కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై ప్రమాణస్వీకారం చేశారు. యడియూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బసవరాజ్ రాష్ట్ర హోంమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.


కన్నడనాట రాజకీయ సంక్షోభానికి ముగింపు పలుకుతూ భాజపా శాసనసభాపక్షం సమావేశం మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. బి.ఎస్‌.యడియూరప్ప తర్వాత ముఖ్యమంత్రి పదవికి తాజా మాజీ హోంమంత్రి బసవరాజ బొమ్మై పేరును ప్రతిపాదించింది. కర్ణాటక 20వ ముఖ్యమంత్రిగా బుధవారం బాధ్యతలు స్వీకరించిన బొమ్మై తండ్రి సోమప్ప రాచప్ప బొమ్మై (ఎస్‌.ఆర్‌.బొమ్మై) కూడా గతంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు.  ఆయన సోషలిస్టు ఉద్యమంలో కీలక భూమిక పోషించారు.


కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి ఎంపిక కోసం మంగళవారం సాయంత్రం నిర్వహించిన భాజపా శాసనసభాపక్ష సమావేశంలో అధిష్ఠానం నుంచి పరిశీలకులుగా వచ్చిన కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్‌ సంయుక్తంగా ఓ ప్రకటన చేశారు. యడియూరప్ప మంత్రివర్గంలో హోం, శాసనసభా వ్యవహారాల మంత్రిగా పనిచేసిన బసవరాజ బొమ్మై పేరు వెల్లడించారు. ఆపై మంగళవారం రాత్రి రాజ్‌భవన్‌కు తరలివెళ్లిన బసవరాజ.. సర్కారు ఏర్పాటుకు అవకాశం కల్పించాలని గవర్నర్‌ థావర్‌చంద్‌ గహ్లోత్‌ను కోరారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు అరుణ్‌సింగ్‌, కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, ధర్మేంద్రప్రధాన్‌, భాజపా నాయకురాలు డీకే అరుణ, మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్‌.యడియూరప్ప ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.


బసవరాజ బొమ్మై ఎంపికలో మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప కీలకపాత్ర పోషించారు. అప్ప అత్యంత ఆప్తుల్లో ఒకరైన బసవరాజ బొమ్మై నాయకత్వాన్ని దాదాపు అందరూ ఆమోదించారు. శాసనసభాపక్ష సమావేశంలో ఆయన పేరును యడియూరప్ప ప్రతిపాదించగా మాజీ ఉపముఖ్యమంత్రి గోవింద కారజోళ ఆమోదించారు. తన పేరు ప్రకటించగానే బసవరాజ స్పందించి.. యడియూరప్ప పాదాలకు నమస్కరించారు. మంగళవారం వరకు దాదాపు పది మంది ఆశావహుల పేర్లు పరిశీలనలో ఉన్నా చివరకు ఈ పేరును అధిష్ఠానం ఖరారుచేసింది. ఇదే సందర్భంగా ముగ్గురు ఉపముఖ్యమంత్రులను నియమించారు. ఆర్‌.అశోక్‌, బి.శ్రీరాములు, గోవింద కారజోళ ఈ పదవులకు ఎంపికయ్యారు. బసవరాజతో పాటు ఆ ముగ్గురూ ప్రమాణస్వీకారం చేయనున్నారు. వీరిలో గోవింద కారజోళ యడియూరప్ప సర్కారులో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు.


యడియూరప్ప వారసుడు..


నూతన ముఖ్యమంత్రి నియామకంలో యడియూరప్ప సూచనలను భాజపా ఆమోదించింది. పార్టీకి సంప్రదాయ ఓటుబ్యాంకుగా ఉన్న లింగాయత్‌లను సంతృప్తిపరుస్తూ అదే వర్గానికి చెందిన బసవరాజకు అవకాశం కల్పించింది. శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి అత్యధిక స్థానాలు కట్టబెట్టే ఉత్తర కర్ణాటక ప్రాంతానికి (హావేరి) చెందిన నేతకు అవకాశం కల్పించింది. ఇప్పటికే వందలాది లింగాయత్‌ మఠాధిపతులు లింగాయేతర సముదాయం నుంచి నూతన సీఎంను ఎంపిక చేయరాదని రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. భాజపా సీఎంలకు ఆర్‌ఎస్‌ఎస్‌ నేపథ్యం, పార్టీలో సుదీర్ఘ సభ్యత్వం ఉండాలన్న సంప్రదాయాన్ని బసవరాజ ఎంపికలో అధిష్ఠానం పక్కన బెట్టింది.