Gaza News: అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నా రఫాపై ఇజ్రాయేల్ దాడులు (Israel Attack on Rafah) కొనసాగుతూనే ఉన్నాయి. హమాస్ ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా ఇజ్రాయేల్ సేన విరుచుకుపడుతోంది. ఈ యుద్ధం కారణంగా చిన్నారులు బలైపోతున్నారు. ఆకలితో అలమటించిపోతున్నారు. చివరకు ప్రాణాలు కోల్పోతున్నారు. గాజాలో చాలా చోట్ల ఇదే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రత్యక్ష యుద్ధంలో చనిపోయే వాళ్లెందరున్నారో ఇలా పరోక్షంగా ప్రభావితమై బలి అవుతున్న వాళ్లూ అంతమందే ఉన్నారు. అక్కడి మీడియా చెబుతున్న లెక్కల ప్రకారం గాజాలో కనీసం 30 మంది చిన్నారులు పోషకాహార లోపంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కడుపు నిండా తిండి లేక అల్లాడిపోతున్నారు. ఇజ్రాయేల్ మిలిటరీ ఆపరేషన్‌ (Rafah Attack) కారణంగా ఇక్కడ ప్రాథమిక చికిత్స అందించడానికీ దిక్కులేకుండా పోయింది. ఆహారమూ దొరకడం లేదు. ఇక్కడి పరిస్థితులపై ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేస్తోంది. పిల్లల్లో నీరసం, పోషకాహార లోపం తగ్గించాలంటే ఇప్పటికిప్పుడు పెద్ద ఎత్తున అక్కడికి ఆహారం పంపించాల్సిన అవసరముందని తేల్చి చెప్పింది. ఈ సరఫరాలో ఎక్కడా అంతరాయం కలగకూడదని వెల్లడించింది. 



(Image Credits: UNICEF)


ఆహార సరఫరాకి ఆటంకాలు..


చికిత్స అందించేందుకు వచ్చే వాహనాలకు (Israel Hamas War) ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈజిప్ట్ సరిహద్దు ప్రాంతాన్ని ఇజ్రాయేల్‌ పూర్తిగా అధీనంలోకి తీసుకుంది. రఫా క్రాసింగ్‌ని మూసివేశారు. మే 7వ తేదీ నుంచి ఇక్కడికి వచ్చే ఆహార సరఫరా (Gaza News) బాగా తగ్గిపోయింది. గాజాలోని ఉత్తర ప్రాంతానికి ఆహార పదార్థాలు తరలించేందుకు ఎలాంటి ఇబ్బంది లేకపోయినా సౌత్‌లోని ప్రజలకు మాత్రం అవి అందడం లేదు. ఇక్కడి చిన్నారులే ఆకలితో అలమటించి ప్రాణాలు కోల్పోతున్నారు. అక్కడి వాతావరణం వల్ల కూడా షిప్‌మెంట్స్ జరగడం లేదు. ఇలా ఒక్కో సమస్య తోడై అక్కడి చిన్నారులు బలి అవుతున్నారు. అక్కడ మానవతా సాయం అందించేందుకు సిద్ధమైన సంస్థలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఆహార సంక్షోభాన్ని సృష్టిస్తున్నారని మండి పడుతున్నాయి. ఇటీవలే ఓ 13 ఏళ్ల బాలుడు పోషకాహార లోపంతో ప్రాణాలు కోల్పోయాడు. దాదాపు రెండు వారాలుగా ఇక్కడ ఇవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎంత మంది చిన్నారులు ఇలా చనిపోతున్నారన్న లెక్కలూ బయటకు రావడం లేదు. హాస్పిటల్స్‌లో చనిపోయే వారి కంటే ఇంట్లోనో, వీధిలోనో ఆకలతో నకనకలాడి మృతి చెందుతున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. 


గాజాలో చాలా మంది చిన్నారులకు రోజుల తరబడి తిండి దొరకడం లేదు. ఇక్కడి పిల్లల్లో దాదాపు 85% మంది సరైన ఆహారం లేక అవస్థలు పడుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. ఆకలి చావులు పెరుగుతున్న క్రమంలోనే ఏదో ఓ పరిష్కారం కనుగొనాల్సిన అవసరముందని తేల్చి చెబుతున్నారు. రెండు వర్గాల మధ్య యుద్ధానికి చిన్నారులు నలిగిపోవడమేంటని మండి పడుతున్నారు. ఇటీవల ఇజ్రాయేల్ రఫాపై దాడులు చేసింది. ఈ దాడుల్లో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. వీళ్లలో చిన్నారులూ ఉండడం అంతర్జాతీయంగా అలజడి సృష్టించింది. పలువురు ప్రముఖులు All Eyes on Rafah హ్యాష్‌ట్యాగ్‌తో పోస్ట్‌లు పెడుతున్నారు. 


Also Read: Arvind Kejriwal: జూన్ 5 వరకూ జ్యుడీషియల్ కస్టడీకి కేజ్రీవాల్, లొంగిపోయిన వెంటనే కోర్టు ఆదేశాలు