HUL Q4 Results: 2023 మార్చి త్రైమాసికంలో, FMCG మేజర్ హిందుస్థాన్ యూనిలీవర్ (HUL) లాభం 9.66% వృద్ధితో రూ. 2,552 కోట్లకు చేరుకుంది. ఆ త్రైమాసికంలో 10.9% వృద్ధితో రూ. 14,638 కోట్ల ఆదాయం ఆర్జించామని కంపెనీ ప్రకటించింది. అయితే, మార్కెట్‌ అంచనాలను ఈ కంపెనీ అందుకోలేకపోయింది.


FY23కి సంబంధించి ఒక్కో షేరుకు రూ. 22 తుది డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది.


సమీప కాల వ్యాపారంపై నీలినీడలు
సమీప భవిష్యత్‌ అస్పష్టంగా ఉందని, కంపెనీ ఆపరేటింగ్ రెవెన్యూ అస్థిరంగా ఉంటుందని ఫలితాల సందర్భంగా మేనేజ్‌మెంట్‌ వెల్లడించింది. ద్రవ్యోల్బణం తగ్గడం, కొన్ని కమొడిటీల ధరలు తగ్గడం వల్ల ఉత్పత్తుల ధర & అమ్మకాల వృద్ధి మారుతుందని తెలిపింది.


"వినియోగ అలవాట్లలో పునరుద్ధరణ కారణంగా అమ్మకాలు క్రమంగా పుంజుకుంటాయి. వ్యాపారాన్ని చురుగ్గా నిర్వహించడం, ఆరోగ్యకర స్థాయిలో మార్జిన్‌లను కొనసాగించడం, ఫ్రాంచైజీని పెంచుకోవడంపై దృష్టి పెడుతున్నాం. భారతీయ FMCG రంగంలో మధ్యకాలం-దీర్ఘకాలిక వృద్ధిపై మేము నమ్మకంగా ఉన్నాం. స్థిరమైన, పోటీతత్వ, లాభదాయకమైన, బాధ్యతాయుతమైన వృద్ధిని అందించగల సామర్థ్యం HULకి ఉంది" - హిందుస్థాన్‌ యూనిలీవర్‌ CEO & MD సానివ్ మెహతా


భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, కమోడిటీల ధరల పెరుగుదల, మార్కెట్ వృద్ధిలో మందగమనం వంటి సవాళ్లు ఉన్నా, కంపెనీ బలమైన పనితీరును కనబరిచిందని మెహతా చెప్పారు. FMCG మార్కెట్ వాల్యూమ్స్‌ తగ్గినప్పటికీ FY23 ఆదాయాలకు దాదాపు రూ. 8,000 కోట్లను అదనంగా యాడ్‌ చేసినట్లు వెల్లడించారు.


HUL వ్యాపారాల వృద్ధి తీరు     
మార్చి త్రైమాసికంలో, ధర-వ్యయాల అంతరం తగ్గడంతో, QoQ ప్రాతిపదికన HUL స్థూల మార్జిన్ 120 bps మెరుగుపడింది. ఆ త్రైమాసికంలో 4% వాల్యూమ్ వృద్ధిని సాధించింది. ముప్పావు శాతం వ్యాపారాల్లో మార్కెట్ వాటా పెరిగింది.


గృహ సంరక్షణ విభాగంలో 19% ఆదాయ వృద్ధిని HUL నమోదు చేసింది. అందం & వ్యక్తిగత సంరక్షణ విభాగం 10%, ఆహారాలు & రిఫ్రెష్‌మెంట్ విభాగం 3% పెరిగింది.


HUL డివిడెండ్         
FY23 కోసం ంఒక్కో షేరుకు రూ. 22 తుది డివిడెండ్‌ను HUL డైరెక్టర్ల బోర్డు ప్రతిపాదించింది. AGMలో వాటాదార్లు దీనికి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. గతంలో ప్రకటించిన రూ. 17 మధ్యంతర డివిడెండ్‌తో కలిపి, గత ఆర్థిక సంవత్సరానికి మొత్తం డివిడెండ్‌ రూ. 39కు చేరింది. FY22తో పోలిస్తే ఇది 15% పెరుగుదల. 


ఫలితాల ప్రకటన తర్వాత HUL షేర్లు క్షీణించాయి. మధ్యాహ్నం 1.10 గంటల సమయానికి 1.60% తగ్గి రూ. 2,475 వద్ద ట్రేడవుతున్నాయి.        


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.