Rashtrapatni row: 


లింగ సమానత్వం, మహిళా హక్కులపై చర్చ 


ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా అలా ప్రమాణ స్వీకారం చేశారో లేదో అప్పుడే ఆమె కేంద్రంగా రాజకీయాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ పొరపాటున రాష్ట్రపతి పేరుని "రాష్ట్రపత్ని" (Rashtrapatni) అని అన్నారు. అది పార్లమెంట్‌లో ప్రకంపనలే సృష్టించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ...కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అధీర్ రంజన్ గిరిజన వర్గాన్ని కించపరిచారని భాజపా తీవ్రంగా విమర్శించింది. దాదాపు రెండు రోజుల పాటు ఈ వివాదం కొనసాగింది. చివరకు అధీర్ రంజన్ క్షమాపణలు చెప్పారు. ఇదంతా ఇప్పటి వరకూ జరిగిన కథ. అయితే...అసలు "రాష్ట్రపతి" అనే హోదాపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది. "రాష్ట్రపతి" అనేది జెండర్ న్యూట్రల్ (పుల్లింగం, స్త్రీలింగంతో సంబంధం లేని) టైటిల్‌ అన్నది కొందరి వాదన. అయితే కాస్త లోతుగా విశ్లేషిస్తే ఇందుకు సంబంధించి ఇంకెన్నో వాదనలు వినిపిస్తున్నాయి. సాధారణంగా ఈ అత్యున్నత పదవిని హిందీలో "రాష్ట్రపతి" అని పరిగణిస్తారు. పతి అంటే అర్థం భర్త అని అందరికీ తెలిసిన విషయమే. మరి ఈ అత్యున్నత స్థానంలో మహిళ ఉంటే వారిని ఎలా పిలవాలి అన్నది మాత్రం
ఎక్కడా నిర్ధరించలేదు.


అధీర్ రంజన్ వ్యాఖ్యలతో ఒక్కసారిగా ఈ అంశం చర్చకు వచ్చింది. నిజానికి 140 కోట్ల జనాభా ఉన్న భారత్‌లో కేవలం రెండు సార్లు మాత్రమే మహిళలు రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రతిభా పాటిల్ తరవాత ద్రౌపది ముర్ము మహిళా రాష్ట్రపతి పదవిని అలంకరించారు. అంతే కాదు...ఈ హోదా దక్కించుకున్న తొలి గిరిజన మహిళగానూ రికార్డు సాధించారు. అయితే రాష్ట్రపత్ని వ్యాఖ్యలతో మరోసారి లింగ సమానత్వం, మహిళా హక్కుల అంశాలపై చర్చ మొదలైంది.  
 
పతి అంటే ఎన్ని అర్థాలున్నాయి..? 


2007లో ప్రతిభా పాటిల్ రాష్ట్రపతి పదవిని అలంకరించిన సమయంలో మీడియాలో ఓ అయోమయం మొదలైంది. "రాష్ట్రపతి" అనే హోదాను ప్రతిభా పాటిల్‌కు కూడా ఆపాదించాలా..? ఆమెను అసలు ఎలా పిలవాలి..? అని అప్పట్లో చర్చించుకున్నారు. అయితే అప్పుడే ఓ విషయం వెల్లడైంది. భారత రాజ్యాంగంలో అత్యున్నత పదవి అయిన "రాష్ట్రపతి"కి జెండర్‌ను ఆపాదించాల్సిన అవసరం లేదని రాజ్యాంగ నిపుణులు కొందరు తేల్చి చెప్పారు. ఈ హోదాకు, జెండర్‌కు ఎలాంటి సంబంధం లేదని..ఆ పదవిలో ఎవరు ఉన్నా రాష్ట్రపతి అనే పిలవాలని వివరించారు. అయితే ఇక్కడే మరో విషయం కూడా గుర్తు చేసుకోవాలి. రాష్ట్రపతిగా ఎంపిక కాక ముందు ప్రతిభా పాటిల్ రాజ్యసభ డిప్యూటీ చైర్‌పర్సన్‌గా విధులు నిర్వర్తించారు. అప్పట్లో ఆమెను ఉప సభాపతి అనే పిలిచేవారు. ఇక మరో వాదన ఏంటంటే...గవర్నర్‌ అనే పదవికి ఎలాంటి జెండర్‌ను ఆపాదించనప్పుడు, రాష్ట్రపతి హోదాకు ఎందుకు అనే వాదన కూడా కొందరు తెరపైకి తీసుకొస్తున్నారు. రాష్ట్రపతి అనే హోదా కూడా జెండర్ న్యూట్రల్‌ పదవిలాగే చూడొచ్చు కదా అన్నది వారి అభిప్రాయం.


