Suella Braverman: భారత సంతతికి చెందిన న్యాయవాది సుయెల్లా బ్రెవర్మాన్ అరుదైన ఘనత సాధించారు. బ్రిటన్ హోం మంత్రిగా ఆమె నియమితులయ్యారు. భారత సంతతికి చెందిన మరో మహిళ ప్రీతి పటేల్ స్థానంలో బ్రెవర్మాన్ ఆ బాధ్యతల్ని స్వీకరించనున్నారు.
లిజ్ ఆసక్తి
బ్రిటన్ కొత్త ప్రధానిగా ఎన్నికైన లిజ్ ట్రస్ కేబినెట్‌ను విస్తరిస్తున్నారు. దీంతో హోంశాఖ మంత్రిగా బ్రెవర్మాన్‌ను నియమించారు. 42 ఏళ్ల కన్జర్వేటివ్ పార్టీ నేత అయిన బ్రెవర్మాన్.. గత బోరిస్ జాన్సన్ ప్రభుత్వంలో అటార్నీ జనరల్‌గా పని చేశారు.
ప్రొఫైల్
- బ్రెవర్మాన్.. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో న్యాయ విద్యను అభ్యసించారు.
- 2018లో రాయల్ బ్రెవర్మాన్‌ను ఆమె పెళ్లాడారు.
- కేబినెట్ మంత్రిగా ఉంటూనే ఆమె రెండో పాపకు జన్మనిచ్చింది.
- బ్రెవర్మాన్ బౌద్ద మతాన్ని స్వీకరించారు.
- సుయెల్లా బ్రెవర్మాన్‌కు ఇద్దరు పిల్లలు.
- బ్రెవర్మాన్ తల్లి హిందూ తమిళియన్. ఆమె పేరు ఉమ.
- తండ్రి గోవాకు చెందిన క్రిస్టీ ఫెర్నాండెజ్.
- ఆమె తల్లి మారిషస్ నుంచి యూకే వలస వెళ్లగా, తండ్రి 1960లలో కెన్యా నుంచి వలస వచ్చారు.
లిజ్ ట్రస్ గెలుపు
హోరాహోరి పోరులో నెగ్గి కన్జర్వేటివ్ పార్టీ నేతగా ఎన్నికైన లిజ్ ట్రస్ (47)ను బ్రిటన్ ప్రధానిగా రాణి ఎలిజబెత్-2 లాంఛనంగా నియమించారు. ట్రస్ మంగళవారం స్కాట్లాండ్ వెళ్లి అక్కడి బాల్మోరల్ క్యాజిల్‌లో వేసవి విడిదిలో సేద దీరుతున్న క్వీన్ ఎలిజబెత్‌తో భేటీ అయ్యారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఈ సందర్భంగా రాణి ఆమెను ఆహ్వానించారు. అంతకుముందు తాత్కాలిక ప్రధాని బోరిస్ జాన్సన్ (58) రాణికి తన రాజీనామా సమర్పించారు.
బ్రిటన్‌ను సంక్షోభం నుంచి బయట పడేసేందుకు తన వద్ద సాహసోపేత ప్రణాళికలున్నాయని ప్రధాని లిజ్ ట్రస్ ప్రకటించారు. పన్ను కోతలు, సంస్కరణలతో ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టిస్తానని ప్రధానిగా తన తొలి ప్రసంగంలో పేర్కొన్నారు.