Legal Age Of Marriage: ఇరాక్‌లో అమ్మాయిల వివాహ వయసుని తగ్గించే వివాదాస్పద బిల్లుని తీసుకురానున్నారు. ఇది అమల్లోకి వస్తే 9 ఏళ్లకే పెళ్లి చేసేందుకు చట్టబద్ధత లభిస్తుంది. ఇప్పటికే ఈ బిల్లుపై తీవ్రం ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇరాక్ న్యాయమంత్రిత్వ శాఖ ఈ బిల్లుని రూపొందించింది. ప్రస్తుతం అక్కడ మహిళల వివాహ వయసు 18 ఏళ్లుగా ఉంది. ఈ నిబంధనను మార్చేసి 9 ఏళ్లకు కుదించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ బిల్ పాసైతే అమ్మాయిల వివాహ వయసు 9 ఏళ్లకి, అబ్బాయిల వివాహ వయసు 15 ఏళ్లకు తగ్గిపోతుంది. ఈ చట్టం వల్ల బాల్య వివాహాలు పెరిగిపోతాయన్న ఆందోళన ఇప్పటికే మొదలైంది. ఎన్నో ఏళ్ల పాటు పోరాటం చేస్తే కానీ బాల్య వివాహాలను తగ్గించలేకపోయామని, ఇప్పుడు మళ్లీ అదే దుస్థితికి తీసుకొస్తున్నారని కొందరు మండి పడుతున్నారు. పైగా మహిళల హక్కులకు, లింగసమానత్వానికి ఇది విరుద్ధమని తేల్చి చెబుతున్నారు. మానవ హక్కుల సంఘాలతో పాటు మహిళా సంఘాలు కూడా ఈ బిల్లుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. మహిళల ఆరోగ్యం, విద్యతో పాటు వాళ్ల ఉనికికే ఇది ప్రమాదమని వాదిస్తున్నారు. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. బాల్య వివాహాలు పెరిగితే డ్రాపౌట్‌లు పెరుగుతాయని, చిన్నప్పుడే గర్భం దాల్చడం వల్ల ఇబ్బందులు తప్పవని అంటున్నారు. పైగా గృహ హింస కూడా పెరిగే ప్రమాదముందని వార్నింగ్ ఇస్తున్నారు. 


యునిసెఫ్ వెల్లడించిన వివరాల ప్రకారం ఇరాక్‌లో 18 ఏళ్ల లోపే పెళ్లి చేసుకుంటున్న అమ్మాయిల సంఖ్య 28%గా ఉంది. ఇప్పుడు దీన్ని లీగల్‌ చేస్తే ఈ వివాహాల సంఖ్య మరింత పెరిగే ప్రమాదముంది. ఇలాంటి చట్టాల వల్ల దేశం వెనకబడుతుందే తప్ప ఎలాంటి పురోగతి సాధించదని మానవ హక్కుల సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది జులైలో కొన్ని ప్రతిపాదనలపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అయితే...ఆ తరవాత షియా వర్గాల నుంచి మద్దతు రావడం వల్ల ఆగస్టు 4వ తేదీన మరోసారి దీనిపై చర్చ మొదలు పెట్టింది. 1959 నాటి చట్టంలో మార్పులు చేర్పులు చేసి త్వరలోనే ఈ బిల్లుని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. అయితే..ప్రభుత్వం మాత్రం వేరే విధంగా తమ నిర్ణయాన్ని సమర్థించుకుంటోంది. అమ్మాయిలు ఎవరి ట్రాప్‌లో చిక్కుకోకుండా, ఎవరి చేతిలోనూ మోసపోకుండా కాపాడేందుకే ఈ బిల్లు తీసుకొచ్చామని వివరిస్తోంది. 


ఇస్లామిక్ చట్టాన్ని బలోపేతం చేసేందుకే ఇదంతా చేస్తున్నామని అంటోంది. కానీ మానవ హక్కుల సంఘాలు మాత్రం ఈ వాదనను కొట్టి పారేస్తున్నాయి. తోటి పిల్లలతో కలిసి ఆడుకునే వయసులో వాళ్లకి పెళ్లి చేసి పంపించడం అనైతికం అని మండి పడుతున్నాయి. అయితే..ఇది అమల్లోకి వస్తుందా రాదా అన్నదే అంతు తేలని ప్రశ్న. గతంలోనూ చాలాసార్లు దీనిపై చర్చ జరిగినా అమలు చేయడం సాధ్యపడలేదు. అందుకే...పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తీవ్ర వ్యతిరేకత వస్తుండడం వల్ల ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. 


Also Read: Bangladesh: బంగ్లాదేశ్‌కి తిరిగి వెళ్లనున్న షేక్ హసీనా! అక్కడ ఎన్నికల్లో పోటీ చేస్తారట!