ABP  WhatsApp

ISRO Espionage Case: ఇస్రో నంబి నారాయణ్‌పై కుట్ర కేసులో సుప్రీం కీలక తీర్పు

ABP Desam Updated at: 02 Dec 2022 03:22 PM (IST)
Edited By: Murali Krishna

ISRO Espionage Case: ఇస్రో గూఢచర్యం కేసులో శాస్త్రవేత్త నంబి నారాయణ్‌ను ఇరికించారన్న కేసులో సుప్రీం కోర్టు కీలక తీర్పు ఇచ్చింది.

ఇస్రో నంబి నారాయణ్‌పై కుట్ర కేసులో సుప్రీం కీలక తీర్పు

NEXT PREV

ISRO Espionage Case: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గూఢచర్యం కేసులో శాస్త్రవేత్త నంబి నారాయణ్‌ను ఇరికించారన్ని కేసులో సుప్రీం కోర్టు శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో మాజీ డీజీపీ సహా నలుగురు నిందితులకు కేరళ హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.





సీబీఐ అప్పీళ్లను అంగీకరిస్తున్నాం. ఈ కేసులో నిందితులకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తున్నాం. ఈ కేసుకు సంబంధించిన అన్ని పిటిషన్లను తిరిగి హైకోర్టుకే పంపిస్తున్నాం. నిందితుల బెయిల్‌ దరఖాస్తులను మళ్లీ మొదటి నుంచి విచారించండి. నాలుగు వారాల్లోగా దీనిపై తీర్పు వెలువరించండి.                                        - సుప్రీం కోర్టు


కానీ ముందస్తు బెయిల్‌ దరఖాస్తులపై కోర్టు తీర్పు వెలువరించే వరకు నిందితులను అరెస్టు చేయకుండా వారికి సుప్రీం కోర్టు రక్షణ కల్పించింది.


ఇదీ కేసు


1994లో క్రయోజనిక్‌ ఇంజిన్‌ తయారీకి సంబంధించిన కీలక పత్రాలను శాస్త్రవేత్త నంబి నారాయణ్‌ విదేశీయులకు అప్పగించారంటూ కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తర్వాత ఈ కేసును న్యాయస్థానం కొట్టివేసింది. క్రయోజనిక్‌ ఇంజిన్‌ పనులు ఆలస్యం కావాలన్న విదేశీ కుట్రలో భాగంగానే కేరళ పోలీసులు నంబి నారాయణ్‌పై ఈ ఆరోపణలు చేశారంటూ సీబీఐ కేసు నమోదు చేసింది.


ఈ కేసులో అప్పటి పోలీసు అధికారులైన గుజరాత్‌ మాజీ డీజీపీ ఆర్‌.బి.శ్రీకుమార్‌, విశ్రాంత నిఘా అధికారి పి.ఎస్‌.జయ్‌ప్రకాశ్‌, ఇద్దరు పోలీసు అధికారులు ఎస్‌.విజయన్‌, థంపి ఎస్‌ దుర్గా దత్‌పై సీబీఐ కేసులు పెట్టింది. అయితే వీరికి కేరళ హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది.


సవాల్


వీరికి ముందస్తు బెయిల్ ఇస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సీబీఐ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. నంబి నారాయణ్‌పై కేసు పెట్టడం ద్వారా క్రయోజనిక్‌ ప్రాజెక్టు పనులు ఆగిపోయాయని, రోదసీ కార్యక్రమాలు ఒకటి, రెండు దశాబ్దాల పాటు వెనకబడ్డాయని సీబీఐ వాదించింది. ఇది చాలా త్రీవమైన అంశమని, విదేశీ కుట్రలో భాగమై పోలీసులు ఇలా చేసి ఉండవచ్చని తెలిపింది. నిందితులకు బెయిల్‌ ఇస్తే విచారణకు ఆటంకం కలుగుతుందని పేర్కొంది. దీనిపై విచారణ జరిపిన జస్టిస్‌ ఎం ఆర్‌ షా, జస్టిస్‌ సీటీ రవికుమార్‌ ధర్మాసనం శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది.


Also Read: Karnataka Crime News: 'దృశ్యం-2' సినిమాను దింపేశారుగా! లవర్‌తో కలిసి భర్తను చంపేసి!


 

Published at: 02 Dec 2022 03:11 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.