Tesla CEO Elon Musk Salary Package: ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ఎలాన్‌ మస్క్ సంపద అతి త్వరలో అత్యంత భారీగా పెరిగే అవకాశం ఉంది. ఎలాన్‌ మస్క్‌, తన ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ 'టెస్లా' నుంచి 56 బిలియన్ డాలర్ల ప్యాకేజీని పొందేందుకు ఉన్న మరో అడ్డంకి తొలగిపోయింది. మస్క్‌కు ఇవ్వజూపిన పే ప్యాకేజీకి అనుకూలంగా కంపెనీ పెట్టుబడిదార్లు (Tesla Shareholders) ఓటు వేశారు.


టెస్లా వాటాదార్ల AGMలో ఓటింగ్‌
టెస్లా వాటాదార్ల వార్షిక సాధారణ సమావేశంలో (Tesla Shareholders Annual General Meeting) నిన్న (గురువారం, 13 జూన్ 2024) జరిగింది. బ్లూమ్‌బెర్గ్ రిపోర్ట్‌ ప్రకారం, ఎలాన్‌ మస్క్‌ కోసం కంపెనీ ప్రతిపాదించిన వేతన ప్యాకేజీ (Elon Musk Pay Package) అంశం వాటాదార్ల ముందుకు వచ్చింది. వాటాదార్లు దానికి అనుకూలంగా ఓటు వేశారు. కంపెనీ రిజిస్ట్రేషన్‌ను టెక్సాస్‌కు మార్చే ప్రతిపాదనకు కూడా షేర్‌హోల్డర్లు ఆమోదం తెలిపారు.


2018 నాటి ప్రతిపాదన
దీంతో, టెస్లా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఎలాన్‌ మస్క్ అందుకునే జీతంపై ఆరేళ్లుగా కొనసాగుతున్న వివాదం పరిష్కారానికి చేరువైంది. టెస్లాలో ఎలాన్‌ మస్క్ కోసం 56 బిలియన్‌ డాలర్ల 'యాన్యువల్‌ పే ప్యాకేజీ' కోసం 2018లోనే ప్రతిపాదన సిద్ధం చేశారు. భారతీయ రూపాయల్లో చెప్పాలంటే ఈ ప్యాకేజీ విలువ దాదాపు రూ. 4.68 లక్షల కోట్లు. కానీ, అతి భారీ ప్యాకేజీ కావడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. అంత డబ్బును ఎలాన్‌ మస్క్‌కు చెల్లించేందుకు కంపెనీకి చెందిన ఇన్వెస్టర్ల గ్రూప్‌ ఇష్టపడడం లేదు. ఎలాన్‌ మస్క్‌ వేతన ప్యాకేజీని, ఆరేళ్లుగా, ప్రతి మీటింగ్‌లోనూ ఈ గ్రూప్‌ వ్యతిరేకిస్తూ వచ్చింది. ఎలాన్‌ మస్క్‌కు అందించే వేతన ప్యాకేజీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని షేర్‌హోల్డర్లకు కూడా విజ్ఞప్తి చేసింది. పెట్టుబడిదార్ల బృందంలో.. న్యూయార్క్ సిటీ కంప్ట్రోలర్ బ్రాడ్ లెండర్, SOC ఇన్వెస్ట్‌మెంట్ గ్రూప్, అమాల్గమేటెడ్ బ్యాంక్ ఉన్నాయి.


కంపెనీని బెదిరించిన ఎలాన్‌ మస్క్
వాస్తవానికి, టెస్లాలో తన వేతన ప్యాకేజీకి సంబంధించి ఎలాన్‌ మస్క్‌ స్పష్టమైన డిమాండ్లు చేశారు. ఒకరకంగా చెప్పాలంటే కంపెనీని బెదిరించారు. టెస్లాలో తనకు కనీసం 25 శాతం వాటా లభించకపోతే, కంపెనీని విడిచిపెట్టి వెళ్లిపోతానని హెచ్చరించారు. ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌కు బదులుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), రోబోటిక్స్‌ రంగాల వైపు వెళతానని గతంలో చెప్పారు. ప్రస్తుతం మస్క్‌కు ఈ ఎలక్ట్రిక్‌ కార్ల కంపెనీలో దాదాపు 13 శాతం వాటా ఉంది. మస్క్‌ డిమాండ్లను పరిగణనలోకి తీసుకున్న కంపెనీ యాజమాన్యం, అతన్ని బుజ్జగించేందుకు 56 బిలియన్ డాలర్ల ప్యాకేజీని సిద్ధం చేసింది. 


ప్రతిపాదిత వేతన ప్యాకేజీకి అనుకూలంగా ఓటు వేయాలని కంపెనీ యాజమాన్యం టెస్లా వాటాదార్లను విజ్ఞప్తి చేసింది. టెస్లా చైర్‌పర్సన్ రాబిన్ డెన్‌హోమ్, AGMకి ముందు, వాటాదార్లకు ఒక లేఖను రాశారు. ఎలాన్‌ మస్క్ ప్రతిపాదిత పే ప్యాకేజీకి ఆమోదం లభించకపోతే అతను కంపెనీ నుంచి తప్పుకునే ప్రమాదం ఉందని ఆ లేఖలో హెచ్చరించారు. ఎలాన్‌ మస్క్ టెస్లాలో అత్యంత ముఖ్యమైన ఉద్యోగి అని, గత 6 సంవత్సరాలుగా తన పనికి ఎటువంటి వేతనం పొందడంలేదని డెన్హోమ్ వివరించారు.


మరో ఆసక్తికర కథనం: ఈ నగరాల్లో ఇంటి రేట్లు కూడా అడగలేం, టాప్‌-5లో రెండు ఇండియన్‌ సిటీస్‌