ఇక ఈ  వివాదంలో భాషా వేత్తలు తమ వాదన వినిపిస్తున్నారు. "పతి" అనే హిందీ పదానికి సంస్కృతం మూలం. సంస్కృతంలో "పతి" అంటే దేవుడు, నాయకుడు, అధినేత అనే అర్థాలు వస్తాయి. జెండర్‌ను పక్కన పెట్టి చూస్తే..."పతి" అంటే లీడర్ అనే అర్థం కూడా వస్తుంది. అంటే దీనికి జెండర్‌కు ఎలాంటి సంబంధం లేదు. ఆ లీడర్‌ అనే వాళ్లు మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు కదా. ఇక "పతి" అనే పదానికి ఇంగ్లీష్‌లో సమాన పదం "కస్టోడియన్ (Custodian)"గా వ్యవహరిస్తారు. అంటే సంరక్షకులు అని అర్థం. అలా చూసినా...రాష్ట్రపతి పదానికి జెండర్‌ను ఆపాదించాల్సిన పని లేదని స్పష్టమవుతోంది. 


ఆ సూచనను తిరస్కరించిన నెహ్రూ


1947లో తొలిసారి కాన్‌స్టిట్యుయెంట్ అసెంబ్లీ ( Constituent Assembly)జరిగినప్పుడే ఈ అంశం చర్చకు వచ్చింది. రాష్ట్రపతి హోదాలో మహిళ ఉంటే వారిని రాష్ట్రపతిగానే పిలవాలా లేదా అనే విషయమై చాలా వాదనలే వినిపించారు. అప్పట్లో అసెంబ్లీ సభ్యుల్లో కేటీ షా, శ్రీ గోకుల్ భాయ్ దత్త్ ఓ సూచన చేశారు. "రాష్ట్రపతి" హోదాలో మహిళ ఉంటే వారిని "నేత" అని పిలవచ్చు అని చెప్పారు. లేదంటే "కర్ణధార్" అని కూడా పిలవచ్చు అని మరో పేరు సూచించారు. కర్ణధార్ అంటే కేప్టెన్ అని అర్థం. ఇందుకు సంబంధించి లిఖిత పూర్వకంగానూ ప్రతిపాదనలు పంపారు. అయితే అప్పటి ప్రధాని నెహ్రూ ఈ ప్రతిపాదనలను తోసి పుచ్చారు. "రాష్ట్రపతి"గానే ఉంచాలని తేల్చి చెప్పారు. స్వాతంత్య్రోద్యమ సమయంలో కాంగ్రెస్ ప్రెసిడెంట్‌లను "రాష్ట్రపతి" అనే పిలిచేవారు. అందుకే...రాజ్యాగంలోనూ ప్రెసిడెంట్ పదవికి "రాష్ట్రపతి" అనే పేరు నిర్ణయించారు. అప్పటి నుంచి అందరూ పురుషులే ఈ పదవికి ఎంపిక కావటం వల్ల ఎలాంటి సమస్యా రాలేదు. 2007లో ప్రతిభా పాటిల్ రాష్ట్రపతి హోదాను అలంకరించిన సమయంలో జెండర్ రైట్స్‌ యాక్టివిస్ట్‌లందరూ "పితృస్వామ్యంలో భాగంగా వచ్చిన పేరు మార్పు" కోసం డిబేట్ జరగాలని పట్టుపట్టారు. కానీ...ఆ డిమాండ్‌ను ఎవరూ పట్టించుకోలేదు. దాదాపు 15 ఏళ్ల తరవాత మరోసారి దీనిపై కదలిక వచ్చింది. 
 


Also Read: NTR Speech : థియేటర్లకు జనాలు రావడం లేదంటే నమ్మను, ఇండస్ట్రీకి ఇది గడ్డు కాలం కాదు - ఎన్టీఆర్


Also Read: Adhir Ranjan : పొరపాటున నోరు జారా - రాష్ట్రపతికి అధిర్ రంజన్ క్షమాపణ ! వివాదం ముగిసినట్లేనా ?