Extreme Heat in India: వాతావరణ మార్పులతో ఇప్పటికే భూమి అట్టుడుకుతోంది. అకాల వర్షాలు, కరవు పరిస్థితులు అల్లాడిస్తున్నాయి. అటు హిమాలయ పర్వతాలు కూడా కరిగిపోతున్నాయంటే భూతాపం ఎంతగా పెరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. హిమాలయాల కారణంగానే Indo-Gangetic Plains ఏర్పడ్డాయి. పంజాబ్, హరియాణా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బిహార్, ఝార్ఖండ్, వెస్ట్ బెంగాల్, అసోం రాష్ట్రాలు ఈ మైదానాల్లోనే ఉన్నాయి. అయితే...ఇప్పుడీ ప్రాంతాలన్నింటిపైనా వాతావరణ మార్పుల ప్రభావం పడుతోంది. Indian Institute of Technology కి చెందిన కొందరు సైంటిస్ట్‌లు ఈ హెచ్చరికలు చేశారు. ఇండస్, గంగా నదీ పరివాహక ప్రాంతాల్లో త్వరలోనే పరిస్థితులు దారుణంగా మారే ప్రమాదముందని చెబుతున్నారు. విపరీతమైన ఉష్ణోగ్రతలు ఇప్పటికే ఇబ్బంది పెడుతున్నాయని, ఇది పోనుపోను అతి పెద్ద సమస్యగా మారుతుందని అంటున్నారు. అనుకోని కరవు, వడగాలులు, ఉన్నట్టుండి భారీ వర్షాలు, విపరీతమైన ఉష్ణోగ్రతలు...ఇలా ఆ ప్రభావాలు కనిపిస్తాయని వాళ్ల అధ్యయనం చెబుతోంది. జనాభా పెరుగుదల, వాతావరణంలోకి కర్బన ఉద్గారాలు భారీ విడుదలవుతుండడం లాంటి పరిణామాలతో ఇది మరింత సంక్లిష్టంగా మారే అవకాశాలున్నాయి. క్రమంగా ఇండస్-గంగా నదీ మైదానాల్లోని ప్రాంతాలన్నీ హాట్‌స్పాట్‌లుగా మారొచ్చని హెచ్చరిస్తున్నారు సైంటిస్ట్‌లు. ఇప్పటికే Indo-Gangetic Plainsని హాట్‌స్పాట్‌గా గుర్తించారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభాలో ఉన్న ఈ ప్రాంతంలో ఇలాంటి సవాళ్లు ఎదురైతే కష్టమే అంటున్నారు.
ఈ ప్రాంతాల్లో బియ్యం, గోధుమలు ఎక్కువగా పండుతాయి. వాతావరణ మార్పులు తీవ్రమైతే ఈ పంటల దిగుబడిపై ప్రభావం పడే ప్రమాదముంది. అయితే...ఈ సమస్యల్ని ఎదుర్కోడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా సైంటిస్ట్‌లు కొన్ని సూచనలు చేస్తున్నారు. ఉష్ణోగ్రతలు, కరవులనూ తట్టుకుని నిలబడగలిగే విత్తనాలనే చల్లడం, వరదల్ని తట్టుకునేలా డ్యామ్‌లు నిర్మించడం, వర్షాకాలంలో ఆ నీటికి పెద్ద ఎత్తున నిల్వ చేసుకోవడం లాంటివి చేయాలని సూచిస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ పెరుగుతున్న ఈ సమయంలో ఇలాంటి చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేస్తున్నారు.