Wayanad News: రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వయనాడ్‌లో ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులకు అండగా ఉండేందుకే వచ్చామని వెల్లడించారు. నాన్న చనిపోయినప్పుడు ఎంత బాధ కలిగిందో ఇప్పుడూ అంతే బాధగా ఉందని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. తానొక్కడినే కాదని, చాలా మంది ఇదే విధంగా ఆవేదన చెందుతున్నారని అన్నారు. వయనాడ్ విషాదం హృదయాన్ని కలిచి వేస్తోందని తెలిపారు. ఈ విషాదాన్ని చూస్తుంటే నోట మాట రావడం లేదని ప్రియాంక గాంధీ అన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోనూ ఇలాంటి ప్రమాదే జరిగిందని వివరించారు. ఇది రాజకీయాలు మాట్లాడే సమయం కాదని తేల్చి చెప్పారు. దీన్ని కచ్చితంగా జాతీయ విపత్తుగా పరిగణించాలని రాహుల్ స్పష్టం చేశారు.
"ఇదో తీరని విషాదం. కేవలం కేరళకే కాదు. దేశమంతా ఈ విపత్తుని చూసి ఆవేదన చెందుతోంది. ఇక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో పరిశీలించేందుకే వచ్చాను. చాలా మంది కుటుంబ సభ్యుల్ని కోల్పోయారు. ఇళ్లనూ పోగొట్టుకున్నారు. వాళ్లందరినూ చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. వీలైనంత వరకూ మా వంతు సాయం కచ్చితంగా అందిస్తాం. బాధితులకు పరిహారం అందించే దిశగా కృషి చేస్తాం. చాలా మంది సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరుకుంటున్నారు. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. బాధితులకు సాయం అందిస్తున్న వైద్యులు, నర్స్‌లు, వాలంటీర్లకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు"
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ
సాయం చేయడమే మా ప్రాధాన్యం..
ఇప్పుడు రాజకీయాలు మాట్లాడాల్సిన సమయం కాదని రాహుల్ తేల్చి చెప్పారు. ప్రస్తుతానికి బాధితులకు సాయం అందించడం మాత్రమే తమ కర్తవ్యం అని వెల్లడించారు. తక్షణమే సహాయక చర్యలు అందించాలని అన్నారు. నాన్న చనిపోయినప్పుడు ఎంతో బాధ పడ్డానని, ఇప్పుడు ఇక్కడి పరిస్థితులు చూస్తుంటే అంతే బాధగా ఉందని అన్నారు. ఇక్కడి ప్రజలు చాలా మంది తమ సొంత వాళ్లను కోల్పోయి నరకం అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశమంతా వయనాడ్‌కి అండగా నిలబడుతుందని భరోసా ఇచ్చారు. ప్రియాంక గాంధీ కూడా ఈ విషాదంపై స్పందించారు. రోజంతా ప్రభావిత ప్రాంతాల్లోనే గడిపామని వెల్లడించిన ఆమె..బాధితులు ఎంత ఆవేదన చెందుతున్నారో అర్థం చేసుకోగలమని అన్నారు. వీలైనంత వరకూ వాళ్లకు సాయం చేసేందుకే ప్రయత్నిస్తామని స్పష్టం చేశారు. అటు హిమాచల్ ప్రదేశ్‌లోనూ ఇదే తరహా విషాదం జరిగిందని, ఇక్కడి బాధితులు ఏ విధంగా సాయం అందించగలమో ఆలోచిస్తున్నామని తెలిపారు.
Also Read: Wayanad Landslides: వయనాడ్‌లో పర్యటించిన రాహుల్, ప్రియాంక - బాధితులకు పరామర్శ