Under-19 World Cup Final Match: ప్రపంచకప్ ( World Cup) ఫైనల్లో మరోసారి ఆస్ట్రేలియా-భారత్ (IND vs AUS )తలపడబోతున్నాయి. కానీ ఇది అండర్ 19 ప్రపంచకప్‌లో(ICC Under 19 World Cup 2024). వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్లో టీమిండియాను ఓడించిన కంగారులపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం యువ భారత్ జట్టుకు లభించింది. దక్షిణాఫ్రికాలోని బినోయ్, విల్మోర్‌పార్క్‌లో జరిగిన రెండో సెమీ ఫైనల్లో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను మట్టికరిపించిన ఆస్ట్రేలియా... యువ భారత జట్టుతో తుది పోరుకు సిద్ధమైంది.
ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్..
అండర్-19 ప్రపంచ కప్ రెండో సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 48.5 ఓవర్లలో కేవలం 179 పరుగులకే ఆలౌటైంది. లక్ష్యాన్ని ఛేదించిన ఆస్ట్రేలియా జట్టు మరో 5 బంతులు మిగిలి ఉండగానే 9 వికెట్లు కోల్పోయి విజయ తీరానికి చేరుకుంది.
180 పరుగుల లక్ష్యాన్ని 49.1 ఓవర్‌లో తొమ్మిది వికెట్లు కోల్పోయి ఛేదించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 48.5 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌటైంది. పాకిస్తాన్ బ్యాటర్లలో అజాన్ అవైస్ (52; 91 బంతుల్లో 3 ఫోర్లు), అరాఫత్ మిన్హాస్ (52; 61 బంతుల్లో 9ఫోర్లు) హాఫ్ సెంచరీలు చేశారు. షామిల్ హుస్సేన్ (17) ఒక్కడే రెండు అంకెల స్కోరు చేయగా మిగిలిన వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. దీంతో పాకిస్తాన్ ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. ఆస్ట్రేలియా బౌలర్లలో టామ్ స్ట్రాకర్ ఆరు వికెట్లతో పాకిస్తాన్ పతనాన్ని శాసించాడు.
స్వల్ప లక్ష్య చేధనలో కష్టాలు...
180 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా జట్టు తడబడి నిలబడింది. ఓపెనర్ సామ్ కాన్స్టాస్ (14), కెప్టెన్ హ్యూ వీబ్‌జెన్(4), హర్జాస్ సింగ్ (0), వికెట్ కీపర్ ర్యాన్ హిక్స్ (0) లు విఫలం కావడంతో ఆస్ట్రేలియా 59 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే.. మరో ఓపెనర్ హ్యారీ డిక్సన్ (50; 75 బంతుల్లో 5 ఫోర్లు), ఒలివర్ పీక్ (49; 75 బంతుల్లో 3 ఫోర్లు) కంగారులను విజయం దిశగా నడిపించారు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అనంతరం హ్యారీ డిక్సన్ ఔట్ అయ్యాడు. అతడిని అరాఫత్ మిన్హాస్ క్లీన్ బౌల్డ్ చేశాడు. హ్యారీ డిక్సన్-ఒలివర్ పీక్ లు ఐదో వికెట్ 43 పరుగులు జోడించారు. చివర్లో బెల్, ఒలివర్ పీక్ ఔట్ కావడంతో మ్యాచులో ఉత్కంఠ చెలరేగింది. కల్లమ్ విడ్లర్(19నాటౌట్), రాఫ్ మాక్‌మిల్లన్(2 నాటౌట్) ఆఖరి వికెట్ అజేయంగా 16 పరుగులు జోడించి జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. పాకిస్తాన్ బౌలర్లలో అలీ రజా నాలుగు వికెట్లు తీశాడు. అరాఫత్ మిన్హాస్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఉబైద్ షా, నవీద్ అహ్మద్ ఖాన్ చెరో వికెట్ సాధించారు. ఈ ప్రపంచకప్‌లో భారత్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్స్‌కు చేరుకుంది. ఇప్పటివరకు మొత్తం ఆరు మ్యాచ్‌లు ఆడింది. ఈ 6 మ్యాచ్‌లు ఆడగా, అన్ని మ్యాచ్‌ల్లోనూ ఏక పక్ష విజయాలు సాధించింది. భారత యువశక్తి ఎంత పటిష్టంగా ఉందో ఈ మ్యాచ్ ఫలితాలను బట్టి అర్థమవుతోంది. సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టును ఓడించిన ఉదయ్ సహారన్ జట్టు ఆత్మవిశ్వాసంతో దూసుకుపోతోంది. ఇక ఫైనల్లోనూ గెలిస్తే ఆరోసారి కప్పు భారత్‌కు వస్తుంది.