Karnataka Hijab Ban: 



నిషేధాన్ని ఎత్తేస్తారా? 


కర్ణాటక హిజాబ్ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎన్నికల్లోనూ పలు చోట్ల ఇదే గెలుపోటములను ప్రభావం చేసింది. గత బీజేపీ ప్రభుత్వంలో దీనిపై ఎన్నో వాదోపవాదాలు జరిగాయి. విద్యాసంస్థల్లో హిజాబ్‌లు ధరించి రావడానికి వీల్లేదని గత ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ వివాదం కోర్టుల చుట్టూ తిరుగుతోంది. అయితే...ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌కి...హిజాబ్ వివాదం సవాలుగా మారింది. కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకూ ప్రభుత్వం అధికారికంగా స్పందించకపోయినప్పటికీ...మంత్రి డాక్టర్ జీ పరమేశ్వర కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, భవిష్యత్‌లో పరిస్థితులకు అనుగుణంగా ఏం చేయాలో ఆలోచించుకుని చెబుతామని వెల్లడించారు. ప్రస్తుతం తమ దృష్టంతా 5 హామీలను నెరవేర్చడంపైనే ఉందని తేల్చి చెప్పారు. అయితే..వారం క్రితమే కాంగ్రెస్ నుంచి ఎన్నికైన ఏకైక మహిళా ముస్లిం ఎమ్మెల్యే కనీజ్ ఫాతిమా సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే హిజాబ్‌పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తామని వెల్లడించారు. ముస్లిం అమ్మాయిలు మళ్లీ కాలేజ్‌లకు వచ్చి, ఎగ్జామ్స్ రాసేలా చొరవ చూపుతామని తెలిపారు. నిజానికి..ఎన్నికల ప్రచారంలోనే డీకే శివకుమార్ ఈ విషయం ప్రస్తావించారు. హిజాబ్ నిషేధంతో పాటు మతపరంగా గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలన్నింటినీ ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. దాదాపు ఏడాదిగా కర్ణాటకలో హిజాబ్ వివాదం కొనసాగుతూనే ఉంది. సుప్రీం కోర్టులోనూ విచారణ జరిగింది. విద్యా సంస్థల్లో మత పరమైన ఆచారాలను పాటించడం సరికాదని కర్ణాటక ప్రభుత్వం తేల్చి చెప్పింది. హిజాబ్‌పై నిషేధం విధించింది. సుప్రీం కోర్టు కర్ణాటక ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగానే తీర్పునిచ్చింది. 


సుప్రీంకోర్టు ఏం చెప్పింది..? 


కర్ణాటక హిజాబ్ వివాదంపై ఇటీవలే సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విద్యా సంస్థల్లో ముస్లిం విద్యార్థినులు హిజాబ్‌ ధరించడాన్ని నిషేధించింది ప్రభుత్వం. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం. ముగ్గురు జడ్జ్‌లతో కూడిన ధర్మాసనం ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. ఆ ధర్మాసనమే ఈ అంశంపై విచారణ జరుపుతుందని స్పష్టం చేసింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేపీ పర్దివాలా ధర్మాసనం ఈ విషయం తెలిపింది. ఓ మహిళా న్యాయవాది ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని కోరగా...ఈ నిర్ణయం తీసుకున్నారు. గతేడాది మార్చి 15వ తేదీన కర్ణాటక హైకోర్టు హిజాబ్‌ను అనుమతించాలని వేసిన పిటిషన్‌లన్నింటినీ కొట్టి పారేసింది. తరగతి గదులు మతపరమైన విధానాలు పాటించేందుకు వేదిక కావని తేల్చి చెప్పింది. ఆ తరవాతే ఈ వివాదం సుప్రీం కోర్టు గడప తొక్కింది. కర్ణాటకలో చెలరేగిన హిజాబ్ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. హిజాబ్ వివాదంపై రెండు వర్గాల విద్యార్థులు పోటాపోటీగా నిరససలు చేశారు. ముస్లిం విద్యార్థినిలు హిజాబ్ ధరించి  రావడాన్ని వ్యతిరేకిస్తూ హిందూ విద్యార్థులు కాషాయ కండువాలతో విద్యా సంస్థలకు హాజరుకావడంతో వివాదం రాజుకుంది. 


Also Read: New Parliament Building: మీ అహంకారంతో కాదు రాజ్యాంగ విలువలతో పార్లమెంట్ తయారైంది - రాహుల్ ఫైర్