ను, 15W వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్‌ను శాంసంగ్ గెలాక్సీ ఎస్22+ సపోర్ట్ చేయనుంది.


శాంసంగ్ గెలాక్సీ ఎస్22 అల్ట్రా స్పెసిఫికేషన్లు
ఈ స్మార్ట్ ఫోన్‌కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఫోన్ బాడీలోనే మొదటిసారి ఇన్‌బిల్ట్ ఎస్-పెన్‌ను అందించారు. ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్‌యూఐ 4.1 ఆపరేటింగ్ సిస్టంపైనే శాంసంగ్ గెలాక్సీ ఎస్22 అల్ట్రా పనిచేయనుంది. ఇందులో 6.8 అంగుళాల ఎడ్జ్ క్యూహెచ్‌డీ+ డైనమిక్ అమోఎల్ఈడీ 2X డిస్‌ప్లేను అందించారు. 120 హెర్ట్జ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌ను ఇందులో అందించారు. 12 జీబీ వరకు ర్యామ్, 1 టీబీ (1024 జీబీ) వరకు స్టోరేజ్‌ను శాంసంగ్ గెలాక్సీ ఎస్22 అల్ట్రాలో అందించారు.


ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఈ స్మార్ట్ ఫోన్‌లో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్‌గా ఉంది. దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 10 మెగాపిక్సెల్ టెలిఫొటో కెమెరా, మరో 10 మెగాపిక్సెల్ సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 40 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.


యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, బారోమీటర్, జియోమ్యాగ్నటిక్, గైరో స్కోప్, హాల్, ప్రాక్సిమిటీ సెన్సార్లు ఇందులో ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 45W ఫాస్ట్ చార్జింగ్‌ను, 15W వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ స్మార్ట్ ఫోన్ సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.89 సెంటీమీటర్లు కాగా, బరువు 229 గ్రాములుగా ఉంది.