Pawan Kalyan: చంటి బిడ్డను ఒడిలో పెట్టుకుని... చేతిలో జనసేన జెండా పట్టుకుని రెండు రోజుల పాటు విశాఖ నోవాటెల్ హోటల్ వద్ద పవన్ కల్యాణ్ పోరాడిన మాతృమూర్తి నులక గోవిందం ఆమె భర్త విజయ్ కుమార్ లను జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మంగళవారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో కలిశారు. ఆదివారం అర్ధరాత్రి వైజాగ్ శివారులో ఉన్న గోపాలపట్నంలోని ఇంటికి గోవిందం, విజయ్ కుమార్ దంపతులు తమ నాలుగేళ్ల చిన్నారి వరలక్ష్మిని తీసుకొని వెళ్తుండగా మార్గమధ్యంలో దారి కాచిన వైసీపీ గూండాలు వారి ఆటోని ధ్వంసం చేసిన విషయాన్ని తెలుసుకున్న జనసేనాని వారిని పిలిపించుకొని మాట్లాడారు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి జరిగిన విషయాన్ని పవన్ కల్యాణ్ కు వివరించారు.
శనివారం ఉదయం నుంచే నోవాటెల్ హోటల్ వద్దకు వచ్చామని తర్వాత ర్యాలీలో పాల్గొన్నట్లు చెప్పారు. ఆదివారం ఉదయం పోర్టు కళావాణి స్టేడియంలో జనవాణి కార్యక్రమానికి వెళ్తే.. పవన్ కళ్యాణ్ రాలేడన్న విషయాన్ని తెలుసుకొని మళ్లీ నోవాటెల్ హోటల్ వద్దకు చేరుకొని ఆదివారం రాత్రంతా అక్కడే ఉన్నట్లు చెప్పారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో పోలీసులు వచ్చి ఇంతసేపు బీచ్ రోడ్ లో ఉండకూడదని ఇంటికి వెళ్లాలని చెప్పడంతో ఇంటికి వెళ్లినట్టు చెప్పారు. అయితే మార్గ మధ్యంలోనే 20 మంది వైసీపీ గూండాలు తమపై దాడికి పాల్పడి ఆటోను ధ్వంసం చేసినట్లు చెప్తూ ఇద్దరు దంపతులు బోరున విలపించారు. తమకు ఆటోనే జీవనాధారం అని చెప్పినప్పటికీ ఆటోలో ఉన్న పవన్ కల్యాణ్ ఫొటోలను చింపేసి, ఆటోను పాక్షికంగా ధ్వసం చేసి వెళ్లిపోయారని చెప్పారు.
బీచ్ రోడ్ లో కూడా ఆ రాత్రంతా ఉండాలని అనుకున్నామని అయితే పోలీసులు అక్కడ ఉండకూడదని పంపేయడంతో పాటు జెండాను కూడా తీసుకోవాలని చూశారని, అయితే నా ప్రాణం పోయినా జెండాను మాత్రం విడిచి పెట్టేది లేదని తెలిపానని శ్రీమతి గోవిందం పవన్ కల్యాణ్ కు చెప్పారు. జనసేనాని వీళ్లతో మాట్లాడుతూ... ఎలాంటి భయం లేదని, పార్టీ తరఫున నాయకులు అంతా అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. దీంతో పాటు పార్టీ తరఫు నుంచి రూ. లక్ష చెక్కును వారికీ అందజేశారు. ఆటోకి మరమ్మతులు చేయించుకోవాలని సూచించారు. ఘటన జరిగిన వెంటనే జనసేన పార్టీ నాయకులు శ్రీ జుత్తాడ శ్రీనివాస్, శ్రీ పాతంశెట్టి శ్యాం సుందర్, శ్రీ కోరాడ రాజు, శ్రీ ప్రకాష్, శ్రీ నాయుడు తదితరులు తమకు సహకరించినట్లు ఈ సందర్బంగా చెప్పారు. వారిని పవన్ కల్యాణ్ అభినందించారు.
చిన్నారితో జనసేనాని ముచ్చట...
విశాఖపట్నం పర్యటనలో పవన్ కల్యాణ్ బస చేసిన నోవాటెల్ హోటల్ ఎదురుగా జై జనసేన అంటూ ఐదేళ్ల చిన్నారని హైందవి చేసిన నినాదాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఆ చిన్నారి ముచ్చటగా చేసిన జై జనసేన నినాదాలను చూసిన పవన్ కల్యాణ్ ఆ పాపతో ముచ్చటించాలని భావించారు. చిన్నారి హైందవి తల్లిదండ్రులు శ్రీ పల్లా శివప్రసాద్, శ్రీదేవి దంపతులతో మాట్లాడారు. ఆదివారం జనసేన అధినేతను చూసేందుకు కుటుంబంతో సహా వచ్చామని, అక్కడున్న వారి నినాదాలు విన్న చిన్నారి హైందవి కూడా జై జనసేన అంటూ నినాదాలు చేసినట్లు తల్లిదండ్రులు పవన్ కల్యాణ్ కు వివరించారు. ఈ సందర్భంగా చిన్నారితో కాసేపు పవన్ కల్యాణ్ ముచ్చటించారు. తమకు మెగా కుటుంబం అంటే ఎంతో అభిమానం అని ఈ సందర్భంగా హైందవి తల్లిదండ్రులు పవన్ కళ్యాణ్ కు తెలియజేశారు.