Israel Hamas Conflict: హమాస్‌ని పూర్తిగా అంతం చేసేంత (Israel Hamas War) వరకూ దాడులు కొనసాగుతాయని ఇజ్రాయేల్ కీలక ప్రకటన చేసింది. ఇప్పట్లో దాడులు ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. పైగా ఈజిప్ట్‌ సరిహద్దులోని రఫా (Rafah)పై అటాక్ చేసేందుకు సిద్ధమవుతున్నాని స్పష్టం చేసింది. హమాస్‌ ఉగ్రవాదులు ఇక్కడే భారీ స్థాయిలో మొహరించినట్టు గుర్తించింది ఇజ్రాయేల్. అందుకే ఈ ప్రాంతంపైనే ఫోకస్ పెట్టింది. అయితే... ఇజ్రాయేల్ ప్రకటనతో ఈజిప్ట్ అప్రమత్తమైంది. తమ సరిహద్దు ప్రాంతంలో అలజడి సృష్టించాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఇప్పుడు ఇజ్రాయేల్ ఈజిప్ట్‌కి వార్నింగ్ ఇచ్చింది. హమాస్ ఉగ్రవాదుల్ని తమకు అప్పగించే విధంగా ఒప్పందం కుదుర్చుకుంటే దాడుల్ని ఆపేస్తామని వెల్లడించింది. ఈ డీల్‌ కుదుర్చుకోడానికి ఇదే చివరి అవకాశం అని తేల్చి చెప్పింది. దాడి చేసే ముందే ఏదో ఓ నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఇప్పటికే ఇజ్రాయేల్, ఈజిప్ట్ అధికారుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. Channel 12  న్యూస్‌ వెల్లడించిన వివరాల ప్రకారం...చర్చల పేరు చెప్పి తాము కాలయాపన చేయమని, ఆలస్యం అయితే కచ్చితంగా రఫా ప్రాంతంపై దాడి చేస్తామని ఇజ్రాయేల్ వెల్లడించింది. ఈజిప్ట్‌కి ఇదే లాస్ట్ ఛాన్స్‌ అని గట్టిగా చెప్పింది. 


ఈజిప్ట్‌ ఏం చేయనుంది..?


ఇజ్రాయేల్ హమాస్ మధ్య యుద్ధ వాతావరణాన్ని చల్లార్చేందుకు అటు ఈజిప్ట్‌తో పాటు ఖతార్ కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి. ఇజ్రాయేల్‌ ఒకవేళ రఫాపై దాడులు మొదలు పెడితే వేలాది మంది పాలస్తీనా ప్రజలు ఈజిప్ట్‌కి శరణార్థులుగా వచ్చే అవకాశాలున్నాయి. ఇలా సరిహద్దులో అలజడి పెరుగుతుందని ఈజిప్ట్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే చాలా మంది ఈజిప్ట్‌కి వలస వెళ్లారు. ఇది తమ దేశ భద్రతకు ముప్పుగా భావిస్తోంది. అందుకే వీలైనంత వరకూ ఇజ్రాయేల్‌ని శాంతింపజేసే ప్రయత్నమే చేస్తోంది. గతేడాది అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయేల్‌పై హమాస్‌ దాడి చేసింది. అప్పటి నుంచి మొదలైందీ యుద్ధం. ఇజ్రాయేల్ ప్రతిదాడులకు దిగింది. ఫలితంగా గాజా ప్రాంతంలోని ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఇదే క్రమంలో ఇజ్రాయేల్ ముందుగా రఫా ప్రాంతంపైనే దాడులు చేసింది. అక్కడే హమాస్ స్థావరాలు ఎక్కువగా ఉన్నాయని గుర్తించింది. ఇప్పుడు మరోసారి ఇదే ప్రాంతంపై దృష్టి సారించింది.


పైగా మునుపటి కన్నా తీవ్రంగా దాడులు చేస్తామని హెచ్చరించడం ఆందోళనకరంగా మారింది. ఈజిప్ట్ మాత్రం ఈ దాడులపై తీవ్ర వ్యతిరేక వ్యక్తం చేస్తోంది. ఆ దేశ అధ్యక్షుడు అబ్దేల్ ఫతా ఇజ్రాయేల్‌ని హెచ్చరించారు. రఫాలో ఎట్టి పరిస్థితుల్లోనూ మిలిటరీ చర్యలు చేపట్టకూడదని తేల్చి చెబుతున్నారు. అనవసరంగా కవ్విస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అంటున్నారు. ఇక ఇజ్రాయేల్‌ అటు ఇరాన్‌తోనూ తలపడుతోంది. ఫలితంగా మధ్యప్రాచ్యంలోనూ ఇదే అలజడి కొనసాగుతోంది. ఇరాన్‌లోని ఎంబసీపై ఇజ్రాయేల్ దాడితో రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. దాడులు, ప్రతిదాడులతో ఇరు దేశాలూ కవ్వింపులకు దిగాయి. 


Also Read: పోషించే స్థోమత లేక పిల్లల్ని అమ్మకానికి పెట్టిన తండ్రి - షాకింగ్ ఘటన