ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబును ‘ముసలాయన’ అంటూ సంబోధించిన సంగతి తెలిసిందే. నిన్న (ఏప్రిల్ 26) అనంతపురం జిల్లా నార్పలలో జరిగిన జగనన్న వసతి దీవెన నిధుల విడుదల కార్యక్రమంలో ప్రసంగిస్తున్న సందర్భంగా సీఎం జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, జగన్ సభలో చేసిన వ్యాఖ్యలతో పాటు చంద్రబాబును అలా సంబోధించడాన్ని టీడీపీ నేతలు తప్పుబడుతున్నారు. తాజాగా సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలను టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా తప్పుబట్టారు.


‘ఓ మాజీ సీఎంను పట్టుకొని ముసలోడు అనడాన్ని బట్టి మీకు ఎంత పరిజ్ఞానం ఉందో అర్థమవుతోంది. ఓ పదిహేనేళ్లు ఆగితే నువ్వూ ముసలోడివే అవుతావు. నరహంతకుడు వద్దు.. చంద్రబాబు ముద్దు’ అని జగన్‌ను ఉద్దేశిస్తూ బుచ్చయ్య చౌదరి బుధవారం ట్వీట్‌ చేశారు.


నార్పలలో ఏర్పాటు చేసిన బహిరంగ వేదికపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంగా సీఎం జగన్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును నరమాంస భక్షకుడితో పోల్చారు. ముసలాయన అని కూడా అన్నారు. ఈ సందర్భంగా పంచతంత్రంలోని ఓ పులి కథను చెప్పి వినిపించారు. ఇటీవల రిపబ్లిక్ టీవీ నిర్వహించిన ఓ కాంక్లేవ్‌లో చంద్రబాబు మాట్లాడిన మాటలను చూస్తే తనకు ఆ కథ గుర్తుకు వచ్చిందని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. నర మాంసానికి అలవాటు పడిన పులి ముసలిదై వేటాడే శక్తి కోల్పోయాక గుంట నక్కలను వెంట వేసుకొని తిరుగుతుందని మాట్లాడారు. బంగారు కడియం ఆశ చూపి మనుషులను మింగేసే పులి లాగానే చంద్రబాబు కూడా వెన్నుపోటు కుట్రలు పన్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాయమాటలు చెప్పే చంద్రబాబు లాంటి వారిని నమ్మకూడదని, కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పే వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు.