Karnataka Elections 2023: 


జగదీశ్ షెట్టర్ అసంతృప్తి 


కర్ణాటక బీజేపీలో అసమ్మతి సెగలు చల్లారడం లేదు. రోజురోజుకీ  రెబెల్‌ లీడర్‌ల సంఖ్య పెరుగుతోంది. టికెట్ ఆశించి నిరాశకు గురైన వాళ్లు క్రమంగా పార్టీని వీడుతున్నారు. కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ఇది బీజేపీకి భారీ నష్టాన్నే మిగిల్చేలా ఉంది. ఇప్పుడు మరో కీలక నేత కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ షెట్టర్ నిరసన గళం వినిపిస్తున్నారు. హుబ్లీ ధార్వాడ్ సెంట్రల్ నియోజకవర్గం నుంచి తప్పుకోవాలని హైకమాండ్ ఆదేశించడంపై గుర్రుగా ఉన్నారు. అధిష్ఠానానికే వార్నింగ్ ఇచ్చారు. తనకు టికెట్ ఇవ్వకపోతే కనీసం 20-25 సీట్లపై ప్రభావం పడుతుందని హెచ్చరించారు. హైకమాండ్‌కి ఒక్క రోజు డెడ్‌లైన్‌ పెట్టిన జగదీశ్...ఆ తరవాతే తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని స్పష్టం చేశారు. బీజేపీ మరో 12 నియోజకవర్గాల అభ్యర్థుల జాబితాను విడుదల చేయాల్సి ఉంది. ఇది పెండింగ్‌లో ఉండగానే...అసమ్మతి నేతలు ఒక్కొక్కరూ హెచ్చరికలు పంపుతున్నారు. ఈ విషయంలో హైకమాండ్‌ పునరాలోచన చేయాలని జగదీశ్ డిమాండ్ చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదని అంటున్నారు. 


"ఎన్నికల్లో ఎలాంటి ప్రతికూల ప్రభావం పడకుండా చూడాల్సిన బాధ్యత పార్టీకి ఉంది. నాకు టికెట్ ఇవ్వకపోతే ఆ ఒక్క సీట్‌లోనే కాదు. రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లో ఆ ప్రభావం తప్పకుండా పడుతుంది. ఇదే విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప కూడా హైకమాండ్‌కు వివరించారు. కనీసం 20-25 నియోజకవర్గాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది"


- జగదీశ్ షెట్టర్, మాజీ ముఖ్యమంత్రి 


జగదీశ్‌కు టికెట్‌ ఇవ్వకపోతే రాజీనామా చేస్తామంటూ కొందరు కౌన్సిలర్‌లు ఇప్పటికే ప్రకటించారు. దీనిపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. 


"నాకు టికెట్ ఇవ్వకపోవడంపై చాలా మంది కౌన్సిలర్‌లు అసంతృప్తితో ఉన్నారు. రాజీనామా చేస్తామని చెబుతున్నారు. వాళ్ల సహనం చచ్చిపోయింది. టికెట్ ఇవ్వకపోతే తప్పకుండా రిజైన్ చేస్తారు"


- జగదీశ్ షెట్టర్, మాజీ ముఖ్యమంత్రి 


ఏప్రిల్ 11న హై కమాండ్ నుంచి జగదీశ్‌కు కాల్ వచ్చింది. పోటీ నుంచి తప్పుకోవాలని ఆదేశించింది. అప్పటి నుంచి ఇలా అసంతృప్తి గళం వినిపిస్తూనే ఉన్నారు. కీలక నేతలు పార్టీ వీడుతున్నారు. లింగాయత్‌ లీడర్‌ లక్ష్మణ్ సవది ఇప్పటికే రాజీనామా చేయగా...ఇప్పుడు మరో నేత రాజీనామా చేశారు. ఆరుసార్లు MLAగా గెలిచిన ఎస్ అంగార రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించారు. మత్స్యశాఖ మంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన...రాజకీయాలకు దూరమవుతున్నట్టు స్పష్టం చేశారు. పార్టీ కోసం ఎంతో శ్రమించిన ఓ నేతకు దక్కాల్సిన గౌరవం ఇది కాదని  మండి పడ్డారు. లాబీయింగ్ చేయడం తనకు చేతకాదని, అందుకే ఇలా వెనకబడిపోయానని అన్నారు ఎస్ అంగార. మరోసారి పోటీ చేసే అవకాశమివ్వాలని రిక్వెస్ట్ చేసినా పట్టించుకోలేదని మండి పడ్డారు. 


"నాకు టికెట్ ఇవ్వలేదన్న బాధ ఏమీ లేదు. కానీ...ఎలాంటి రిమార్క్ లేకుండా ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం, ప్రజల కోసం పని చేసిన నేతకు దక్కాల్సిన గౌరవమైతే ఇది కాదు. పార్టీకి నేనేం అన్యాయం చేశానో హైకమాండ్ చెప్పాలి. కొంత మంది కుట్ర చేసి నాకు టికెట్ దక్కకుండా అడ్డుకున్నారు. నిజాయితీకి పార్టీలో విలువ లేనే లేదు."


- ఎస్ అంగార, కర్ణాటక మాజీ మంత్రి 


Also Read: Matrimonial Site Fraud: బిల్డప్ బాబాయ్‌కే బాబు వీడు, లగ్జరీ కార్‌లు విల్లాలతో ఫొటోలు - రూ.3 లక్షలకు టోకరా