Jharkhand Political Crisis: 


ఝార్ఖండ్‌లో సీఎం హేమంత్ సోరెన్ అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి విజయం సాధించారు. అక్రమ మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనపై..ఇప్పటికే ఎమ్మెల్యేగా అనర్హత వేటు పడింది. ఇదంతా భాజపా కుట్ర అని మండిపడిన సోరెన్..తన పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు గట్టిగానే ప్రయత్నించారు. వారిని ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌ రిసార్టుకు తరలించారు. తమ మెజార్టీ నిరూపించుకునేందుకు విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడమే సరైన మార్గం అని భావించారు. ఇప్పుడు ఈ పరీక్షలో నెగ్గారు. ఇందులో సోరెన్ సర్కార్‌కు 48 మంది ఎమ్మెల్యేలు మద్దతుగా నిలిచారు. వెంటనే భాజపా సభ్యులు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. 






అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకునేందుకు విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నట్టు ముందుగానే ఎమ్మెల్యేలకు లేఖ రాశారు సోరెన్. కొద్ది రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న అనిశ్చితికి తెర దించాలంటే...ఇదొక్కటే మార్గమని భావించారు. "రాష్ట్ర రాజకీయాల్లో చాలా రోజులుగా కన్‌ఫ్యూజన్‌ నడుస్తోంది. ఇది తొలగిపోయేందుకు గవర్నర్‌ను కలిశాం. రెండు మూడు రోజుల్లో స్పష్టతనిస్తామని చెప్పారు. కానీ ఇంతవరకూ అలాంటిదేమీ జరగలేదు. అందుకే...అసెంబ్లీ సెషన్‌ నిర్వహించి మా బలం నిరూపించుకోవాలని నిర్ణయించుకున్నాం" అని మంత్రి అలమ్‌గిర్ అలమ్ వెల్లడించారు. ఈలోగా భాజపా కూడాఅప్రమత్తమైంది. వెంటనే మీటింగ్ పెట్టుకుంది. అసెంబ్లీలో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలో ముందుగానే లెక్కలు వేసుకుంది. అందుకు అనుగుణంగా...సోరెన్ సర్కార్‌ను ఇరకాటంలో పెట్టాలని భావించింది. కానీ...సోరెన్ సర్కార్
విజయం సాధించటం వల్ల భాజపా సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. సోరెన్‌పై ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేశారు గవర్నర్ రమేష్ బెయిస్. అప్పటి నుంచి రాజకీయాలు మలుపు తిరిగాయి. కావాలనే భాజపా టార్గెట్ చేసిందిన, JMM ఆరోపిస్తోంది. ప్రస్తుతానికి ఝార్ఖండ్‌లో కాంగ్రెస్, జేఎమ్‌ఎమ్‌, ఆర్‌జేడీ సంకీర్ణ ప్రభుత్వం నడుస్తోంది. అయితే...ఎవరెన్ని కుట్రలు చేసినా తమకు వచ్చే నష్టం ఏమీ లేదని, స్పష్టమైన మెజార్టీ ఉందని ధీమాగా చెబుతోంది యూపీఏ. రాష్ట్రంలోని పరిస్థితులపై సెప్టెంబర్ 1 వ తేదీన యూపీఏ ఎమ్మెల్యేలతో గవర్నర్ భేటీ అయ్యారు. ఆ తరవాత గవర్నర్ ఢిల్లీ వెళ్లారు. అయితే...కేవలం తాను మెడికల్ చెకప్ కోసమే వెళ్లానని ఆయన స్పష్టతనిచ్చారు. అటు యూపీఏ ఎమ్మెల్యేలు మాత్రం..గవర్నర్ కావాలనే ఆలస్యం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.