ISRO GSLV F14: అంతరిక్ష ప్రయోగాల్లో దూసుకుపోతూ.. తనకంటూ ప్రత్యేకతను సంతరించుకున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) మరో కీలక అడుగు వేయనుంది. దేశవ్యాపంగా రైతన్నలకు(Farmars) అత్యంత ఉపకరించేలా సరికొత్త ప్రయోగాన్ని చేపట్టనుంది. GSLV F14 ఉపగ్రహాన్ని ఈ నెల 17న చేపట్టనున్నారు. ఈ ప్రయోగం ద్వారా.. భూవాతవారణ పరిస్థితులతోపాటు.. పర్యావరణం, ముఖ్యంగా సముద్ర ఉత్పాతాలు, వర్షాలు, పిడుగులు సహా.. అన్ని అంశాలపైనా లోతైన అధ్యయనం చేయనున్నారు. అంతేకాదు.. ఈ ప్రయోగ ఫలితంగా.. వాతావరణానికి సంబంధించిన సమాచారం.. ప్రతి క్షణం వెలువడనుంది. వాస్తవానికి ఇప్పటికే రైతన్నలకు చేదోడుగా ఉండేందుకు ఇస్రో అనేక ప్రయోగాలు చేసింది. ఫలితంగాఎప్పుడు ఎక్కడ ఎలాంటివాతావరణం ఉంటుందో తెలుసుకునే వీలు కలిగింది. రైతులు తమ ఉత్పత్తులను భద్ర పరుచుకునే అవకాశం దక్కింది.
అయితే, ఇప్పుడు మరింత సూక్ష్మంగా ఈ వాతావరణ సమాచారం చేరువ కానుంది. ఈ క్రమంలో ఈ నెల 17న జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ F14(GSLV F14) ఉపగ్రహ ప్రయోగాన్ని ఇస్రో చేపట్టనుంది. దీనిని వాతావరణ ఉపగ్రహం ఇన్సాట్-3డిఎస్ గా ఇస్రో పేర్కొంది. ఈ ఉపగ్రహం సహాయంతో మెరుగైన వాతావరణ సూచనలు అందుబాటులోకి రావడంతో పాటు విపత్తు హెచ్చరికలు కూడా మరింత మెరుగ్గా ఉండనున్నాయి.
థర్డ్ జనరేషన్ శాటిలైట్..
INSAT-3DS ఉపగ్రహం మూడవ తరం వాతావరణ ఉపగ్రహానికి తదుపరి మిషన్ గా ఇస్రో వెల్లడించింది. దీనిని భూస్థిర కక్ష్యలోకి ప్రవేశ పెడతారు. ఇస్రో తన 16వ మిషన్‌లో జియో సింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ (జిటిఓ)లో ఉపగ్రహాన్ని మోహరించడం జిఎస్‌ఎల్‌వి లక్ష్యమని పేర్కొంది. ఆర్బిట్ రైజింగ్ ప్రక్రియలో ఉపగ్రహం భూస్థిర కక్ష్యలో ఉండేలా చూడనున్నారు. ఈ ఉపగ్రహంలో అధునాతన వాతావరణ పరిస్థితిని అంచనా వేయగల సాంకేతికతను అమర్చారు.
500 కోట్ల ప్రయోగం!
జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ F14(GSLV F14) ఉపగ్రహ ప్రయోగానికి రూ.500 కోట్లకు పైగానే ఖర్చయినట్టు ఇస్రో వర్గాలు తెలిపాయి. ఈ నిధులు కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ(MoES) సమకూర్చింది. GSLV-F14/INSAT-3DS మిషన్ ప్రయోగం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SDSC) SHAR నుంచి చేపట్టనున్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న ఇన్సాట్-3డీ, ఇన్సాట్-3డీఆర్ ఉపగ్రహాలతో పాటు ఈ ఉపగ్రహం వాతావరణ సేవలను మెరుగుపరచనుంది.
ఇవీ.. లాభాలు!
+ వాతావరణ పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేయడం.
+ విపత్తు హెచ్చరికలు నిముషాల వ్యవధిలోనే అందుబాటులోకి రావడం.
+ భూమి, సముద్ర ఉపరితలాలను నిరంతరాయంగా పరిశీలించడం.
+ వాతావరణంలోని వివిధ పరిస్థితుల ప్రొఫైల్‌లను అత్యంత వేగంగా అందించడం.
+ డేటా కలెక్షన్ ప్లాట్‌ఫారమ్ (DCP)
ఉపగ్రహంలో ఏమేమున్నాయి?
జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ F14(GSLV F14) ఉపగ్రహంలో భారత వాతావరణ విభాగం (IMD), మధ్యస్థ-శ్రేణి వాతావరణ సూచన కోసం జాతీయ కేంద్రం (NCMRWF) , ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరోలజీ (IITM), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (NIOT), ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (INCOIS), ఇతర ఏజెన్సీలు, సంస్థలకు చెందిన సాంకేతికతను నిక్షిప్తం చేశారు.ఇవి.. వాతావరణ అంచనాను మరింత మెరుగ్గా అందించనున్నాయి.
ఉపగ్రహం స్వరూపం..
+ జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ F14(GSLV F14) 51.7 మీటర్ల పొడవు
+ 420 టన్నుల బరువు
+ మొదటి దశ(GS1) ఒక సాలిడ్ ప్రొపెల్లెంట్ (S139) మోటారును కలిగి ఉంటుంది.
+ 139 టన్నుల ప్రొపెల్లెంట్‌ను మోసుకెళ్తుంది.
+ నాలుగు ఎర్త్-స్టోరేబుల్ ప్రొపెల్లెంట్ స్టేజ్‌లు (L40) స్ట్రాప్-ఆన్‌లు ఉంటాయి.
+ ఇవి ఒక్కొక్కటి 40 టన్నుల ద్రవ ప్రొపెల్లెంట్‌ను కలిగి ఉంటాయి.
దశల వారీగా..
జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ F14(GSLV F14) లో రెండవ దశ (GS2) కూడా 40 టన్నుల ప్రొపెల్లెంట్‌తో నిండి ఉంటుంది. మూడవ దశ (GS3) క్రయోజెనిక్ దశ, ఇది 15 టన్నుల ద్రవ ఆక్సిజన్ (LOX), ద్రవ హైడ్రోజన్ (LH2) ప్రొపెల్లెంట్ లోడింగ్‌తో ఉంటుంది.