Womens Premier League: బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ విజయవంతంగా ముగిసింది. మార్చి 4 నుంచి 26 వరకు  ముంబైలోని  బ్రబోర్న్, డాక్టర్ డీవై  పాటిల్ స్టేడియాల వేదికగా జరిగిన ఈ టోర్నీకి విశేష స్పందన వచ్చింది.   ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో ఫ్రాంచైజీలను కలిగిఉన్న ముంబై ఇండియన్స్,  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్  ఆడిన మ్యాచ్‌లకు జనం పోటెత్తారు.  ఈ టోర్నీ విజయవంతమైన నేపథ్యంలో వచ్చే సీజన్ నుంచి డబ్ల్యూపీఎల్‌కు మరిన్ని హంగులు అద్దేందుకు బీసీసీఐ ప్రణాళికలు రచిస్తోంది. 


ఇంటా బయటా.. 


డబ్ల్యూపీఎల్‌ ఫస్ట్ సీజన్ ను కేవలం  రెండు   స్డేడియాల్లోనే జరిపించారు.  కానీ 2024 సీజన్ నుంచి  ఈ  లీగ్‌ను కూడా విస్తరించేందుకు బీసీసీఐ ప్లాన్  చేస్తోంది.  ఐపీఎల్‌లో టీమ్స్ ఆడుతున్నట్టు (హోం అండ్ అవే)గానే ఇంటా బయటా మ్యాచ్ లను ఆడించనున్నది. ప్రస్తుతం డబ్ల్యూపీఎల్ లో ఐదు ఫ్రాంచైజీలున్నాయి. బీసీసీఐ ఈ లీగ్ లో హోం అండ్ అవే మ్యాచ్ లను జరిపిస్తే   ముంబై, అహ్మదాబాద్, లక్నో, ఢిల్లీ, బెంగళూరులో మ్యాచ్‌లు జరిగే అవకాశముంది.  ఈ మేరకు  బీసీసీఐ కార్యదర్శి జై షా  శుక్రవారం  మీడియాతో మాట్లాడుతూ..  వచ్చే సీజన్ నుంచి ఇంటా, బయటా మ్యాచ్ లు నిర్వహించే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపాడు.  


మార్చిలో కాదు.. దీపావళికి 


ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఫస్ట్ సీజన్ ను  బీసీసీఐ  మార్చిలో నిర్వహించింది. కానీ వచ్చే సీజన్ నుంచి  దీనిని  దీపావళికి   నిర్వహించనున్నట్టు తెలుస్తున్నది. మార్చిలో  డబ్ల్యూపీఎల్ ముగిసిన వెంటనే ఐపీఎల్ మొదలైంది.  అయితే  ప్రస్తుతానికి  లీగ్ మ్యాచ్‌లు తక్కువగా ఉండటంతో  సీజన్ ను 22 రోజుల్లో ముగించారు. కానీ రాబోయే రోజుల్లో లీగ్  మ్యాచ్‌ల సంఖ్య పెరిగే అవకాశం లేకపోలేదు. అప్పుడు  ఐపీఎల్, డబ్ల్యూపీఎల్  ఒకేసారి జరిగితే అది బీసీసీఐకే ఇబ్బంది.  అందుకే  డబ్ల్యూపీఎల్ ను దీపావళికి షిఫ్ట్ చేస్తున్నట్టు  తెలుస్తున్నది.  జై షా కూడా దీనిపై సాధ్యాసాధ్యాలను  పరిశీలిస్తున్నట్టు తెలిపాడు.  


మహిళా క్రికెట్‌కు ఇప్పుడు బోలెడంత క్రేజ్.. 


డబ్ల్యూపీఎల్ విజయవంతం కావడంతో ఈ లీగ్ కు కూడా   ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడిందని  జై షా చెప్పాడు.  ఈ లీగ్ ను ప్రోత్సహిస్తే ఈ సంఖ్య పెరిగే అవకాశమున్నట్టు  ఆయన  వెల్లడించాడు.   ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన  లీగ్ మ్యాచ్‌లతో పాటు  ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచ్  ప్రత్యక్షంగా చూసేందుకు  ప్రేక్షకులు స్టేడియాలకు పోటెత్తారు.  అలాగే ఈ జట్లు ఆడే మ్యాచ్‌లకు టీవీ రేటింగ్స్ కూడా  ఆశించిన దాని కంటే ఎక్కువే వచ్చాయి.   డబ్ల్యూపీఎల్ ప్రారంభ ఎడిషన్‌ను 50.78 మిలియన్ల మంది వీక్షించారు. తొలి సీజన్ లో  ముంబై - ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్‌‌ను టీవీలలో 0.41 మిలియన్ల మంది చూసినట్టు గణాంకాలు చెబుతున్నాయి.  కాగా తొలి సీజన్ ఫైనల్ ముంబై ఇండియన్స్ - ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగగా  హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబై..  ఫస్ట్ డబ్ల్యూపీఎల్ టైటిల్ ను దక్కించుకున్న విషయం తెలిసిందే.