Iran Schoolgirl Death:


భద్రతా బలగాలే..


ఇరాన్‌లో మరోసారి అల్లర్లు ఉద్ధృతమయ్యాయి. ఇప్పటికే హిజాబ్ విషయంలో అక్కడ దాదాపు మూడు వారాలుగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓ యువతి మృతితో మొదలైన అలజడి ఇంకా సద్దుమణగలేదు. ఇప్పుడు ఓ బాలిక హత్యతో మరోసారి అట్టుడుకుతోంది. అర్డాబిల్‌లోని 16 ఏళ్ల విద్యార్థిని అస్రా పనాహీని భద్రతా దళాలే కొట్టి చంపటం స్థానికంగా కలవరం రేపింది. ప్రభుత్వానికి అనుకూలంగా
పాట పాడలేదన్న కోపంతో...ఆ బాలికను క్లాస్‌రూమ్‌లోనే దారుణంగా కొట్టి చంపారు. అక్టోబర్ 13న ఇరాన్ భద్రతా దళాలు షాహెద్ గర్ల్స్‌ హైస్కూల్‌లో రెయిడ్స్ నిర్వహించాయి. ఆ సమయంలోనే ఇరాన్ సుప్రీం అయతొల్లా అలు ఖుమీనిని పొగిడే ఓ యాంథమ్‌ని పాడాలని బాలికలందరినీ హెచ్చరించాయి భద్రతా బలగాలు. అయితే...ఇందుకు వాళ్లు అంగీకరించలేదు. వెంటనే...విచక్షణా రహితంగా వాళ్లపై దాడికి దిగారు. ఈ ఘటనలో పదుల సంఖ్యలో బాలికలు గాయపడ్డారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ దాడిలోనే పనాహీ అక్కడికక్కడే మృతి చెందింది. ఇప్పటికే అక్కడ హిజాబ్ విషయంలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ ఘటనతో మరోసారి ప్రజలు రోడ్లపైకి వచ్చారు. 
అటు భద్రతా బలగాలు మాత్రం "ఈ ఘటనకు మాకు ఎలాంటి సంబంధం లేదు" అని అంటున్నాయి. దెబ్బల ధాటిని తట్టుకోలేక గుండెనొప్పితో పనాహీ చనిపోయిందని...ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. 


హిజాబ్‌కు వ్యతిరేకంగా..


ఇరాన్‌లోని అన్ని విద్యాసంస్థల్లో హిజాబ్‌కు వ్యతిరేకంగా నినాదాలు వినిపిస్తున్నాయి. అమ్మాయిలు స్కూళ్లు, కాలేజీల్లోనే హిజాబ్‌ను తొలగించి గాల్లోకి విసిరేస్తున్నారు. వీటిని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఉద్యమం మరింత ఉద్ధృతమవుతోందని భావించిన ప్రభుత్వం భద్రతా దళాలను రంగంలోకి దింపింది. అన్ని పాఠశాలల్లోనూ రెయిడ్స్ చేసి...యాంటీ హిజాబ్ ఉద్యమాన్ని అణిచివేయాలని చూసింది. ఈ క్రమంలోనే...బాలికపై దాడి జరిగింది. 


జైల్లో కాల్పులు..


నిరనసకారుల్ని ఎప్పటికప్పుడు అరెస్ట్‌ చేస్తూ జైళ్లకు పంపుతోంది అక్కడి ప్రభుత్వం. టెహ్రాన్‌లోని Evin Prisonలో వందలాది మందిని ఉంచారు. ఆ దేశంలోనే అత్యంత దారుణమైన జైలుగా పేరున్న..ఈ ఎవిన్ ప్రిజన్‌లోనూ హిజాబ్‌ అంశం ఉద్రిక్తతలకు దారి తీసింది.అయితే...ఉన్నట్టుండి ఈ జైల్లోనుంచి కాల్పుల శబ్దాలు వినిపించాయి. పెద్ద ఎత్తున మంటలూ ఎగిసిపడ్డాయి. ఈ వీడియోని ఇరాన్‌ మానవ హక్కుల సంఘం ట్విటర్‌లో షేర్ చేసింది. "మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. కాల్పుల శబ్దాలూ వినిపిస్తున్నాయి" అని పోస్ట్ చేసింది. ఈ వీడియోలో "డెత్ టు డిక్టేటర్" అంటూనినాదాలూ వినిపించాయి. ఈ హిజాబ్ అల్లర్లలో అరెస్టైన వారిని తాత్కాలికంగా విడుదల చేసి మళ్లీ జైలుకి బలవంతంగా తీసుకొచ్చారు. ఈ జైల్లో ఉన్న వారెవరూ "సేఫ్‌గా" ఉండరన్న ప్రచారం అక్కడ జోరుగానే సాగుతోంది. ఇప్పటి వరకూ ఈ ఆందోళనల్లో 108 మంది మృతి చెందినట్టు అంచనా. వీరిలో 23 మంది మైనర్లూ ఉన్నట్టు తెలుస్తోంది. ఇరాన్‌లో మహిళలంతా యాంటీ హిజాబ్ ఉద్యమాన్ని రోజురోజుకీ తీవ్రతరం చేస్తున్నారు. హిజాబ్ ధరించలేదని ఓ యువతిని అరెస్ట్ చేయడం, ఆమె కస్టడీలోనే మృతి చెందడం అక్కడి మహిళలకు ఆగ్రహం కలిగించింది.


Also Read: HP BJP Candidates List: గెలుపు గుర్రాలను దింపుతున్న భాజపా, కాంగ్రెస్ - హిమాచల్‌లో ఎన్నికల వేడి