Chandra Babu About Media: ఆంధ్రప్రదేశ్‌లో మీడియా స్వేచ్ఛ లేదంటూ మాజీ సీఎం జగన్ చేసిన ట్వీట్, బుధవారం ఓ పత్రికా ఆఫీస్‌పై టీడీపీ శ్రేణుల దాడి నేపథ్యంలో సీఎం చంద్రబాబు కీలక పోస్టు పెట్టారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌నిర్మాణానికి కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తూ ఇప్పటి వరకు చేసిన కవరేజ్‌కు ధన్యవాదాలు తెలిపారు. 


చంద్రబాబు చేసిన ట్వీట్‌లో ఏముంది అంటే.... "ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం ఒక లక్ష్యంతో మేమంతా ముందుకెళ్తున్నాం. గత ప్రభుత్వం ఎక్కడ వదిలిపెట్టిందో చూస్తే కానీ ఇది ఎంత సవాలో అర్థం కాదు. అందుకే వాటిని అధిగమించి పని చేస్తున్న మేమంతా ఈ మిషన్‌లో కష్టపడుతున్నాం. దీనికి మీ అందరి మద్దతు చాలా అవసరం. ముఖ్యంగా ప్రజాస్వామ్యానికి నాల్గో స్తంభమైన మీడియా సహకారం మరింత అవసరం. ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంచుతూ పౌరులకు సమాచారం అందించడంలో మీడియాదే కీలక పాత్ర.






నేను నిన్న బీపీసీఎల్‌తో కీలకమైన సమావేశంలో ఉన్నారు. దీని వల్ల భారీగా పెట్టుబడులు రానున్నాయి. ఉద్యోగాల కల్పన జరగనుంది. గత ఐదేళ్లులో జరిగిన విధ్వంసం నుంచి కోలుకునేందుకు ఇదో ప్రయత్నం. పురోగతికి రాజకీయాలు అడ్డంకిగా మారినప్పుడు, సహకారం స్థానంలో అవినీతి,  అభివృద్ధి స్థానంలో విధ్వంసం రాజ్యమేలినప్పుడు పెట్టుబడిదారులు విశ్వాసం కోల్పోయాం. చాలా మంది రాష్ట్రం విడిచిపెట్టారు. ఇది రాష్ట్ర  ఆర్థిక వ్యవస్థ, ప్రజల ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపింది. ఇలాంటి సమయంలో పెట్టుబడిదారుల విశ్వాసాన్ని తిరిగి పొందడం చాలా కీలకం.


నిన్న జరిగిన మీటింగ్‌ గురించి పాజిటివ్ స్టోరీలు వేసిన మీడియాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ అందిస్తున్న అవకాశాలు ప్రచారం చేయడానికి మీ స్టోరీలు చాలా హెల్ప్ అవుతాయి. పెట్టుబడిదారులకు మన రాష్ట్రం నమ్మదగినదిని సురక్షితమైన గమ్యస్థానమని భరోసా ఇచ్చేందుకు సహాయ పడతాయి. ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు మనమంతా కలిసికట్టుగా పని చేయాలని ఆశిస్తున్నాను." అని చంద్రబాబు ట్వీట్ చేశారు.