మాజీ మంత్రి, వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే పేర్ని నాని మరోసారి వివాదాస్పద, సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ ను చంపినందుకు, చంద్రబాబుకు వెంకటేశ్వర స్వామి శాపం పెట్టాడని వివాదాస్పదంగా వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఇటీవలి వ్యాఖ్యల గురించి మాట్లాడుతూ.. ఇవే తనకు చివరి ఎన్నికలు అని అన్నాడని అన్నారు. ఇప్పుడు పోలవరం వెళ్ళి ప్రజలకు ఇవే చివరి ఎన్నికలు అంటున్నాడని సెటైర్లు వేశారు. ఇదంతా పాత కాలపు స్వామిజీల తంతులా ఉందని.. అసలు చంద్రబాబుకు మైండ్ ఉందా? అంటూ పేర్ని నాని నిలదీశారు. ఇదేం ఖర్మ అని ప్రజలు అనుకుంటున్నారని అన్నారు. మొన్నటి వరకు బాదుడే బాదుడు అంటూ చంద్రబాబు జనాల్లోకి వెళ్లాడని మండిపడ్డారు. 


హెరిటేజ్ లో రేట్లు బాదుడే బాదుడు అని జనాలకు తెలియదా? జనాలు ఏమైనా అమాయకులు అనుకుంటున్నారా? అని నిలదీశారు. చంద్రబాబును, లోకేష్ ను చంపేందుకు కుట్ర జరుగుతోందట.. ఇవి కాంతారావు సినిమా రోజులు కావు. కాంతారావు సినిమా డైలాగులు ఇప్పుడూ వేస్తే ఎలా చంద్రబాబు? అని ఫైర్ అయ్యారు. అంతా బాగా ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర చౌదరిగా కనిపించాడు చంద్రబాబుకు.. ఎన్టీఆర్‌ను క్షోభ పెట్టి చంపినందుకు ఆయన పూజించే వెంకటేశ్వర స్వామి చంద్రబాబుకు శాపం పెట్టాడు. ఎన్టీఆర్ కు చేసిన ద్రోహానికి వచ్చే ఫలితమే 2024 ఎన్నికల ఫలితాలు’’ అంటూ వ్యాఖ్యలు చేశారు.


చంద్రబాబును చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది. దిక్కుమాలిన ప్రతిపక్ష నాయకుణ్ణి ఎవరు చంపాలని అనుకుంటారు. సానుభూతి డ్రామాలకు చంద్రబాబు బాగా అలవాటు పడ్డారు. వలంటీర్లు ఇంటింటికీ తిరిగి బాబు వస్తే సంక్షేమం అపుతామని చెబుతున్నారు. చంద్రబాబు పవన్  ఏమన్నారు? సంక్షేమం వల్ల ఏపీ శ్రీలంక అవుతుందని దుష్ప్రచారం చేశారు. మరి ఇప్పుడు వాళ్లు సంక్షేమ పథకాలు అమలు చేస్తారా?


‘‘ఆయనకు ఎన్నికల్లో చివరి అవకాశం అని ప్రజలకు చంద్రబాబు చెబుతున్నారు. డూప్లికేట్ స్వామీజీలాగా చంద్రబాబు పరిస్థితి ఉంది. అసలు బాబుకు మైండ్ ఉందా లేదా? బాబు వైఖరి చూసి ఇదేం ఖర్మ అని ప్రజలు అనుకుంటున్నారు. జనం ఛీ కొడుతున్నా సిగ్గు లేదా? విజయవాడలో కందిపప్పు రేటెంత.. హెరిటేజ్‌లో ఎంత?’’ అని పేర్ని నాని మాట్లాడారు.