International Fleet Review: ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో పాల్గొనేందుకు రెండు భారత నౌకలు జపాన్ కు చేరుకున్నాయి. ఫ్లీట్ లో పాల్గొనేందుకు భారత నౌకాదళం శివాలిక్, కమోర్టా అనే నౌకలను పంపింది. 2 నవంబర్ 2022న జపాన్‌లోని యోకోసుకా చేరుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. జపాన్ మారిటైమ్ ఫర్ సెల్ఫ్ డిఫెన్స్ 70వ వార్షికోత్సవం సందర్భంగా ఇంటర్నేషన్ ఫ్లీట్ రివ్యూను నిర్వహించనున్నారు. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో 13 దేశాల నుంచి 40 నౌకలు, జలాంతర్గాములు పాల్గొంటాయి.
జపాన్ మారిటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ అక్టోబర్ 29 నుంచి నవంబర్ 13 వరకు “ఫ్లీట్ వీక్” జరుపుకుంటుంది. ఓపెన్ షిప్, ఓవర్ సీస్ నుంచి మిలిటరీ బ్యాండ్‌లతో కచేరీ, అడ్వర్టైజింగ్ ఈవెంట్‌లు, కవాతుతో సహా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నవంబర్ 6వ తేదీన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ జరగనుంది. జపాన్ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ పూర్తయిన తర్వాత, భారత నౌకాదళ ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా నౌకాదళాలతో కలిసి మలబార్-22 26వ ఎడిషన్‌లో పాల్గొననున్నాయి.
మలబార్ ఎక్సర్‌సైజ్ అంటే ఏమిటి?
మలబార్ ఎక్సర్‌సైజ్ 1992లో ప్రారంభమైంది. 2002 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం ఈ కసరత్తును నిర్వహిస్తున్నారు. ఇది US సహకారంతో ప్రారంభమైనప్పటికీ, తరువాత ఇతర దేశాలు ఈ కార్యక్రమంలో చేరాయి. 2007లో జపాన్, ఆస్ట్రేలియా నౌకాదళ వ్యాయామంలో పాల్గొన్నాయి. 2014 నుంచి జపాన్, యునైటెడ్ స్టేట్స్ ఇందులో పాలుపంచుకుంటున్నాయి. జపాన్ 2015లో ఈ మలబార్ విన్యాస కార్యక్రమంలో శాశ్వత సభ్యునిగా చేరింది.
ఈ సంవత్సరం నావికాదళం 25వ ఎడిషన్ మారిటైమ్ ఆపరేషన్‌లో యాంటీ-సర్ఫేస్ యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్ వ్యూహాలను కలిగి ఉందని ప్రకటించింది. అంతేకాకుండా ఇది అత్యంత అసాధారణమైన నౌకాదళ భద్రతా కార్యకలాపాల‌్లో ఒకటిగా గుర్తించారు. విదేశీ సంబంధాలను పెంపొందించడానికి, ప్రపంచ శక్తుల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ఈ మలబార్ విన్యాసాలు చాలా కీలకం. 1992 నుంచి పాల్గొనే దేశాలలోని వివిధ తీరప్రాంతాలలో ఈ కార్యకలాపం నిరంతరంగా జరుగుతోంది.
1998కి ముందు మూడు సార్లు ఈ విన్యాసాలు జరిగాయి. భారతదేశం అణ్వాయుధ పరీక్షచేసిన తరువాత వీటిని అమెరికన్లు నిలిపివేశారు. అంతర్జాతీయ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ చేసిన ప్రచారంలో భారతదేశం చేరినప్పుడు సెప్టెంబర్ 11 దాడుల తరువాత యునైటెడ్ స్టేట్స్ సైనిక సంబంధాలను పునరుద్ధరించింది.
ప్రతి ఏటా నిర్వహించే ఈ విన్యాసాల్లో 2015 నుంచి జపాన్ కూడా శాశ్వత భాగస్వామిగా చేరింది. గత సంవత్సరం జపాన్ తీరంలో ఈ విన్యాసాలు జరపగా, 2018లో ఫిలిప్పైన్స్ సముద్ర తీరంలో జరిపారు. 2020లోని విన్యాసాల్లో భారత్‌తోపాటు అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలకు చెందిన నేవీ ఫోర్స్ పాల్గొన్నాయి. ఇందులో ఆస్ట్రేలియా తొలిసారిగా ఈ విన్యాసాల్లో పాలుపంచుకుంటోంది. 2020 నవంబర్ లో కొనసాగనున్న మొదటి దశ కసరత్తుల్లో కొవిడ్-19 పరిమితుల కారణంగా నాలుగు దేశాల సైనిక సిబ్బంది మధ్య ఎటువంటి సంబంధం లేదు. ఈ నాలుగు దేశాల నావికా దళాలు కలసి విన్యాసాలు చేయడం పదమూడేళ్లలో ఇదే మొదటిసారి. 24వ విడతగా చేపడుతున్న ఈ విన్యాసాలు రెండో దశలో నవంబరు 2020లో 17 నుంచి 20వ తేదీ వరకుఅరేబియ సముద్రంలో కొనసాగాయి.