Economical Crisis in Pakistan: పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం (Pakistan Economical Crisis) రోజురోజుకీ ముదురుతోంది. దాదాపు ఏడాది కాలంగా అక్కడి ప్రజలు పేదరికంతో అల్లాడిపోతున్నారు. ఒక్క పూట తిండి తినడమే గగనమైపోయింది. చాలా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. పిల్లల్ని పోషించలేక తల్లిదండ్రులు నరక యాతన అనుభవిస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. పాకిస్థాన్‌కి చెందిన ఓ తండ్రి పిల్లల్ని పోషించే స్థోమత లేక వాళ్లను అమ్మేస్తానంటూ భావోద్వేగానికి గురయ్యాడు. ఎవరైనా తమ పిల్లల్ని కొనుక్కోవాలని వేడుకున్నాడు. పెషావర్‌కి చెందిన షేర్ జమాన్‌ ఇలా తన పిల్లల్ని విక్రయానికి పెట్టాడు. ఈ వీడియో చాలా మందిని షాక్‌కి గురి చేసింది. షేర్ జమాన్ పని చేస్తున్న ఇటుకల బట్టీ దాదాపు రెండేళ్లుగా మూసేసే ఉంది. ఇంత వరకూ ఎక్కడా పని దొరకలేదు. రోజూ పిల్లలు ఆకలితో నకనకలాడుతున్నారు. ఇది చూడలేక, వాళ్లకి కడుపు నిండా తిండి పెట్టలేక మానసిక క్షోభకు గురయ్యాడు. నిలువ నీడ కూడా లేకుండా పోయింది. అందుకే ఏ దిక్కూ లేక ఇలా పిల్లల్ని అమ్మకానికి పెట్టాడు. "మా పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు. నాకు వాళ్లను పోషించడానికి ఏ పనీ దొరకడం లేదు" అని వాపోయాడు. తప్పనిసరి పరిస్థితుల్లో పిల్లల్ని అమ్మకానికి పెట్టాల్సి వస్తోందని చెప్పాడు. ఈ వీడియో వైరల్ అవడం వల్ల పెషావర్ డిప్యుటీ కలెక్టర్ స్పందించారు. ఆ ఇద్దరు పిల్లల్నీ వెల్ఫేర్ ఇన్‌స్టిట్యూషన్‌కి తరలించారు. శానిటేషన్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ షేర్ జమాన్‌కి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చింది. ఓ మాజీ మంత్రి ఆ కుటుంబానికి రూ.లక్షన్నర విరాళంగా ఇచ్చాడు. ఈ ఘటన స్థానికంగానూ అలజడి రేపింది. ఆ తండ్రికి మద్దతుగా కొందరు ధైర్యం చెబుతున్నారు. 


మరో హృదయవిదారక ఘటన..


ఇటీవలే పాకిస్థాన్‌లో మరో దారుణం జరిగింది. ఓ కూలీ తన భార్యతో పాటు పిల్లల్ని ఘోరంగా హత్య చేశాడు. గొడ్డలితో నరికి చంపాడు. ఏడుగురు పిల్లల్ని పెంచే స్థోమత లేదని అందుకే చంపానని చెప్పాడు. వీళ్లలో 8 నెలల చిన్నారి కూడా ఉంది. పంజాబ్ ప్రావిన్స్‌లో ఈ ఘోరం జరిగింది. ఈ ఘటనపై స్థానికులు స్పందించారు. నిందితుడి మానసిక స్థితి బాలేదని, అప్పులపాలై పోయాడని చెప్పారు. ఆ అప్పులు తీర్చలేక ఇలా అయిపోయాడని వివరించారు. తరచూ ఇంట్లో వాళ్లతో గొడవ పడుతుండేవాడని, ఆ గొడవలే పెద్దవై హత్య వరకూ దారి తీసి ఉండొచ్చని అంటున్నారు. హత్య చేసిన తరవాత నిందితుడు తనంతట తానుగా వెళ్లి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. పాకిస్థాన్‌ ఎంత దీన స్థితిలో చెప్పడానికి ఈ ఘటనలే ఉదాహరణలు. ఇప్పటికే దేశ ఆర్థిక వ్యవస్థపై మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ఓ లేఖ  రాశారు. ఇంకెన్నాళ్లు ఇలా అనిశ్చితిలో గడపాలని ప్రశ్నించారు. 1971 నాటి రోజులు గుర్తుకు వస్తున్నాయని అన్నారు. 


Also Read: ఆన్సర్ షీట్‌ని జైశ్రీరామ్‌తో నింపేశారు, పాస్ అయ్యారు - కరెక్ట్ చేసిన ప్రొఫెసర్‌లు సస్పెండ్