TRS Leaders Complaint: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో కోడ్ ఉల్లంఘనలకు పాల్పడుతున్న బీజేపీ నాయకులపై టీఆర్ఎస్ నేతలు దేవి ప్రసాద్, రమేష్ రెడ్డి, సోమ భరత్ కుమార్ లు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. దేవుళ్లకు, రాక్షసులకు మధ్య ఎన్నికలు అనే అంశంపై పరోక్షంగా బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారని తెలిపారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఈవో సత్యవాణిని కోరారు. 


ఎవరైనా బొట్టు పెట్టుకొని, కాషాయ కండువా వేసుకొని జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చట్ట బద్ధంగా, హుందాగా మాట్లాడుతారని మనం అనుకుంటామని టీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ సోమ భరత్ అన్నారు. కానీ ఇవాళ మునుగోడు నియోజకవర్గంలో బండి సంజయ్ పచ్చి బూతులు మాట్లాడుతూ, అబండాలు వేయడం, వాళ్లకు వాళ్లే దేవవుళ్లుగా చిత్రీకరించుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం చేస్తున్నారని ఆరోపించారు. 40 వేలు తీసుకొని బీజేపీకి ఓటు వేయండి అనడం కోడ్ ఆఫ్ కండక్ట్ కిందికి వస్తుందని తెలిపారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందనే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామన్నారు. 


బండి సంజయ్ ఎంపీ అయి ఉండి ఇలా మాట్లాడం కరెక్ట్ కాదని సోమ భరత్ తెలిపారు. వీటి అన్నింటిపై సీరియస్ చర్యలు తీసుకోవాలని కోరినట్లు వివరించారు. ఇవాల చర్యలు తీసుకోక పొతే రానున్న రోజుల్లో మరింత దిగజారి పోతారంటూ కామెంట్లు చేశారు. బండి సంజయ్ ప్రవచనాలు రాష్ట్రానికి, దేశానికి మంచిని కావని చెప్పారు. బీజేపీ నాయకులపై చర్యలు తీసుకోకపోతే బీజేపీ పార్టీకి కొమ్ము కాసినట్లు అవుతుందన్నారు. ఎన్నికల కమిషన్ కు రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉందని చెప్పుకొచ్చారు. గుర్తుల విషయంలో కూడా ఆ పార్టీకి లాభం చేకూరులే నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. స్వతంత్ర అభ్యర్ధులకు కారు పోలిన గుర్తులను కేటాయించవద్దని చెప్పినప్పటికీ.. కారును పొలిన గుర్తులను మళ్లీ కేటాయించారని తెలిపారు. వీటన్నిటి వల్ల టీఆర్ఎస్ కు నష్టం చేకూరుతుందన్నారు. 


గుర్తుల విషయంలో న్యాయ బద్ధమైన పోరాటం చేస్తాం..  
ఎన్నికలు ముగిసిన తరువాత కారును పోలిన గుర్తుల పై న్యాయ పోరాటం చేస్తామని సోమ భరత్ కుమార్ వివరించారు. బీజేపీకి ప్రజల మద్దతు లేక ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారని టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు దేవిప్రసాద్ అన్నారు. ఒక వైపు దొంగ ఓట్లు సృష్టించి ఓట్లు పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. దేవుళ్లకు, రాక్షసులకు మధ్య జరుగుతున్న ఎన్నికలుగా చెప్తూ.. మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ బ్యాచ్ దండుపాళ్యం బ్యాచ్ అంటూ కామెంట్లు చేస్తున్నారని... వాటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. బీజేపీ అధ్యక్షుడిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినట్లు స్పష్టం చేశారు.


టీఆర్ఎస్ పార్టీకి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తమ గుర్తు కారును పోలిన గుర్తును ఇతర పార్టీలకు కేటాయించొద్దని టీఆర్ఎస్ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈ సమయంలో పిటిషన్ పై జోక్యం చేసుకోలేమని హైకోర్టు వ్యాఖ్యానించింది. గతంలో జరిగిన ఎన్నికల్లో కారు గుర్తును పోలిన గుర్తుల (కెమెరా, చపాతీ రోలర్‌, డోలి (పల్లకి), రోడ్‌ రోలర్‌, సబ్బు పెట్టె, టీవీ, కుట్టుమిషన్‌, ఓడ)తో తమ అభ్యర్థులకు నష్టంమని, ఇతర పార్టీల అభ్యర్థులకు కారును పోలిన ఎన్నికల గుర్తులను కేటాయించవద్దని టీఆర్ఎస్ పార్టీ హైకోర్టులో పిటిషన్ వేయగా, నేడు విచారణ చేపట్టిన ధర్మాసనం ఆ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.