Karnataka Election Results 2023:



ట్విటర్‌లో ట్రెండ్..


"కాంగ్రెస్ ముక్త్ భారత్". బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఇదే నినాదం వినిపిస్తోంది. రెండు సార్లు కేంద్రంలో వరుసగా అధికారంలోకి వచ్చింది కాషాయ పార్టీ. అయినా...ఈ నినాదాన్ని మాత్రం వదలట్లేదు. బీజేపీ నేతలందరూ ఎన్నికలొచ్చిన ప్రతిసారీ ఇదే స్లోగన్ వినిపిస్తుంటారు. నార్త్‌లో గట్టిగానే క్యాడర్ పెంచుకున్న బీజేపీకి సౌత్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో రిజల్ట్స్ కనిపించడం లేదు. ఉన్న ఒక్క కర్ణాటకలోనూ అధికారం కోల్పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్‌ లీడ్‌లో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ బీజేపీకి గట్టి  కౌంటర్ ఇస్తోంది. "కాంగ్రెస్ ముక్త్ భారత్" స్లోగన్‌కి కౌంటర్‌గా "బీజేపీ ముక్త్ సౌత్" (BJP Mukt South India) నినాదాన్ని ఎత్తుకుంది. ట్విటర్‌లో పెద్ద ఎత్తున ఈ హ్యాష్‌ట్యాగ్‌తో పోస్ట్‌లు పెడుతోంది. దక్షిణాది ప్రజలు బీజేపీని రిజెక్ట్ చేస్తున్నారంటూ (BJP Mukt South ) ట్వీట్‌లు చేస్తోంది.






నిజానికి సౌత్‌లో కర్ణాటక చాలా కీలకమైన రాష్ట్రం. బీజేపీ ప్రాతినిధ్యం ఉన్న ఒకే ఒక్క స్టేట్ ఇది. ఇక్కడ గెలిస్తే ఇక్కడి నుంచి సౌత్ మిషన్‌ని విస్తరించాలని ప్లాన్ చేసుకుంది కాషాయ పార్టీ. కానీ...కాంగ్రెస్ హవాతో వెనకంజ వేసింది. అనుకున్న స్థాయిలో ఫలితాలు రాబట్టుకో లేకపోయింది. దక్షిణాదిలో బీజేపీ ఎప్పటికీ నిలదొక్కుకోలేదు అన్న ప్రతిపక్షాల విమర్శలకు ఇది మరింత బలం ఇచ్చింది. ఈ ఫలితాల ట్రెండ్స్‌పై బసవరాజు బొమ్మై స్పందించారు. ప్రధాని సహా కీలక నేతలందరూ వచ్చి ప్రచారం చేసినప్పటికీ అనుకున్న  మార్క్ సాధించలేకపోయామని అన్నారు. కచ్చితంగా ఈ ఫలితాలను రివ్యూ చేసుకుంటామని స్పష్టం చేశారు. 



లోకల్‌ పార్టీల బలం..


వాస్తవానికి సౌత్‌లో బీజేపీకి పెద్దగా క్యాడర్ లేకపోవటానికి కారణం...స్థానిక పార్టీలు బలంగా ఉండడమే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు..ఇలా ఏ రాష్ట్రం చూసుకున్నా లోకల్ పార్టీలు చాలా బలంగా ఉన్నాయి. ఎప్పటి నుంచో అక్కడ వాటి హవా కొనసాగుతోంది. బీజేపీకి నేషనల్ పార్టీ అన్న ముద్ర పడిపోయింది. అందుకే ఓటర్లు స్థానికంగా ఉన్న పార్టీలకే ప్రయారిటీ ఇస్తున్నారు. పైగా...కేంద్ర, రాష్ట్ర రాజకీయాల పరిస్థితులు పూర్తి విరుద్ధంగా ఉంటాయి. లోకల్‌గా ఎలాంటి సమస్యలున్నాయి..? వాటిని ఏ పార్టీ పరిష్కరిస్తుంది..? అన్న అంశాలపైనే గెలుపోటములు ఆధారపడి ఉంటాయి. ఇలా చూసినప్పుడు బీజేపీ "నాన్ లోకల్" అనే ఫీలింగ్ సౌత్‌లోని చాలా మంది ఓటర్లలో ఉండొచ్చు. ఇదే ఆ పార్టీని దెబ్బ కొడుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మాతో కొంత మేర క్యాడర్‌ని ఏర్పాటు చేసుకోగలిగినా...లోకల్ పాలిటిక్స్‌లో మాత్రం ఇమడలేకపోతోంది. తెలంగాణలో కొందరు కీలక నేతలున్నప్పటికీ...అధికార పార్టీని శాసించే స్థాయిలో మాత్రం బలం ప్రస్తుతానికి లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. కేరళలోనూ వామపక్షాల ధాటికి బీజేపీ ఎప్పుడూ వెనకబడిపోతూనే ఉంటుంది. "మాది ప్యాన్ ఇండియా పార్టీ" అని ఆ మధ్య ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కానీ..ఈ ప్యాన్ ఇండియాలో "సౌత్ ఇండియా" కనిపించడం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సేఫ్‌ పొజిషన్‌లో ఉండటం వల్ల బీజేపీ ఆశలు వదులుకుంది. జేడీఎస్‌ కూడా కింగ్‌ మేకర్ రేంజ్‌లో రాజకీయాలు నడిపే పరిస్థితేమీ కనిపించడం లేదు. గత ఎన్నికల కన్నా జేడీఎస్‌కి తక్కువ సీట్లు వచ్చే అవకాశాలున్నాయి. మొత్తానికి...బీజేపీ సౌత్ మిషన్‌కి కర్ణాటక ఎన్నికల ఫలితాలు బ్రేక్ వేశాయనే చెప్పాలి. 



Also Read: Karnataka Election Results 2023: జేడీఎస్‌తో బీజేపీ మంతనాలు! రెబల్స్‌ను బుజ్జగించే పనిలో కాంగ్రెస్!