Karnataka Assembly Elections:


కాంగ్రెస్ అధికారంలోకి వస్తే..


కర్ణాటక ఎన్నికల ప్రచారంలో జోరు పెంచాయి కాంగ్రెస్, బీజేపీ. ముఖ్యంగా బీజేపీ సీనియర్ నేతలంతా కర్ణాటక క్యాంపెయిన్‌లో చురుగ్గా పాల్గొంటున్నారు. కేంద్రహోం మంత్రి అమిత్‌షా ఇటీవలే ఇక్కడ ప్రచార సభ నిర్వహించారు. ఆ సభలో కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అల్లర్లు పుడతాయని, అశాంతి వాతావరణం నెలకొంటుందని అన్నారు అమిత్‌షా. దీనిపై కాంగ్రెస్ భగ్గుమంది. సీనియర్ నేతలు రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా, పరమేశ్వర్, డీకే శివకుమార్ అమిత్‌షాపై ఫిర్యాదు చేశారు. బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చారు. షా చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఈ ఫిర్యాదు చేశారు. విద్వేష పూరిత ప్రసంగాలు చేస్తూ...ప్రజల్ని రెచ్చగొడుతున్నారంటూ ఆరోపించారు. బెలగావిలో జరిగిన కార్యక్రమంలో అమిత్‌ షా ఈ వ్యాఖ్యలు చేశారు. 


"కేంద్రమంత్రి అమిత్‌షా అలా ఎలా మాట్లాడతారు? కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అల్లర్లు జరుగుతాయని అంటారా..? మేం ఈ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం. ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశాం"


-డీకే శివకుమార్, కర్ణాటక కాంగ్రెస్ ప్రెసిడెంట్ 










బెలగావి జిల్లాలోని తెర్డల్‌ ప్రాంతంలో నిర్వహించిన సభలో అమిత్‌షా పాల్గొన్నారు. కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని అభివృద్ధి రివర్స్ గేర్‌లో వెళ్తుందని విమర్శించారు. రాష్ట్రంలో రాజకీయ సుస్థిరత కావాలంటే ప్రజలందరూ బీజేపీకే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. నవ కర్ణాటక నిర్మాణం కేవలం బీజేపీతోనే సాధ్యం అని తేల్చి చెప్పారు. 


"కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇన్నాళ్ల అభివృద్ధి అంతా వెనక్కి పోతుంది. వారసత్వ రాజకీయాలు మళ్లీ మొదలవుతాయి. రాష్ట్రవ్యాప్తంగా అల్లర్లు జరుగుతాయి. పొరపాటున ఆ పార్టీ అధికారంలోకి వస్తే మళ్లీ లంచగొండితనం పెరిగిపోతుంది"


- అమిత్‌ షా, కేంద్ర హోం మంత్రి 


ఇటీవలే బీజేపీ కీలక నేతలు జగదీశ్ షెట్టర్, లక్షణ్ సవది కాంగ్రెస్‌లో చేరారు. దీనిపైనా సెటైర్లు వేశారు అమిత్‌షా. వాళ్లతో కాంగ్రెస్‌కు ఎలాంటి లాభమూ జరగదని తేల్చి చెప్పారు. 


"ఈ ఇద్దరి నేతలతో కాంగ్రెస్‌కి ఒరిగేదేం లేదు. ఆ పార్టీ లింగాయత్‌లను అవమానిస్తూనే ఉంది. ఇన్నేళ్ల హయాంలో లింగాయత్ వర్గానికి చెందిన ఇద్దరు నేతలకు మాత్రమే సీఎం కుర్చీని కట్టబెట్టింది. ఆ ఇద్దరినీ మళ్లీ పార్టీ నుంచి తరిమేసింది"


- అమిత్‌ షా, కేంద్ర హోం మంత్రి 


Also Read: ఆవు కడుపున సింహం లాంటి దూడ! పుట్టిన అరగంటకే మృతి - ఇదేం వింత?