Karnataka Election Results 2023: 


రిసార్జ్ రాజకీయాలు 


ఓవైపు ఎన్నికల ఫలితాలు విడుదలవుతుండగానే...కర్ణాటకలో రిసార్ట్ రాజకీయాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ స్వల్ప లీడ్‌లో ఉన్నప్పటికీ...మళ్లీ జేడీఎస్ చుట్టూనే ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్‌కి స్పష్టమైన మెజార్టీ రాకపోతే ప్రభుత్వ ఏర్పాటులో జేడీఎస్‌ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే..కాంగ్రెస్ మాత్రం తమకు స్పష్టమైన మెజార్టీ వస్తుందని గట్టిగానే చెబుతోంది. పైగా..తమకు ఎవరి మద్దతూ అవసరం లేదని ధీమాగా ఉంది. కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య కూడా ఇదే విషయంలో క్లారిటీ ఇచ్చారు. సపోర్ట్ అవసరం లేకుండానే గెలుస్తామని అంటున్నారు. కానీ కాంగ్రెస్ కన్నా వెనకబడి ఉన్న బీజేపీ మాత్రం జేడీఎస్‌తో మంతనాలు మొదలు పెట్టినట్టు సమాచారం. ఎన్నికలకు ముందు హెచ్‌డీ కుమారస్వామి సింగపూర్‌కి వెళ్లడమూ చర్చనీయాంశమైంది. అక్కడ కూడా రిసార్ట్ రాజకీయాలు జరుగుతున్నాయా అన్న అనుమానాలకు తావిస్తోంది. ఎన్నికలు జరిగింది కర్ణాటకలోనే అయినా..హైదరాబాద్‌లో మంతనాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. పలు రిసార్ట్‌లలో కీలక నేతలందరూ భేటీ అవుతున్నారని, ఎమ్మెల్యేలను తమవైపు లాక్కునే ప్రయత్నాలూ జరుగుతున్నాయని సమాచారం. 



రెబల్స్‌తో శివకుమార్ మంతనాలు 


కర్ణాటకలో ఓల్డ్‌ మైసూర్‌లో జేడీఎస్‌దే హవా.  కానీ...కాంగ్రెస్‌ ఈ ఓటు బ్యాంకునీ కొల్లగొట్టి లీడ్‌లోకి వచ్చేసింది. ఈ ఫలితాలు చూసిన తరవాతే కాంగ్రెస్...తమకు ఎవరి మద్దతు అవసరం లేదని చాలా కాన్ఫిడెంట్‌గా చెబుతోంది. అలా అని సైలెంట్‌గా ఏమీ లేదు. కర్ణాటక కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ డీకే శివకుమార్ తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. కాంగ్రెస్ రెబల్ నేతల్ని తిరిగి పార్టీలో చేర్చుకునేందుకు మంతనాలు జరుపుతున్నారు. దాదాపు 5గురు ఎమ్మెల్యేలతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. అటు కర్ణాటకలోనూ పలు హోటళ్లలో ప్రముఖుల పేర్లతో రూమ్‌లు బుక్ అయ్యాయంటూ రూమర్స్ కూడా వస్తున్నాయి. ఇందులో నిజమెంత అన్నది తేలకపోయినా... మంతనాలు అయితే జరుగుతున్నట్టు తెలుస్తోంది. 40% కమీషన్ ప్రభుత్వం అంటూ కాంగ్రెస్..బీజేపీపై చేసిన ప్రచారం బాగానే వర్కౌట్ అయిందని హస్తం పార్టీ నేతలందరూ చెబుతున్నారు. కర్ణాటక ఓటర్లు బీజేపీపై ఎంత ఆగ్రహంతో ఉన్నారో ఈ ఫలితాలే చెబుతున్నాయని ప్రచారం చేసుకుంటున్నారు. 



మహారాష్ట్ర సీన్ రిపీట్ అవుతుందా? 


ఇదే సమయంలో డీకే శివకుమార్ రెబల్స్‌ని సమీకరించే పనిలో పడ్డారు. అయితే..ఇక్కడ కీలక విషయం ఏంటంటే..గతంలో కాంగ్రెస్, జేడీఎస్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ...సీఎం కుర్చీ విషయంలో విభేదాలు వచ్చాయి. ఈ సారి కుమారస్వామికి సీఎం పదవి కట్టబెడతామని హామీ ఇచ్చి బీజేపీ జేడీఎస్‌తో కలిసిపోతే మాత్రం కాంగ్రెస్‌కు ఝలక్ తప్పకపోవచ్చు. కానీ...ఇది జరిగే అవకాశమెంత అన్నదీ స్పష్టంగా చెప్పలేం. మహారాష్ట్రలో శిందే వ్యవహారంతో పోల్చి చూస్తే...ఇక్కడా అదే రిపీట్ అవుతుందా అన్నది తేలాల్సి ఉంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కి 80 సీట్లు వచ్చాయి. జేడీఎస్‌కి 37 స్థానాలు దక్కాయి. రెండూ కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. కానీ...సంకీర్ణ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలవలేదు. ఇప్పటికీ కాంగ్రెస్, జేడీఎస్ మధ్య దూరం తగ్గినట్టు కనిపించడం లేదు. గత విభేదాలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ కూడా జేడీఎస్‌తో కాకుండా రెబల్స్‌తో మంతనాలు సాగిస్తోంది. మ్యాజిక్ ఫిగర్‌కు కాస్త అటు ఇటుగా సీట్లు వచ్చినా ఆ రెబల్స్‌ని తమ వైపు లాక్కుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించాలని ప్లాన్ చేసుకుంటోంది. 



Also Read: Karnataka Election Results 2023: కర్ణాటకలో బీజేపీ హిందూ కార్డ్ పని చేయలేదా? బజ్‌రంగ్‌ బలి ప్రభావమెంత?