India's Solar Waste: 2030 నాటికి భారత్‌లో సౌర వ్యర్థాలు (Solar Waste) 600 కిలో టన్నులకు చేరుకుంటుందని Ministry of New and Renewable Energy వెల్లడించింది. మొత్తం 5 రాష్ట్రాల నుంచే ఈ వ్యర్థాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నాయని స్పష్టం చేసింది. ఈ వేస్ట్ అంతా కలిపితే 720 ఒలిపింక్ సైజ్ స్విమ్మింగ్ పూల్స్‌తో సమానం అని వివరించింది. రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల నుంచి ఎక్కువగా వ్యర్థాలు పోగవుతున్నాయని తెలిపింది. సోలార్ ప్యానెల్స్‌తో పాటు అందుకు సంబంధించిన ఎక్విప్‌మెంట్ వ్యర్థాలు పెద్ద ఎత్తున ఉత్పత్తి అవుతున్నాయి. వీటిలో సిలికాన్, గ్లాస్, మెటల్, ప్లాస్టిక్ ఉంటాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 66.7 గిగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. వీటి ద్వారా దాదాపు 100 కిలోటన్నుల వేస్ట్ తయారైంది. ఇదే 2030 నాటికి 340 కిలో టన్నుల వరకూ పెరిగే అవకాశముందని ఈ రిపోర్ట్ వెల్లడించింది. ఇందులో 10 కిలోటన్నుల సిలికాన్, 12-18 టన్నుల సిల్వర్, 16 టన్నుల కాడ్మియం, టెల్లూరియం వ్యర్థాలు ఉండే అవకాశముందని తెలిపింది. ఇవన్నీ కీలకమైన ఖనిజాలే. ఇవన్నీ ఇలా వృథా అవడంపైనే ఎక్స్‌పర్ట్‌లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటిని రీసైక్లింగ్ చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నారు.
ప్రస్తుతానికి ఈ ఖనిజాలను వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది భారత్. ఇప్పుడు సౌర వ్యర్థాల్ని రీసైక్లింగ్ చేయడం ద్వారా ఆ మేరకు భారం తగ్గుతుందన్నది నిపుణుల అభిప్రాయం. 2024-30 మధ్య కాలంలో ఇన్‌స్టాల్ చేసే సోరాల్ ప్యానెల్స్ ద్వారా కనీసం 260 కిలో టన్నుల వ్యర్థాలు పోగయ్యే అవకాశముందని ఈ నివేదిక అంచనా వేసింది. 2050 నాటికి సౌర వ్యర్థాలు 19 వేల కిలోటన్నుల వరకూ చేరుకుంటుందని ఈ నివేదిక చెబుతోంది. వీటిలో దాదాపు 77% మేర కొత్తగా ఏర్పాటు చేసే ప్యానెల్స్ ద్వారానే ఉత్పత్తవుతుందని వివరిస్తోంది. సోలార్ ఇండస్ట్రీలో దూసుకుపోవాలని చూస్తున్న సమయంలో ఇది సవాల్‌గా మారనుంది. 2030 నాటికి 292 గిగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తిని చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇలాంటి తరుణంలో ఈ రిపోర్ట్ రావడం సవాల్‌గా మారింది.