Chandrayaan 3 Propulsion Module Moved To Earth Orbit: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) మరో ఘనత సాధించింది. చంద్రయాన్ - 3 (Chandrayaan - 3) ప్రాజెక్టులో భాగంగా జాబిల్లి వద్దకు పంపిన CH-3 ప్రొపల్షన్ మాడ్యూల్ (Propulsion Module) ను విజయవంతంగా చంద్రుడి కక్ష్య నుంచి భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ మేరకు ఇస్రో శాస్త్రవేత్తలు వివరాలు వెల్లడించారు. ఇది ప్రత్యేక ప్రయోగమని పేర్కొన్నారు. చంద్రుడిపై నమూనాలు సేకరించే ప్రణాళికలు చేస్తోన్న ఇస్రోకు, తాజా ప్రయోగం చాలా దోహదపడుతుందని తెలిపారు. జాబిల్లి నుంచి నమూనాలు సేకరించి తిరిగి వచ్చే మిషన్ కోసం వ్యూహాలు రూపొందించేందుకు ఈ ప్రొపల్షన్ మాడ్యూల్ లోని సమాచారం ఉపయోగపడుతుందని పేర్కొంది. చంద్రుడి కక్ష్యలోకి ల్యాండర్ ను చేర్చడంలో ఈ మాడ్యూల్ కీలక పాత్ర పోషించింది. జాబిల్లిపై 3 నెలలు కక్ష్యలో పని చేసేలా ఈ మాడ్యూల్ తయారు చేశారు. తాజా ప్రయోగంతో చంద్రుడిపైకి అంతరిక్ష నౌకలను పంపడమే కాకుండా వాటిని తిరిగి భూమికి తీసుకు రావడంలో కీలక ముందడుగు పడిందని శాస్త్రవేత్తలు తెలిపారు. 'చంద్రయాన్ - 3' మిషన్ లక్ష్యాలు పూర్తిగా నెరవేరినట్లు స్పష్టం చేశారు. ఈ తరహా ప్రయోగాన్ని తొలిసారి చేసి ఇస్రో విజయం సాధించింది. ఇప్పటివరకూ వేరే కక్ష్యల్లోకి స్పేస్ క్రాఫ్ట్ లను పంపించటమే తప్ప వాటిని తిరిగి తీసుకువచ్చే టెక్నాలజీ ఇస్రో దగ్గర లేదు. కనుక ఈ విజయం ఇస్రో చరిత్రలో ప్రత్యేకంగా నిలవనుంది.






ఇదీ చరిత్ర


ఇస్రో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SDSC - SHAR) నుంచి LVM - M4 వాహనంలో జులై 14, 2023న చంద్రయాన్ - 3 మిషన్ ను ప్రయోగించారు. అది భూమి చుట్టూ తిరుగుతూ మెల్లగా కక్ష్యను పెంచుకుని చంద్రయాన్ 3 స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. దాదాపు నెల రోజుల తర్వాత అంటే ఆగస్టు 17న ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ మాడ్యుల్ వేరైంది. ఆ తర్వాత ఆగస్టు 23న ల్యాండర్ మాడ్యూల్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా దిగి చరిత్ర సృష్టించింది. చంద్రుడిపై ఓ రోజు పాటు పని చేసిన విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్ ఎన్నో ప్రయోగాలు చేసి భూమి మీదకు డేటాను పంపించాయి. చంద్రుడిపై ఓ రోజు అంటే భూమిపై 14రోజులు కాబట్టి.. ఆ తర్వాత చంద్రుడిపై చీకటి పడే సమయం కావటంతో ఇస్రో ల్యాండర్, రోవర్ ను స్లీప్ మోడ్ లోకి పంపించింది. 14 రోజుల తర్వాత వాటిని మేల్కొలిపే ప్రయత్నం చేసినా చంద్రుడిపై ఉన్న అతి శీతల పరిస్థితుల కారణంగా ల్యాండర్, రోవర్ శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయాయి. అయినప్పటికీ ఇస్రో సాధించాల్సిన ఘనతలను ఆ 14 రోజుల్లోనే సాధించింది. ఈ ప్రయోగం సక్సెస్ తో చందమామ సౌత్​ పోల్​పై కాలు మోపిన మొదటి దేశంగా భారత్​ నిలిచింది. 


ఇస్రో ప్లాన్ తో అద్భుతం


ఇప్పుడు ల్యాండర్ మాడ్యూల్ నుంచి విడిపోయిన ప్రొపల్షన్ మాడ్యూల్ ను తిరిగి ఉపయోగించుకునేందుకు ఓ కొత్త ప్లాన్ వేసింది ఇస్రో. ప్రొపల్షన్ మాడ్యూల్ లో SHAPE (Spectropolarimetry of the Habitable Planet Earth) పే లోడ్ ఉంది. ఈ మాడ్యూల్ లో ఇంధనం తగ్గిపోతున్న క్రమంలో చంద్రుడి చుట్టూ తిరుగుతున్న దాన్ని అతి జాగ్రత్తగా కక్ష్య తగ్గిస్తూ మెల్లగా భూమి కక్ష్యలోకి తీసుకువచ్చారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఇందుకోసం దాదాపు నెలన్నర రోజులు కక్ష్య తగ్గింపు ప్రక్రియను కొనసాగింది. ఫైనల్ గా నవంబర్ 22న భూమి కక్ష్యలోకి వచ్చి భూమి చుట్టూ ఆర్బిట్ ను ప్రొపల్షన్ మాడ్యూల్ పూర్తి చేసిందని ఇస్రో ప్రకటించింది. కక్ష్య తగ్గించే సమయంలో భూమికి, చంద్రుడికి మధ్య ఉన్న స్పేస్ క్రాఫ్ట్ కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుని విజయవంతమైనట్లు తెలిపింది. ఇప్పుడు భూమి చుట్టూ తిరుగుతూ మరింత కాలం పాటు తన సేవలను అందించనుంది ఈ ప్రొపల్షన్ మాడ్యూల్. అంతే కాదు ఫ్యూచర్ లో ఇస్రో చేసే చంద్రయాన్ ప్రయోగాలకు ఈ ప్రొపల్షన్ మాడ్యూల్ తన సేవలను అందించనుంది.


ఆ ప్రయోగాలకు ఊతం


స్పేస్ ఏజెన్సీస్ సాధించాల్సిన లక్ష్యాల్లో స్పేస్ క్రాఫ్ట్స్ ను పంపించటమే కాదు వాటిని తిరిగి సేఫ్ గా వెనక్కి తీసుకువచ్చే సామర్థ్యం సాధించటం కూడా చాలా ముఖ్యమైంది. తాజా ప్రయోగం విజయవంతం కావడంతో భవిష్యత్తులో దీని ఆధారంగా టెక్నాలజీని మరింత ఇంప్రూవ్ చేసుకుని ఇస్రో సరికొత్త ప్రయోగాలు చేసేందుకు ఆస్కారం లభించనున్నట్లు సైంటిస్టులు తెలిపారు.


Also Read: అన్ని తుపానులకు ఎందుకు పేర్లు పెట్టరూ? మిగ్‌జాం అంటే అర్థమేంటీ?