Kangana Ranaut: సెబీ ఛైర్‌పర్సన్ మధాబి పూరీ బుచ్, ఆమె భర్త ధావల్ బుచ్‌లపై ఇటీవల హిండెన్‌బర్గ్ నివేదిక తీవ్ర ఆరోపణలు గుప్పించింది. దీంతో నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఈ అంశంపై తీవ్ర విమర్శలు చేశారు. విచారణ జరిపించాలన్నారు. ఆయన వ్యాఖ్యలకు కౌంటర్‌గా, ఎన్టీయే ప్రభుత్వానికి మద్దతుగా బీజేపీ ఎంపీ కంగనా రనౌత్  రాహుల్‌ గాంధీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అని కంగనా  ఆరోపించారు. దేశం మిమ్మల్ని నాయకుడిగా ఎన్నటికీ ఎన్నుకోదని జోస్యం చెప్పారు. రాహుల్ అత్యంత విషపూరిత, విధ్వంసకర వ్యక్తి అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 



రాహుల్ ను టార్గెట్ చేసిన కంగనా
సోషల్ మీడియా ద్వారా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని కంగనా టార్గెట్ చేశారు.  హిండెన్‌బర్గ్ నివేదిక ఆధారంగా చేసుకుని రాహుల్ గాంధీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారు, అందులో అదానీ గ్రూప్, సెబీ కుమ్మక్కైయ్యారని ఆరోపించారు. ఈ క్రమంలో రాహుల్‌పై బీజేపీ ఎంపీ కంగనా విరుచుకుపడ్డారు. కంగనా రనౌత్ తన ఎక్స్ ఖాతాలో ఇలా రాసుకొచ్చారు.. 'రాహుల్ గాంధీ అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి, అతను  విషపూరిత, విధ్వంసకర వ్యక్తి. తాను ప్రధాని కాలేకపోతే ఈ దేశాన్ని సర్వనాశనం చేయాలన్నదే ఆయన ఎజెండా. హిండెన్‌బర్గ్ నివేదిక స్టాక్ మార్కెట్‌ను టార్గెట్ చేసింది. దీనికి రాహుల్ గాంధీ మద్దతు ఇచ్చారు. ఆ నివేదిక వ్యర్థమని నిరూపణ అయింది. ఈ దేశ భద్రత, ఆర్థిక వ్యవస్థను అస్థిరపరిచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. మిస్టర్ గాంధీ, మీరు మీ జీవితాంతం ప్రతిపక్షంలో కూర్చోవడానికి సిద్ధంగా ఉండండి.  దేశం అభివృద్ధి, జాతీయత మిమ్మల్ని ఎప్పటికీ అవమానకరంగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రజలు మిమ్మల్ని ఎప్పటికీ నాయకుడిగా ఎన్నుకోరని’ కంగనా తన పోస్టులో ఘాటు వ్యాఖ్యలు చేశారు.


 
రాహుల్ గాంధీ ఏం చెప్పారు?
హిండెన్‌బర్గ్ నివేదికపై రాహుల్ గాంధీ ఆదివారం స్పందిస్తూ.. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) ఛైర్‌పర్సన్‌పై ఆరోపణలు సంస్థ నమ్మకాన్ని వమ్ము చేశాయన్నారు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవాలని రాహుల్ డిమాండ్ చేశారు.  జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) విచారణకు ప్రధాని మోదీ ఎందుకు భయపడుతున్నారో ఇప్పుడు స్పష్టంగా అర్థమైందన్నారు.  







హిండెన్‌బర్గ్ నివేదికలో ఏముంది ?
అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ శనివారం (ఆగస్టు 10) మార్కెట్ రెగ్యులేటర్ సెబీ చైర్‌పర్సన్ మాధవి పూరీ బుచ్, ఆమె భర్త ధవల్ బుచ్‌లపై తీవ్ర ఆరోపణ చేసింది. అదానీ గ్రూప్ ఆర్థిక అవకతవకలతో ముడిపడి ఉన్న ఆఫ్‌షోర్ కంపెనీల్లో మాధవి, ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని హిండెన్‌బర్గ్ పేర్కొంది. అప్పటి నుంచి రాజకీయాలు తీవ్రరూపం దాల్చాయి.  


హిండెన్ బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు సెబీ ఛైర్ పర్సనర్, ఆమె భర్త. తమ జీవితం తెరిచిన పుస్తకం అని, ఏ విషయాన్ని సెబీ వద్ద దాచిపెట్టలేదన్నారు. అదానీ గ్రూపుపై గతంలో చేసిన ఆరోపణలపై విచారణలో భాగంగా హిండెన్ బర్గ్ సంస్థకు నోటీసులు ఇచ్చామన్న కారణంగా, ఉద్దేశపూర్వకంగా తమపై ఆరోపణలు చేశారని సంచలన నివేదికపై క్లారిటీ ఇచ్చారు.