UK MP Shivani Raja Takes Oath: భారత సంతతికి చెందిన శివాని రాజా (UK MP Shivani Raja) ఇటీవల జరిగిన యూకే ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించారు. 37 ఏళ్లుగా Leicester East నియోజకవర్గంలో కన్జర్వేటివ్ పార్టీకి చెందిన నేత గెలవలేదు. ఇన్నేళ్ల తరవాత గెలిచి శివాని రాజా రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా ఆమె పార్లమెంట్ సాక్షిగా జులై 10వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆమె భగవద్గీతపై ప్రమాణం చేసి ప్రమాణ స్వీకారం చేశారు. గుజరాత్‌కి చెందిన శివాని రాజా సోషల్ మీడియాలో ఈ వీడియో షేర్ చేశారు. భగవద్గీతపై ప్రమాణం చేసి బాధ్యతలు తీసుకోవడం చాలా గర్వంగా ఉందని పోస్ట్ పెట్టారు.
"లైసెస్టర్ ఈస్ట్ ఎంపీగా పార్లమెంట్ సాక్షిగా ప్రమాణ స్వీకారం చేయడం చాలా సంతోషంగా ఉంది. కింగ్ ఛార్లెస్‌కి విధేయంగా ఉంటానని భగవద్గీత సాక్షిగా ప్రమాణ స్వీకారం చేయడం ఎంతో గర్వంగా ఉంది"
- శివాని రాజా, యూకే ఎంపీ
37 ఏళ్లుగా లేబర్ పార్టీ కంచుకోటగా ఉన్న లైసెస్టర్ ఈస్ట్ నియోజకవర్గంలో శివాని రాజా (UK Election 2024) గెలవడం సంచలనమైంది. 29 ఏళ్ల ఈ ఎంపీ ప్రత్యర్థిపై 4 వేలకు పైగా ఓట్లతో విజయం సాధించారు. ఇక్కడే మరి కొందరు కీలక నేతలు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలవడం వల్ల ఇక్కడి ఎన్నికపై ఆసక్తి నెలకొంది. ఇటీవల జరిగిన యూకే ఎన్నికల్లో లేబర్ పార్టీ 411 చోట్ల విజయం సాధించగా కన్జర్వేటివ్ పార్టీ 121 స్థానాలకు పరిమితమైంది. లిబరల్ డెమొక్రాట్స్‌కి 72 సీట్లు వచ్చాయి. ఈ ఫలితాల తరవాత ప్రధాని పదవికి రిషి సునాక్ రాజీనామా చేశారు. కీర్ స్టార్మర్ (Keir Starmer) ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.