Islamabad High Court: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆయన పార్టీ పీటీఐ అణచి వేయాలని చూస్తున్న పాకిస్థాన్ ప్రభుత్వానికి, అక్కడి సైన్యానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా పాక్ సర్కారుకు ఇస్లామాబాద్ కోర్టు షాక్ ఇచ్చింది. శాంతి భద్రతలను సాకుగా చూపిస్తూ గత వారంలో పీటీఐ నాయకుడు షా మహ్మద్ ఖురేషీని పాక్ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఖురేషి అరెస్టును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ విచారణకు రాగా.. జస్టిస్ మియాంగుల్ హసన్ ఔరంగజేబ్ విచారించి.. ఖురేషీ అరెస్ట్ చట్ట వ్యతిరేకమని చెబుతూ తీర్పు వెలువరించారు. తక్షణమే ఖురేషీని విడుదల చేయాలని పాక్ సర్కారును ఆదేశించారు.


ఇమ్రాన్ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి


మరోవైపు ఇమ్రాన్ ఖాన్ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆయన ఇంట్లో 40 మంది వరకు ఉగ్రవాదులు ఉన్నారని.. వారిని వెంటనే అప్పగించాలంటూ పాక్ ప్రభుత్వం 24 గంటల గడువు ఇచ్చింది. ఆ గడువు సమయం ముగియడంతో లాహోర్ లోని ఆయన ఇంటిని భారీగా పోలీసులు చుట్టు ముట్టారు. ఇమ్రాన్ ఖాన్ నివాస మార్గాన్ని బారికేడ్లతో మూసేశారు. మరోవైపు అల్-ఖాద్రీ ట్రస్ట్ కు భూముల కేటాయింపుకు సంబంధించి ఇవాళ ఇమ్రాన్ ఖాన్ కు నేషనల్ అకౌంటెబిలిటీ బ్యూరో నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఇమ్రాన్ ఖాన్ రాతపూర్వకంగా జవాబిచ్చారు. పలు కేసుల విచారణ ఉండటంతో ఎన్బీఏ ఎదుట ప్రత్యక్షంగా హాజరు కాలేకపోతున్నట్లు అందులో పేర్కొన్నారు. తనపై వచ్చినవన్నీ తప్పుడు ఆరోపణలని లేఖలో ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. పాక్ ప్రభుత్వ ఒత్తిడిలోనూ ఇమ్రాన్ ఖాన్ ఎదురుదాడికి దిగుతున్నారు. నిరాయుధులైన పీటీఐ కార్యకర్తలపై మే 9వ తేదీన కాల్పులు జరపడంపై దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. సైన్యం, పోలీసుల కాల్పుల్లో కనీసం 25 మంది పీటీఐ కార్యకర్తలు మృతి చెందారని, వందల సంఖ్యలో గాయపడ్డారని ఇమ్రాన్ ఖాన్ అంటున్నారు.


పాక్ లో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ అమెరికా ఎంపీల లేఖ


పాకిస్థాన్ లో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అమెరికా కాంగ్రెస్ ఎంపీలు 65 మంది విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ కు లేఖ రాశారు. పాక్ లో డెమెక్రసీని కాపాడటానికి కృషి చేయాలని ఆ లేఖలో కోరారు. 


పది రోజుల క్రితం ఇస్లామాబాద్ హైకోర్టు బయట ఇమ్రాన్ ఖాన్ ను పోలీసులు అరెస్టు చేశారు. అవినీతి ఆరోపణల కేసులో పాక్ మాజీ ప్రధానిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు తర్వాత పాకిస్థాన్ దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హింసాయుతంగా మారిన పరిస్థితుల నేపథ్యంలో పాక్ సర్కారు పీటీఐ నాయకుడు షా మహ్మద్ ఖురేషీని అరెస్టు చేసింది. ఇమ్రాన్ ఖాన్‌ను కస్టడీలోకి తీసుకున్నప్పటి నుంచి ఆయనను తీవ్రంగా వేధిస్తున్నారన్న వాదనలూ వినిపిస్తున్నాయి. ఆయనను రాత్రంతా టార్చర్ చేశారని, నిద్ర కూడా పోనివ్వలేదని ఓ జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ కామెంట్స్ తరవాత ఇమ్రాన్ సపోర్టర్స్ మరింత రెచ్చిపోయారు. బిల్డింగ్స్‌ని ధ్వంసం చేశారు. పోలీసుల వాహనాలకు నిప్పు పెట్టారు. పంజాబ్ ప్రావిన్స్‌లో నిరసనకారులు రెచ్చిపోవడంతో పోలీసులూ అదే స్థాయిలో విరుచుకుపడ్డారు. దాదాపు వెయ్యి మందిని అరెస్ట్ చేశారు. పోలీస్ అధికారులు ఈ అరెస్ట్‌లను ధ్రువీకరించారు.