Canada-US Border: 


కెనడా, అమెరికా సరిహద్దులో ఘటన..


కెనడా నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు చూసిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో భారతీయులూ ఉన్నారు. కెనడా, అమెరికా సరిహద్దు ప్రాంతంలో ఆరుగురి మృతదేహాలను గుర్తించినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఆరుగురు రెండు వేరు వేరు కుటుంబాలకు చెందిన వాళ్లుగా నిర్ధరించారు. మృతుల్లో మూడేళ్ల లోపు చిన్నారి కూడా ఉన్నట్టు తెలిపారు. వీళ్లంతా కెనడా నుంచి అమెరికాలోకి అక్రమంగా వచ్చేందుకు ప్రయత్నించినట్టు పోలీసులు స్పష్టం చేశారు. బురదలో వీళ్ల మృతదేహాలను గుర్తించారు. కెనడా నుంచి ఓ పడవలో సరిహద్దు వరకూ వచ్చినట్టు వివరించారు. అయితే...ఆ పడవ మునిగిపోయి ఉందని, నీళ్లలో పడి వీళ్లు మృతి చెంది ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ బోట్ ఓనర్ కోసం గాలిస్తున్నారు పోలీసులు. ఈ ఆరుగురితో పాటు మరో చిన్నారి కూడా ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. ఆ చిన్నారి పాస్‌పోర్ట్‌ కనిపించినప్పటికీ...మృతదేహం మాత్రం లభ్యం కాలేదు. ప్రస్తుతం గజ ఈతగాళ్లు రంగంలోకి దిగి ఆ చిన్నారి కోసం గాలిస్తున్నారు. ఏరియల్ సెర్చ్‌ చేసిన క్రమంలోనే ఈ డెడ్‌బాడీస్‌ని గుర్తించారు. అయితే..వీళ్ల మరణానికి కారణమేంటన్నది మాత్రం ఇంకా తేలలేదు. అటాప్సీ రిపోర్ట్ వచ్చిన తరవాతే మిగతా వివరాలు వెల్లడిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. అమెరికా-కెనడా సరిహద్దులో ఈ తరహా ఘటనలు...తరచూ జరుగుతున్నాయి. 


గతేడాదిలోనూ...


గతేడాది జనవరిలోనూ యూఎస్‌ కెనడా సరిహద్దుల్లో విషాదం చోటు చేసుకుంది. అక్రమంగా సరిహద్దులు దాటుతూ ఓ ఫ్యామిలీ బలైపోయింది. అతి శీతల వాతావరణం ఆ కుటుంబాన్ని బలి తీసుకుంది.  ఎమర్సన్ సమీపంలో యూఎస్-కెనడా సరిహద్దుల్లో ఈ దుర్ఘటన జరిగింది. మైనస్ 35 డిగ్రీల చలిలో ఆ భారతీయ ఫ్యామిలీ గడ్డకట్టుకుపోయి మృతి చెందింది. చనిపోయినవారిలో భార్య, భర్త, టీనేజి బాబు, నవజాత శిశువు ఉన్నారు. కెనడా సరిహద్దు దాటి యూఎస్‌లో ప్రవేశించిన మరికొందర్ని యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ విభాగం పట్టుకుంది. పట్టుకున్నవారిలో ఒకరి వద్ద నవజాత శిశువుకు సంబంధించిన ఆహారం, డైపర్లు, ఇతర వస్తువులు ఉన్నాయి. ఆ టీంలో నవజాత శిశువు లేకపోవడంతో అధికారులు వారిని ప్రశ్నించారు. ఇలా సరిహద్దులు దాటుతున్న వారంతా భారతీయులుగా అమెరికా అధికారులు గుర్తించారు. సరిహద్దులు దాటించే ముఠాను నమ్ముకుని వీళ్లంతా  బలయ్యారు. సరిహద్దుకు 9-10 మీటర్ల దూరంలో ఈ ఫ్యామిలీ చనిపోయింది.  ప్రతికూల వాతావరణంలో సరిహద్దులు దాటించే ప్రయత్నం చేసిందా ముఠా. చిమ్మ చీకట్లలో ఎటుచూసినా కమ్ముకున్న మంచులో కాలినడక ప్రయాణమయ్యారు. అత్యంత భయంకరమైన పరిస్థితుల్లో సరిహద్దులు దాటే ప్రయత్నంలో ఇలా విగతజీవులుగా మిగిలారు. ఇలా చాలా సందర్భాల్లో కొందరు ప్రాణాలు కోల్పోయారు. ఇది అక్రమం అని తెలిసినా...ఇలాగే సరిహద్దు దాటేందుకు ప్రయత్నిస్తూ ప్రమాదంలో చిక్కుకుంటున్నారు. అమెరికా మాత్రం ఈ అక్రమ వలసలపై చాలా సీరియస్‌గా ఉంది. కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తోంది. ఇలా అక్రమంగా దాటించే ముఠాలపైనా నిఘా పెడుతోంది. 


Also Read: Howrah Violence: హింసాత్మకంగా మారిన నవమి వేడుకలు, బెంగాల్‌లో బీజేపీ వర్సెస్ టీఎంసీ వార్