Biden's Awkward Moments At G7 Summit: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి తన వింత ప్రవర్తనతో వార్తల్లోకెక్కారు. ఇటలీలో జరుగుతున్న G7 సదస్సుకి హాజరైన ఆయనను ఇటలీ ప్రధాని జార్జియా మెలోని స్వాగతించారు. ఆ సమయంలో కాసేపు ఇద్దరూ ముచ్చటించారు. ఆ వెంటనే బైడెన్‌ విచిత్రంగా సెల్యూట్ చేసి ఆ వేదిక దిగి నడుచుకుంటూ వెళ్లిపోయారు. ఉన్నట్టుండి అలా వెళ్లిపోవడం కెమెరా కంట పడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అప్పటి వరకూ మాట్లాడిన వ్యక్తి అలా అక్కడి నుంచి వచ్చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.





ఇక్కడే కాదు. మరో చోట కూడా బైడెన్‌ ఇలానే వింతగా ప్రవర్తించారు. ప్రపంచ దేశాల అధినేతలంతా ఒకచోట ఉండి మాట్లాడుకుంటుంటే ఆయన మాత్రం వేరే వైపు నడుచుకుంటూ వెళ్లారు. అక్కడ నిలబడి చూస్తూ ఉండిపోయారు. అంతా కలిసి గ్రూప్ ఫొటో తీయించుకోవాలని చూస్తుండగా ఉన్నట్టుండి బైడెన్‌ ఆ గ్రూప్‌లో మిస్ అయ్యారు. వెంటనే గుర్తించిన ఇటలీ ప్రధాని మెలోని కాస్తంత ముందుకు వెళ్లి బైడెన్‌ని పలకరించి ఇటు రమ్మని పిలిచారు. అప్పుడు కానీ బైడెన్‌ ఇటువైపు రాలేదు. ఆ తరవాత అందరూ కలిసి ఫొటో దిగారు. ఈ రెండు వీడియోలూ నెట్టింట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. 






81 ఏళ్ల బైడెన్‌ ఇలా ప్రవర్తించడం కొత్తేమీ కాదు. గతంలో చాలా సందర్భాల్లో ఇలానే చేసి విమర్శలు ఎదుర్కొన్నారు. రిపబ్లికన్‌లు ఆయనపై సెటైర్లు వేస్తున్నారు. వయసైపోయిన వ్యక్తిని మరోసారి అధ్యక్షుడిని చేయొద్దని ప్రచారం చేస్తున్నారు. అంతకు ముందు వైట్‌హౌజ్‌లో ఏర్పాటు చేసిన ఓ ఈవెంట్‌లో అంతా పాటలు పాడుతూ డ్యాన్స్‌లు చేస్తున్నారు. వీళ్లలో అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌, ఆమె భర్త ఉన్నారు. వాళ్ల పక్కనే నిలుచున్న బైడెన్ మాత్రం అలా బొమ్మగా ఉండిపోయారు. కనీసం చేయి కూడా కదపకుండా అలాగే చూస్తూ నిలబడ్డారు. ఈ వీడియోనీ పోస్ట్ చేసి రిపబ్లికన్‌లు విమర్శలు చేశారు. గతంలో ఓ సారైతే కమలా హారిస్‌ని పెర్సిడెంట్ కమలా హారిస్ అని సంబోధించడం అందరినీ షాక్‌కి గురి చేసింది. మరి కొద్ది నెలల్లో అక్కడ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో బైడెన్ ఇలా ప్రవర్తించడం డెమొక్రాట్‌లను ఆందోళనకు గురి చేస్తోంది. అటు రిపబ్లికన్‌లు ఈ సారి కచ్చితంగా అధికారం సంపాదించుకోవాలని చూస్తున్నారు. 


Also Read: Elon Musk Salary: ఆరేళ్ల తర్వాత జీతం తీసుకుంటున్న ఎలాన్‌ మస్క్‌ - రూ.4.68 లక్షల కోట్ల ప్యాకేజీ