Tax Saving Deposits: ప్రస్తుత కాలంలో... అటు బ్యాంకుల్లో, ఇటు పోస్ట్‌ ఆఫీసుల్లో సాధారణ ప్రజల నుంచి సీనియర్ సిటిజన్‌ల వరకు అనేక పెట్టుబడి ఎంపికలు అందుబాటులోకి వచ్చాయి. కొంత కాలంగా రెపో రేట్ల పెంపు కారణంగా ఫిక్సిడ్ డిపాజిట్ల మొదలు పోస్టాఫీసు పొదుపు పథకాల (post office saving schemes)  వరకు వడ్డీ రేట్లలో మార్పులు వచ్చాయి. చిన్న మొత్తాల పొదుపు పథకాలపై కేంద్ర ప్రభుత్వం ఇటీవలే వడ్డీ రేట్లను పెంచింది. ఈ పథకాల్లో పన్ను ఆదా పథకాలు కూడా ఉన్నాయి. మరోవైపు, డిపాజిట్లను ఆకర్షించడానికి ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీలను బ్యాంకులు పెంచాయి, సీనియర్‌ సిటిజన్‌ ఖాతాలకు ఎక్కువ వడ్డీని చెల్లిస్తున్నాయి.


2023 మార్చి 31తో 2022-23 ఆర్థిక సంవత్సరం ముగిసింది, ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి 2023-24 ఆర్థిక ఏడాది ప్రారంభమైంది. కొత్త ఆర్థిక సంవత్సరంలో, పన్ను ఆదా చేసే పథకాల్లో పెట్టుబడి పెట్టాలని మీరు ప్లాన్ చేస్తుంటే, ఈ సమాచారం ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. పన్ను ఆదా చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్ల (Tax Saving Fixed Deposits) కంటే ఎక్కువ వడ్డీని ఇచ్చే కొన్ని పోస్టాఫీసు పథకాల ‍‌గురించి తెలుసుకుందాం. ఈ పథకాల్లో... నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్‌ (NSC), పోస్టాఫీస్‌ టైమ్ డిపాజిట్ ‍‌(post office time deposit) వంటి ఆప్షన్లు ఉన్నాయి.


పోస్టాఫీసు పథకాలపై ఎంత వడ్డీ చెల్లిస్తున్నారు?
2023-24 ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి సంబంధించి, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్ మీద వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం 70 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో, గత త్రైమాసికంలో NSC మీద వడ్డీ 7 శాతంగా ఉన్న వడ్డీ రేటు ఇప్పుడు 7.7 శాతానికి పెరిగింది. 


పోస్ట్‌ ఆఫీస్‌ టైమ్ డిపాజిట్‌ మీద కూడా, వివిధ కాల గడువులకు తగ్గట్లుగా వడ్డీ రేటు 7.5 శాతానికి చేరింది. పోస్ట్‌ ఆఫీస్‌ టైమ్‌ డిపాజిట్ల కాల గడువు 1, 2, 3, 5 సంవత్సరాలుగా ఉంటుంది. వీటిలో... 1 సంవత్సరం కాల గడువు ఉన్న డిపాజిట్ మీద 6.8 శాతం వడ్డీ రేటు, 2 సంవత్సరాల కాల గడువు ఉన్న డిపాజిట్ మీద 6.9 శాతం వడ్డీ రేటు, 3 సంవత్సరాల కాల గడువు ఉన్న టర్మ్ డిపాజిట్ మీద 7.0 శాతం వడ్డీ రేటు, 5 సంవత్సరాల కాల గడువు ఉన్న డిపాజిట్ మీద 7.5 శాతం వడ్డీ రేటును ఆఫర్‌ చేస్తున్నారు. ఇది కాకుండా, మరికొన్ని చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను కూడా కేంద్ర ప్రభుత్వం పెంచింది.


FDపై ఏ బ్యాంకు ఎంత వడ్డీ ఇస్తోంది?
దేశంలోని అన్ని ప్రధాన బ్యాంకులు 'పన్ను ఆదా ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల' మదీ గరిష్ట వడ్డీని ఇస్తున్నాయి. HDFC బ్యాంక్ 7% వడ్డీని, యాక్సిస్ బ్యాంక్ 7%, బ్యాంక్ ఆఫ్ బరోడా 6.5%, సెంట్రల్ బ్యాంక్ 6.7%, ICICI బ్యాంక్ 7%, ఇండస్‌ఇండ్ బ్యాంక్ 7.25%, DCB బ్యాంక్ 7.6%, యెస్ బ్యాంక్ 7%, IDFC బ్యాంక్ 7% వడ్డీని ఇస్తున్నాయి. సమాన కాల వ్యవధికి ఇస్తున్న వడ్డీలివి.


పైన చెప్పుకున్న పథకాలన్నీ ఆదాయ పన్ను మినహాయింపు కిందకు వస్తాయి. పోస్టాఫీసు, బ్యాంకులు చెల్లిస్తున్న ఈ వడ్డీ రేట్లను బట్టి, మీకు ఏ పెట్టుబడి ఎంపిక సరిపోతుందో మీరే నిర్ణయించుకోవచ్చు.


ఎంత పన్ను ఆదా అవుతుంది?
మీరు NSCలో డబ్బును డిపాజిట్ చేసి, పాత పన్ను విధానాన్ని ఎంచుకున్నట్లయితే, ఆదాయ పన్ను సెక్షన్‌ 80C కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 1.5 లక్షల పన్ను ఆదా చేయవచ్చు. 'పన్ను ఆదా FD'ల్లో డిపాజిట్ల మీద కూడా ఒక ఆర్థిక సంవత్సరానికి రూ. 1.5 లక్షల వరకు పన్ను ఆదా చేయవచ్చు.