Delhi Liquor Scam Case Updates: బెయిల్ గడువు ముగిసిన క్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ తిహార్‌ జైల్‌లో లొంగిపోయారు. అంతకు ముందు రాజ్‌ఘాట్‌కి వెళ్లి మహాత్మ గాంధీకి నివాళులు అర్పించారు. కన్నౌట్ ప్లేస్‌లో హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు. ఆ తరవాత జైలుకి వెళ్లారు. ఆ వెంటనే ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు కీలక ఆదేశాలిచ్చింది. ఈడీ విజ్ఞప్తి మేరకు జూన్ 5వ తేదీ వరకూ కేజ్రీవాల్‌ని జ్యుడీషియల్ కస్టడీలో ఉంచేందుకు అనుమతినిచ్చింది. కేజ్రీవాల్ లొంగిపోయిన వెంటనే మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. మే 20 వ తేదీన బెయిల్‌పై విడుదలయ్యారు కేజ్రీవాల్. లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రచారం చేసుకునేందుకు అనుమతినివ్వాలని సుప్రీంకోర్టుని కోరారు. ఈ మేరకు కోర్టు అంగీకరించింది. జూన్ 2వ తేదీన మళ్లీ లొంగిపోవాలని తేల్చి చెప్పింది. లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో పాటు బెయిల్ గడువు కూడా ముగియడం వల్ల ఆయన సరెండర్ అయ్యారు. ఇప్పటికే సుప్రీంకోర్టులో మరో పిటిషన్ పెండింగ్‌లో ఉంది. ఈడీ అరెస్ట్‌ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్‌ ఈ పిటిషన్ వేశారు. రెగ్యులర్ బెయిల్ కోసమూ అర్జీ పెట్టుకున్నారు. జూన్ 5వ తేదీన దీనిపై నిర్ణయం తీసుకుంటామని కోర్టు స్పష్టం చేసింది. 






జైలుకి వెళ్లే ముందు కేజ్రీవాల్‌ ఎగ్జిట్‌ పోల్స్ అంచనాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. అవన్నీ ఫేక్ అని తేల్చి చెప్పారు. ఒక్కో రాష్ట్రంలో ఉన్న దాని కంటే ఎక్కువ సీట్‌లు బీజేపీకి వచ్చినట్టుగా చూపించారని, ఎవరో ఒత్తిడి చేయడం వల్ల ఇలాంటి తప్పులు జరిగాయని సెటైర్లు వేశారు. కౌంటింగ్‌ మూడు రోజుల ముందు ఇలాంటి ఫేక్‌ పోల్స్‌ని విడుదల చేయడం ఎందుకని ప్రశ్నించారు.


"ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ ఫేక్. రాజస్థాన్‌లో ఉన్నవే 25 స్థానాలైతే ఓ సంస్థ బీజేపీకి ఏకంగా 33 స్థానాలు ఇచ్చింది. ఎవరో కావాలనే బలవంత పెట్టి ఈపోల్స్‌ని విడుదల చేయించారని అర్థమవుతోంది. ఈ అంచనాలన్నీ అవాస్తవాలే. మూడు రోజుల్లో అసలైన ఫలితాలు వస్తాయి. అంతలోనే ఈ ఫేక్‌ పోల్స్ ఎందుకు విడుదల చేశారు"


- అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి






Also Read: Pune Porsche Case: అవును నేను తాగి కార్‌ నడిపాను, ఏమీ గుర్తు లేదు - విచారణలో అంగీకరించిన పోర్షే కేస్ నిందితుడు