Ebrahim Raisi Death Report: ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతిపై (Iran President's Chopper Crash) విచారణ చేపట్టిన అధికారులు తొలి నివేదికను విడుదల చేశారు. సాయుధ బలగాలకు చెందిన జనరల్ స్టాఫ్‌ విభాగం ఈ రిపోర్ట్‌ని వెల్లడించింది. ఆయన మృతికి కారణాలేంటో అందులో వివరించింది. ప్రమాదం జరిగిన వెంటనే నిపుణులతో కూడిన సీనియర్ ఇన్వెస్టిగేషన్ కమిటీని నియమించారు. మరి కొంత మంది స్పెషలిస్ట్‌లూ ఈ కమిటీలో ఉన్నారు. వీళ్లంతా కలిసి ఘటనా స్థలంలో విచారణ చేపట్టారు. ఈ రిపోర్ట్‌ ప్రకారం...హెలికాప్టర్‌ సరైన రూట్‌లోనే ఉందని, ఎక్కడా డీవియేట్ కాలేదని తేలింది. అయితే..సరిగ్గా ప్రమాదం జరిగే 90 సెకన్ల ముందు పైలట్ ప్రెసిడెంట్‌ కాన్వాయ్‌లో ఉన్న మిగతా రెండు హెలికాప్టర్‌లలోని పైలట్స్‌ని సంప్రదించేందుకు ప్రయత్నించినట్టు నివేదిక వెల్లడించింది. ఎవరైనా టార్గెట్ చేసి చాపర్‌ని కాల్చారా అన్న కోణంలోనూ విచారించారు. అయితే..ఎక్కడా బులెట్‌లను గుర్తించలేదని అధికారులు తెలిపారు. పర్వతంపై కుప్ప కూలిన వెంటనే మంటలు అంటుకున్నాయి. విపరీతమైన మంచు కారణంగా అక్కడ సెర్చ్ ఆపరేషన్ కూడా కష్టమైందని తెలిపింది ఈ నివేదిక. మరుసటి రోజు తెల్లవారుజామున డ్రోన్‌ల సాయంతో హెలికాప్టర్ క్రాష్ అయిన స్థలాన్ని గుర్తించారు. ఇప్పటి వరకూ ఎలాంటి అనుమానాస్పద అంశాలు తమ దృష్టికి రాలేదని విచారణ అధికారులు స్పష్టం చేశారు. విచారణ కొనసాగుతున్న కొద్ది కీలక విషయాలు బయటపడే అవకాశాలున్నాయి. 


అంత్యక్రియలు


ఇబ్రహీం రైసీ అంత్యక్రియలకు వేలాది మంది పౌరులు తరలివచ్చారు. మషద్‌లోని  Imam Reza Shrine లో  ఆయనను ఖననం చేశారు. లక్షలాది మంది పర్యాటకులు తరలి వచ్చే ఈ ప్రాంతంలోనే ఆయనకు సమాధి కట్టారు. ఇక్కడ అంత్యక్రియలు జరిగిన తొలి ఇరాన్‌ నేతగా చరిత్రలో నిలిచిపోయారు రైసీ. ఇరాన్ సుప్రీం లీడర్‌ అయతొల్లకి వారసుడిగా ఉన్న రైసీ ఇలా అకస్మాత్తుగా మరణించడం అక్కడి రాజకీయాల్ని కుదిపేసింది. ఆ తరవాత అధ్యక్షుడు ఎవరు అన్న చర్చ వచ్చింది. రాజ్యాంగం ప్రకారం వైస్‌ ప్రెసిడెంట్ మహమ్మద్ మొక్బర్‌ని తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. జూన్ 28న తదుపరి అధ్యక్షుడి నియామకానికి ఎన్నికలు జరగనున్నాయి. 


ప్రమాదం ఎలా జరిగింది..?


ఈ నెల 19వ తేదీన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అజెర్బైజాన్‌ నుంచి ఇరాన్‌కి తిరిగి వస్తుండగా ఉన్నట్టుండి హెలికాప్టర్‌ కాంటాక్ట్ కట్ అయింది. దాదాపు అరగంట వరకూ పైలట్ నుంచి ఎలాంటి సమాచారం అందలేదు. ఆ తరవాత చాపర్‌ ఓ కొండపై కుప్ప కూలిపోయింది. ఈ ప్రమాదంలో అధ్యక్షుడు రైసీతో పాటు విదేశాంగ మంత్రి కూడా ప్రాణాలు కోల్పోయారు. అయితే..చాపర్‌ని గుర్తించడమే కష్టమైంది. విపరీతమైన మంచు కురుస్తుండడం వల్ల దాదాపు 16 గంటల తరవాత ప్రమాద స్థలాన్ని గుర్తించగలిగారు. ముందు దీన్ని ప్రమాదంగానే భావించినా ఉన్నట్టుండి కుప్ప కూలిపోవడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే..ఇప్పుడు విడుదలైన రిపోర్ట్ ఆధారంగా చూస్తే ఎక్కడా ఎలాంటి కుట్ర కోణం లేదని తేలింది. పూర్తి స్థాయిలో విచారణ జరిగితే మరిన్ని వివరాలు తెలిసే అవకాశాలున్నాయి. 


Also Read: Viral Video: కేదార్‌నాథ్‌లో అదుపుతప్పి గాల్లో గింగిరాలు కొట్టిన హెలికాప్టర్‌, ప్రయాణికుల పరుగులు - తప్పిన ప్రమాదం