Sadhguru Jaggi Vasudev Brain Surgery: ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్‌కి బ్రెయిన్ సర్జరీ జరిగింది. ప్రాణాంతకమైన వ్యాధితో బాధ పడుతున్న ఆయనకు వెంటనే సర్జరీ చేయాలని వైద్యులు సూచించారు. ఈ మేరకు ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో ఈ శస్త్రచికిత్స జరిగినట్టు ఈశా ఫౌండేషన్ వెల్లడించింది. ప్రస్తుతానికి ఆయన కోలుకుంటున్నారని తెలిపింది. 


"ప్రాణాంతకమైన అనారోగ్యంతో సద్గురు జగ్గీవాసుదేవ్ ఇబ్బంది పడ్డారు. బ్రెయిన్ సర్జరీ జరిగింది. ప్రస్తుతానికి ఆయన కోలుకుంటున్నారు"


- ఈశా ఫౌండేషన్ 




సద్గురుకి తీవ్రమైన తలనొప్పి వచ్చినట్టు ఈశా ఫౌండేషన్ వెల్లడించింది. బ్రెయిన్‌లో రక్తస్రావమైందని తెలిపింది. పరిస్థితి విషమంగా ఉందని గమనించి ఆయనని ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్స్‌లో చేర్చినట్టు వివరించింది. మార్చి 17వ తేదీనే ఆయనకు బ్రెయిన్ సర్జరీ జరిగింది. 


"దాదాపు నాలుగు వారాలుగా సద్గురు తీవ్రమైన తలనొప్పితో బాధ పడుతున్నారు. మార్చి 14 మధ్యాహ్నానికి ఇది మరీ ఎక్కువైపోయింది. ఆ సమయానికి ఆయన ఢిల్లీలో ఉన్నారు. అదే రోజు సాయంత్రం వైద్యుల సూచన మేరకు MRI చేయించాం. మెదడులో రక్తస్రావం అయినట్టు తేలింది. దాదాపు మూడు నాలుగు వారాలుగా బ్లీడింగ్ అవుతున్నట్టు వైద్యులు చెప్పారు. అయినా సద్గురు తన షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు చేయకుండా అలాగే కొనసాగించారు. మార్చి 17వ తేదీ నాటికి ఆయన పరిస్థితి మరీ విషమించింది. తలనొప్పితో వాంతులు అయ్యాయి. అందుకే కొద్ది గంటల్లోనే వైద్యులు సర్జరీ చేశారు"


- ఈశా ఫౌండేషన్