హిజాబ్ అంశంపై కేసు విచారణను కర్ణాటక హైకోర్టు నుంచి అత్యవసర బదిలీ చేయాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే ఇందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. హిజాబ్ అంశంపై హైకోర్టులో విచారణ జరుగుతుందని.. ఈ దశలో జోక్యం చేసుకోవడం సరికాదని అభిప్రాయపడింది. కర్ణాటక హైకోర్టు కోరితే పరిశీలిస్తామని స్పష్టం చేసింది భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం.
చెలరేగిన వివాదం..
హిజాబ్ కేసును కర్ణాటక హైకోర్టు నుంచి తొమ్మిది మంది సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కోరారు. కర్ణాటకలో పాఠశాలలు, కళాశాలలు హిజాబ్ వివాదం కారణంగా మూసివేశారని కోర్టు దృష్టికి తెచ్చారు.
ఈ అంశమై సుప్రీంకోర్టు నుంచి ఎటువంటి ఆదేశాలు కోరడం లేదని కేవలం వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించాలని కోరుతున్నట్లు తెలిపారు. అయితే ప్రస్తుతం ఈ కేసును కర్ణాటక హైకోర్టు విచారిస్తుండటంతో జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు పేర్కొంది.
కర్ణాటక హైకోర్టు..
ఈ వివాదంపై బుధవారం విచారణ జరిపిన కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రితురాజ్ అవస్థి నేతృత్వంలోని ధర్మాసనం ఈరోజు మరోసారి విచారించనుంది.
అంతకుముందు జస్టిస్ క్రృష్ణ దీక్షిత్ ఏకసభ్య ధర్మాసనం ఈ వ్యవహారాన్ని విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి రిఫర్ చేసింది. హిజాబ్ ధరించి కళాశాలలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ దాఖలైన ఈ పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ఆయన నిరాకరించారు. విస్తృత ధర్మాసనమే ఈ ఉత్తర్వులపై నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు.
మరోవైపు హిజాబ్‌కు వ్యతిరేకంగా కాషాయపు కండువాలు ధరించిన విద్యార్థులు ర్యాలీలు నిర్వహించారు. శనివారం ఉడుపి కుండాపూర్‌లో కొందరు బాలబాలికలు కాషాయపు కండువాలు ధరించి 'జై శ్రీరామ్' నినాదాలతో ర్యాలీలు చేశారు.
Also Read: Covid Update: దేశంలో తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా 67,084 మందికి వైరస్