Cheating With QR Codes In Hyderabad: ఇద్దరు ఉద్యోగులు తాము పని చేస్తోన్న కంపెనీకే కన్నం వేశారు. సంస్థ క్యూఆర్ కోడ్స్ మార్చేసి వినియోగదారులు చెల్లించే డబ్బులను తమ సొంత ఖాతాలకు మళ్లించుకున్నారు. ఇలా ఏకంగా రూ.4.15 కోట్ల మోసానికి పాల్పడ్డారు. చివరకు సదరు కంపెనీ నిర్వహించిన ఆడిట్‌లో అసలు నిజం వెలుగు చూడడంతో యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారించిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ (Hyderabad) కొండాపూర్‌లోని 'ఇస్తారా పార్క్స్ ప్రైవేట్ లిమిటెడ్' (Isthara Parks Private Limited) సంస్థ ఆతిథ్య రంగంలో సేవలందిస్తోంది. నగరంలో ఒంటరిగా ఉండే ఉద్యోగుల కోసం ఈ సంస్థ 'కోలివింగ్ ప్రాపర్టీస్' పేరుతో అద్దె గృహాలు సైతం నిర్వహిస్తోంది. ఈ సంస్థకు దేశవ్యాప్తంగా 16 నగరాల్లో ఫుడ్ కోర్టులు కూడా ఉన్నాయి. కాగా, నగర పరిధిలో 'కోలివింగ్ ప్రాపర్టీస్'లో పని చేసే ఉద్యోగులు.. వినియోగదారుల నుంచి డిజిటల్ విధానంలో 'క్యూఆర్ కోడ్' ద్వారా మాత్రమే స్వీకరించాలి. ఈ నగదు నేరుగా సంస్థ ఖాతాలో జమవుతుంది.


క్యూఆర్ కోడ్స్ మార్చేసి..


అయితే, చెంగిచెర్లకు చెందిన యసిరెడ్డి అనిల్ కుమార్, సికింద్రాబాద్ కు చెందిన రాజ్ కుమార్‌లు ఈ సంస్థలో గతేడాది మార్చి నుంచి ఫ్లోర్  మేనేజర్లుగా పని చేస్తున్నారు. వినియోగదారుల నుంచి సంస్థ డిజిటల్ విధానంలో చెల్లింపులు స్వీకరిస్తోందని గమనించిన వీరిద్దరూ కంపెనీ క్యూఆర్ కోడ్స్ మార్చేశారు. ఇస్తారా స్థానంలో ఇస్తరా, ఇస్తా పేరుతో ఉండే నకిలీ క్యూఆర్ కోడ్స్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని అవుట్ లెట్స్‌లో ఈ నకిలీ క్యూఆర్ కోడ్స్ ఉంచారు. ఈ క్రమంలో వినియోగదారులు చెల్లించిన సంస్థ సొమ్మంతా వీరిద్దరి వ్యక్తిగత ఖాతాల్లో జమయ్యేవి. ఇలా కంపెనీ సొమ్ము రూ.4.15 కోట్లు కాజేశారు. అనిల్ ఒక్కడి ఖాతాలోనే రూ.2 కోట్లు తన ఖాతాలోకి మళ్లించుకున్నాడు. ఈ సొమ్ములో రూ.40 లక్షలతో ఓ ఫ్లాటు, మోసానికి సహకరించిన తన సహోద్యోగాలకు రూ.70 లక్షలు, మరికొందరికి రూ.60 లక్షలు చెల్లించాడు. తన సొంత అప్పులు తీర్చుకున్నట్లు పోలీసుల విచారణలో అంగీకరించినట్లు తెలుస్తోంది. రాజ్‌కుమార్ రూ.10 లక్షల కంపెనీ సొమ్ము తన ఖాతాల్లోకి మళ్లించుకున్నాడు.


ఆడిట్‌తో వెలుగులోకి..


ఆదాయానికి సంబంధించిన పద్దులపై సంస్థ యాజమాన్యం ఆడిట్ నిర్వహించగా ఈ మోసం వెలుగుచూసింది. ఇస్తారా పార్క్స్ ప్రతినిధి ఈవోడబ్ల్యూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై కేసు నమోదు చేసి విచారించిన పోలీసులు ఇద్దరు నిందితులు అనిల్, రాజ్ కుమార్‌లను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. కాగా, వ్యాపార సంస్థలు ఎప్పటికప్పుడు ఆర్థిక కార్యకలాపాలు పర్యవేక్షించాలని.. సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా ఉంచాలని పోలీసులు సూచిస్తున్నారు.