సినిమావాళ్లకి ప్రేక్షకులే దేవుళ్లు. రాజకీయనాయకులకు ఓటర్లే దేవుళ్లు. అందుకే ఇంకా ఎన్నికలకు సమయం ఉండగానే ఎవరి రాజకీయాలు వాళ్లు మొదలెట్టారు. ప్రజలే మాకు అండాదండా అని ఎవరి స్టైల్లో వాళ్లు చెప్పడమే కాదు సెంటిమెంట్‌తో సక్సెస్‌ కావాలనుకుంటున్నారు. తెలుగురాష్ట్రాల్లో రాజకీయం సవాళ్ల నుంచి సెంటిమెంట్‌కి మారింది. 


నిన్నటివరకు తేల్చుకుందాం..చూసుకుందాం అన్న రాజకీయపార్టీలు, నేతలు ఇప్పుడు సెంటిమెంట్‌నే నమ్ముకొని రాజకీయాలు మొదలెట్టారు. ఎన్నికల టైమ్‌ ఇంకా ఉండగానే ముందస్తుగా రంగంలోకి దిగుతున్నారు. అంతేకాదు ప్రచారాలు, పర్యటనలో పంచ్‌ డైలాగులతోపాటు పవర్‌ ఫుల్‌ సెంటిమెంట్‌ని ప్రజల మైండ్‌లోకి ఎక్కిస్తున్నారు. అధికారపార్టీ వైసీపీని ఓడించేందుకు వరకు టిడిపి-జనసేన ఏకమయ్యాయి. ఆ పార్టీల పిలుపుతో ఆంధ్రాలోని అన్ని పార్టీలు ఏకమయ్యాయి. జగన్‌ రాక్షస, అవినీతి పాలనని అంతం చేయాలని పిలుపునిస్తున్నాయి. అంతేకాదు ఏపీని అభివృద్ధి బాటలో నడిపించే నాయకుడు కావాలంటే చంద్రబాబుని మళ్లీ గెలిపించాలని నిన్నటి వరకు టీడీపీ నేతలు ప్రచారం చేశారు. ఇప్పుడు సిఎం అభ్యర్థి గురించి ప్రస్తావించకుండా సెంటిమెంట్‌ని టచ్‌ చేస్తూ పాత విషయాలను గుర్తు చేస్తున్నారు.


 హైదరాబాద్‌ హైటెక్‌ సిటీగా పేరురావడానికి తానే కారణమని పలు సందర్భాల్లో చెప్పిన చంద్రబాబు మొన్నా మధ్య తెలంగాణ టిడిపి అధ్యక్షుని ప్రమాణస్వీకారం రోజున కూడా ఆ మాటనే గుర్తు చేశారు. నేను సిఎంగా మొదలెట్టిన పనిని తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కొనసాగించారని తెలిపారు. అందుకే హైదరాబాద్‌ దేశంలోనే నెంబర్‌ వన్‌గా ఉందని చెబుతూ అమరావతిని జగన్‌ నాశనం చేశారని విమర్శలు చేశారు. కొద్దిరోజుల క్రితం వచ్చే ఎన్నికలే తనకు, చివరివి అని చెప్పి మళ్లీ టిడిపికి పట్టం కట్టాలని ప్రజలను కోరారు. దీనికి అధికారపార్టీ కౌంటర్‌ ఇస్తూ చంద్రబాబుపై సెటైర్లు వేసింది. దీంతో ఇప్పుడు టిడిపి అధినేత ఏలూరు పర్యటనలో మరోసారి తన వ్యాఖ్యలను సరిచేసుకుంటూ వచ్చే ఎన్నికలు తనకు, ప్రజలకు చివరి ఎన్నికలు అని హెచ్చరిస్తున్నారు. 


జగన్ని మళ్లీ సిఎం చేస్తే అమరావతి, పోలవరమే కాదు అసలు అభివృద్ధే ఉండదని గుర్తు చేస్తున్నారు చంద్రబాబు. లోకేష్‌, తనను హత్య చేసేందుకు వైసీపీ కుట్రపన్నుతోందని చెబతూ వైఎస్‌ వివేకానంద హత్యని ప్రస్తావించారు. ప్రజల అండాదండా ఉన్నంతవరకు తనకేమీ కాదని సెంటిమెంట్‌తో కొట్టారు. 


జనసేన అధినేత కూడా ఈ మధ్యన జరుగుతున్న పార్టీ సమావేశాల్లో జగన్‌ ప్రభుత్వానికి వార్నింగ్‌లు ఇస్తూనే ప్రజల అండ తనకుందని చెప్పుకొచ్చారు. ఒక్క ఛాన్స్‌ ఇవ్వండి ప్లీజ్‌ అని ప్రాధేయపడుతూ తనని ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఓర్చుకుంటానని ప్రజల జోలికి వస్తే ఊరుకోనని ఇప్పటం గ్రామ పర్యటనలో అటు జగన్‌ సర్కార్‌కి వార్నింగ్‌ ఇటు ప్రజలని సెంటిమెంట్‌తో కొట్టారు పవన్‌.


ఇలా విపక్ష నేతలే కాదు జగన్‌ కూడా మళ్లీ తనకి కలిసొచ్చిన సెంటిమెంట్‌నే నమ్ముకొన్నారు. తండ్రి మృతితో ఓదార్పు యాత్ర చేసి దాదాపు 10ఏళ్లు ప్రజల మధ్యనే ఉన్న జగన్‌ సిఎం అయ్యాక కాస్తంత దూరంగా ఉంటూ వచ్చారు. అయితే ఇప్పుడు విపక్షాల పర్యటనలు, ప్రచారాల నేపథ్యంలో వైసీపీ అధినేత కూడా అధికార కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. అభివృద్ది కార్యక్రమాల్లో విపక్షాలపై విమర్శలు చేస్తూనే తనకి పైనున్న ఆ దేవుడు, ఈ ప్రజల అండ ఉందని చెబుతూ తనకి ఏ పార్టీతో పొత్తులు లేవని ప్రజలతోనే నా పొత్తు ఉంటుందని సెంటిమెంట్‌ రాజేశారు. 


ఇలా నిన్నటి వరకు సవాళ్లు విసురుకున్న అధినేతలు ఇప్పుడు మళ్లీ సెంటిమెంట్‌నే నమ్ముకొని ప్రజల మనసులను గెలుచుకోవాలనుకుంటున్నారు. మరి ఈ సెంటిమెంట్‌ వచ్చే ఎన్నికల్లో ఎవరిని గెలిపిస్తుందో !