Chopper Tailspin in Kedarnath: కేదార్‌నాథ్‌లో ఆరుగురు ప్యాసింజర్స్‌తో టేకాఫ్ అయిన హెలికాప్టర్‌ ఉన్నట్టుండి గాల్లో గిరగిరా తిరిగిపోయింది. చాలా సేపటి వరకూ అలా గాల్లో గింగిరాలు కొట్టింది. అందులో ఉన్న ప్రయాణికులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని కూర్చున్నారు. కాసేపటికి పైలట్‌ చాపర్‌ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు. సాంకేతిక లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు వెల్లడించారు. కేదార్‌నాథ్‌ హెలిప్యాడ్ నుంచి 100 మీటర్ల దూరంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. పైలట్‌తో పాటు ఆరుగురు ప్రయాణికులు సురక్షితంగానే ఉన్నారు. అయితే...హెలికాప్టర్‌ గాల్లో చక్కర్లు కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన జరిగినప్పుడు హెలిప్యాడ్ వద్ద ఉన్న మిగతా ప్రయాణికులు భయంతో పరుగులు పెట్టారు. కూలిపోతుందేమోనని ఆందోళన చెందారు. 






"సిర్సీ నుంచి కేదార్‌నాథ్‌కి వచ్చిన హెలికాప్టర్‌లో ఆరుగురు ప్రయాణికులున్నారు. కేదార్‌నాథ్ వద్ద ల్యాండ్ అయ్యే సమయంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఒక్కసారిగా చాపర్ అదుపు తప్పింది. పైలట్‌ అప్పటికే అప్రమత్తమయ్యాడు. కాసేపు గాల్లో అది చక్కర్లు కొట్టింది. ఆ తరవాత 100 మీటర్ల దూరంలో ల్యాండ్ అయింది. చాపర్‌లోని ఆరుగురు ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు"


- అధికారులు


ఈ ఏడాది మే 10 వ తేదీన చార్‌ధామ్ యాత్ర మొదలైంది. గంగోత్రి, యమునోత్రితో పాటు కేదార్‌నాథ్‌ యాత్రకు లైన్ క్లియర్ అయింది. మే 12వ తేదీన బద్రినాథ్ ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. భక్తులు యమునోత్రి నుంచి యాత్ర మొదలు పెడతారు. అక్కడి నుంచి గంగోత్రి వెళ్తారు. అక్కడి నుంచి కేదార్‌నాథ్‌కి వెళ్లి చివర్లో బద్రినాథ్‌ని దర్శించుకుంటారు. ఇక్కడితో చార్‌ధామ్ యాత్ర ముగుస్తుంది. ఈ యాత్రను దృష్టిలో పెట్టుకుని ఉత్తరాఖండ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.