Karnataka Assembly Elections:


ప్రహ్లాద్ జోషి వర్సెస్ సిద్దరామయ్య 


కర్ణాటకలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది మాటల యుద్ధం ముదురుతోంది. తమదే విజయం అన్న ధీమాతో ఉంది కాంగ్రెస్. అటు బీజేపీ మాత్రం ప్రధాని మోదీ చరిష్మానే నమ్ముకుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇటీవల జరిగిన ప్రచారంలో కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకపై ప్రధాని ఆశీర్వాదాలు ఉన్నాయని అన్నారు. దీనిపై కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత సిద్దరామయ్య సెటైర్లు వేశారు. ట్విటర్ వేదికగా ప్రధానిపై విమర్శలు చేశారు. 


"ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే అభ్యర్థుల తలరాతల్ని మార్చేస్తారు. అలా ఎన్నికైన వాళ్లు ప్రజలకు సేవ చేస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ దేవుడు కాదు. ప్రజల్ని ఆశీర్వదించడానికి. జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాను. బహుశా ఆయనకు ప్రజాస్వామ్యం గురించి పాఠాలు చెప్పాల్సి ఉంటుందేమో"


- సిద్దరామయ్య, కాంగ్రెస్ సీనియర్ నేత 










అక్కడితో ఆగలేదు సిద్దరామయ్య. రాజ్యాంగం ప్రకారం అన్ని రాష్ట్రాలకూ సమాన హక్కులుంటాయని అన్నారు. డెమొక్రసీలో నియంతృత్వ పాలనకు చోటు లేదని స్పష్టం చేశారు. అయితే...సిద్దరామయ్య ట్వీట్‌లపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందించారు. ANIతో మాట్లాడిన సందర్భంలో సిద్దరామయ్య ట్వీట్‌ల గురించి ప్రస్తావించారు. ప్రధాని మోదీ దేవుడు అని తాము ఎప్పుడూ చెప్పలేదని, కానీ ప్రజలే ఆయనను అలా చూస్తున్నారని బదులిచ్చారు. ఆయన గురించి తప్పుగా మాట్లాడే వాళ్లకే ప్రజలే బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. 


"ప్రధాని నరేంద్ర మోదీ దేవుడు అని మేము ఎప్పుడూ చెప్పలేదు. కానీ ప్రజలే ఆయనను అలా దేవుడిలా చూస్తున్నారు. మోదీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎన్ని మాట్లాడినా సరే...దానికి ప్రజలే సరైన బదులిస్తారు"


- ప్రహ్లాద్ జోషి, కేంద్రమంత్రి 


జగదీష్ రాజీనామా...


కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత జగదీష్ షెట్టర్ పార్టీకి రాజీనామా చేశారు. హైకమాండ్ తీరుతో విసిగిపోయాయని, టికెట్‌ ఇవ్వకపోవడం బాధించిందని వెల్లడించారు. ఎమ్మెల్యే పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. అయితే...స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారా..? లేదంటే ఇంకేదైనా పార్టీ నుంచి బరిలోకి దిగుతారా అన్నది ఇంకా స్పష్టతనివ్వలేదు. 


"బీజేపీ హైకమాండ్ తీరు నన్ను చాలా బాధించింది. అందుకే రాజీనామా చేయాలని డిసైడ్ అయ్యాను. కొంత మంది లీడర్‌లు కర్ణాటకలోని బీజేపీని మిస్ హ్యాండిల్ చేస్తున్నారు. ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేశాను. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ రిజైన్ చేసేస్తాను. ఆ తరవాతం ఏం చేయాలో త్వరలోనే నిర్ణయించుకుంటాను. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలా..? వేరే పార్టీ నుంచి ఎన్నికల బరిలోకి దిగాలా అన్నది ఆలోచిస్తున్నాను"


- జగదీశ్ షెట్టర్, కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే 


 Also Read: Amritpal Singh Wife: అమృత్ పాల్ సింగ్ భార్య అరెస్ట్? లండన్‌కు పారిపోతుండగా అడ్డుకున్న పోలీసులు!