సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ సినిమా సక్సెస్ తర్వాత సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న పేరు అబ్దుల్‌ ఫర్హాన్‌. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చావు అంచుల్లోకి వెళ్లిన సాయి ధరమ్ తేజ్ ను వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లారు అబ్దుల్. సరైన సమయంలో చికిత్స అందడంతో ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. అబ్దుల్ ఆ సమయంలో స్పందించకపోయి ఉంటే మెగా హీరో ప్రాణాలతో ఉండేవారు కాదని చెప్పుకోవచ్చు.


గత కొద్ది రోజులు అబ్దుల్ గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. ప్రమాదం నుంచి ప్రాణాలతో కాపాడిని అతడికి సాయి ధరమ్ తేజ్ చాలా సాయం చేశారని ప్రచారం జరుగుతోంది. లక్షల రూపాయలు ఇవ్వడంతో పాటు కారు, బైక్, ఇల్లు బహుమతిగా ఇచ్చారంటూ పలు యూట్యూబ్ ఛానెల్స్ వార్తలు వడ్డిస్తున్నాయి. ఆ వార్తలపై తాజాగా సాయి ధరమ్ తేజ్ స్పందించారు. తనను కాపాడిన వ్యక్తికి ఏదో కొంత డబ్బు ఇచ్చి చేతులు దులుపుకోవడం తనకు ఇష్టం లేదని చెప్పారు. అందుకే అతడికి డబ్బు ఇవ్వలేదన్నారు. తన ఫోన్ నెంబర్ ఇచ్చి, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తనకు కాల్ చేయాలని చెప్పినట్లు వెల్లడించారు. 


నాకు ఎవరూ ఫోన్ చేయలేదు, ఎలాంటి సాయం చేయలేదు


తాజాగా ఈ వ్యాఖ్యలపై అబ్దుల్‌ స్పందించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో పాటు సాయి ధరమ్ తేజ్ ఫోన్ నెంబర్ ఇచ్చినట్లు చెప్పిన విషయాల గురించి వివరించారు. వాస్తవానికి సాయి ధరమ్ తేజ్ ను కాపాడి, హాస్పిటల్ కు తరలించిన తర్వాత తనను ఎవరూ కలవలేదని చెప్పారు. సాయి ధరమ్ తేజ్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా తన దగ్గరికి రాలేదన్నారు. ఫోన్ నెంబర్ ఇచ్చి, కాల్ చేయమని సాయి ధరమ్ తేజ్ చెప్పడం కూడా అవాస్తవం అన్నారు. తనకు ఎవరు సాయం చేయలేదు. ఎవరి నుంచి ఎలాంటి కాల్స్ రాలేదన్నారు. ఇప్పటికైనా అవాస్తవ ప్రచారాన్ని ఆపాలని కోరారు.


అబద్దపు వార్తలతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా!


అంతేకాదు, తనకు మెగా ఫ్యామిలీ సాయం చేసినట్లు వచ్చిన అబద్దపు వార్తల కారణంగా తాను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు వివరించారు అబ్దుల్. తొలుత తాను సీఎంఆర్ లో పని చేసినట్లు చెప్పారు. అక్కడ తన కుటుంబ సభ్యులు, మెగా కుటుంబం నుంచి బాగా డబ్బులు వచ్చాయి, అదృష్టం అంటే నీదే అంటూ రకరకాలుగా మాట్లాడ్డంతో పని చేయడం మానేసినట్లు చెప్పారు. సుమారు నాలుగు, ఐదు నెలల పాటు ఖాళీగానే ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత మళ్లీ ఓ సెకెండ్ హ్యాండ్ కారు తీసుకుని ఎమిరాల్డ్ కంపెనీలో జాయిన్ అయినట్లు వివరించారు. అయితే అబ్దుల్ ఇప్పటికీ సాయి ధరమ్ తేజ్ నుంచి ఏమీ ఆశించడంలేదని ఆయన మాటల ద్వారా అర్థమవుతోంది. ఆయన కోలుకుని మళ్లీ మంచి సినిమాలు చేయడం సంతోషంగా ఉందని, రంజాన్ వల్ల ‘విరూపాక్ష’ సినిమా చూడటానికి టైమ్ కుదరలేదని, తప్పకుండా చూస్తానని తెలిపాడు. అంతేకాదు, తన స్నేహితులతో కలిసి సాయి ధరమ్ తేజ్‌ను కలవాలని ఉందని వెల్లడించారు. సాయి ధరమ్ తేజ్ మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకున్నాడు.


సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా సినిమా ‘విరూపాక్ష’. కార్తీక్ దండు దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలైన తొలి రోజు నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. యాక్సిడెంట్ తర్వాత నటించిన ఫస్ట్ మూవీ బ్లాక్ బస్టర్ సాధించడతో సాయి ధరమ్ తేజ్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ పతాకాలపై బాపినీడు బి సమర్పణలో బీవీఎస్‌ఎన్ ప్రసాద్  'విరూపాక్ష' సినిమాను నిర్మించారు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా చేసింది.


Read Also: ఉందనే కదా హింట్ ఇచ్చాం, ‘విరూపాక్ష’ సీక్వెల్ పై సాయి ధరమ్ తేజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్!